ఆలోచిద్దాం... స్నేహం చేద్దాం!

ప్రపంచంలో ఏ మూల ఉన్నా మనమంతా ఒక్కటే... సోదరీమణులమే. ఒకరికొకరం సాయం చేసుకోవాలి. సమస్యల పట్ల అవగాహన పెంచుకుని, పరిష్కరించుకోవాలి. సాధికారత దిశగా అడుగులేయాలి.

Eenadu icon
By Vasundhara Team Published : 22 Feb 2026 02:36 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ప్రపంచంలో ఏ మూల ఉన్నా మనమంతా ఒక్కటే... సోదరీమణులమే. ఒకరికొకరం సాయం చేసుకోవాలి. సమస్యల పట్ల అవగాహన పెంచుకుని, పరిష్కరించుకోవాలి. సాధికారత దిశగా అడుగులేయాలి. విరాళాలు సేకరించడం, సేవ చేయడం... వంటి కార్యక్రమాల్లో భాగం కావాలి అంటోంది ‘వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గర్ల్‌ గైడ్స్‌ అండ్‌ గర్ల్‌ స్కౌట్స్‌’. అందుకోసం ఏటా ఒక థీమ్‌తో ‘వరల్డ్‌ థింకింగ్‌ డే’ను ఫిబ్రవరి 22న జరుపుతోంది. అలా ఈ ఏడాది ‘మన స్నేహం’ అన్నదాన్ని థీమ్‌గా ఎంపిక చేసుకుంది.

కాలచక్రం బుల్లెట్‌ రైలుతో పోటీపడుతోంది. రెప్ప మూసి తెరిచేలోగా రోజులు కరిగిపోతున్నాయి. ఎంతైనా ఏఐ ప్రపంచం కదా. అప్‌డేట్‌ కాకపోతే వెనకబడిపోతాం. ఇది సాంకేతికతకే కాదు. స్నేహబంధానికీ వర్తిస్తుంది. లేదంటే నేస్తాల్ని పోగొట్టుకుంటాం. 

మేహన, మేఘన ప్రాణ స్నేహితులు. చదువు, పెళ్లి, ఉద్యోగం, పిల్లలు... ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ. భౌతికంగా దూరంగా ఉన్నా ఆరునెలలకో ఏడాదికో కలిసినప్పుడు అదే ఆప్యాయత. కానీ ఈమధ్యే... ఏదో మార్పు. కలిసినప్పుడూ ఎవరి ఆలోచనలు వాళ్లవి. మాట్లాడుకున్నా పెదాలపై పూతలే... ఆనాటి స్నేహంలో ఎక్కడో అపశృతి...

‘ఒక వీడ్కోలు... కొత్త హలోకి దారితీస్తుంద’ని ‘ది అల్కెమిస్ట్‌’ రచయిత పాలో కొయిలో అన్నట్లు పాత స్నేహం కీబోర్డు ఫోన్‌లా బోరుకొట్టి ఉండొచ్చు... కొత్త పరిచయాలు స్మార్ట్‌ఫోన్‌లా ఆకర్షిస్తుండొచ్చు. అలాగని దీన్ని తప్పుపట్టలేం. ఎందుకంటే కొన్ని స్నేహాలు కాలంతోపాటు వెనక్కెళ్లిపోతాయి. ఇది సహజం... పరిణామ సూత్రం. సమయం, ప్రాధాన్యతలు, ఆసక్తులు, విలువలు వేరయినప్పుడు బంధాలూ వేరవుతాయి. ఒక దశకే పరిమితమై అక్కడితో ఆగిపోతాయి. అలాగని కొత్త పరిచయాల్నైనా స్నేహంగా మలచుకోగలుగుతున్నామా అన్నది... ఆలోచించాల్సిందే!

ఈమధ్య స్నేహితులనేకాదు, అక్కచెల్లెళ్లు, బంధువుల మధ్యా ఏదో అడ్డగీత. కనిపించని శూన్యం... స్పందన లోపించిన హృదయాలు, భావం లేని మాటలు... ఎందుకిలా? ఏం కొన్నారు, ఎలా జీవిస్తున్నాం... వీటిని మించిన మాటల్లేవా, తీపి జ్ఞాపకాలెటుపోయాయి? ఒక్కసారి టైమ్‌ మెషీనెక్కి వెనక్కెళితే ఎంత బాగుంటుందో... అని ఏ ఒక్కరికీ అనిపించడం లేదెందుకని? వీళ్లే కాదు, మిలీనియల్స్, జెన్‌ జీల్లోనూ ఇదే ధోరణి. హాయ్, హలో, వాట్సప్, వావ్‌లతోనే సరి.

‘మనసు భారాన్ని పంచుకోవడానికి ఇద్దరు స్నేహితులైనా మిగిలున్నారా’ అనుకునే రోజొకటి వస్తుంది అన్నదాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అందుకే బాగా థింక్‌ చేయండి. అలాగని ఆలోచిస్తూనే ఉండిపోకండి. నెట్‌వర్క్‌ పెంచుకోండి. అందరితో స్నేహం చేయండి సంతోషంగా ఉండండి అంటున్నారు గర్ల్‌ గైడ్స్‌ అండ్‌ గర్ల్‌ స్కౌట్స్‌ సభ్యులు.

‘ఎంత సంపాదించాం అన్నది కాదు, ఫేస్‌బుక్‌లోనో ఇన్‌స్టాలోనో ఎంతమంది ఫాలో అవుతున్నారనేదీ కాదు. మనకంటూ కష్టం వస్తే ఒక్క క్షణం వెనకాముందూ ఆలోచించకుండా పరుగెత్తుకొచ్చే ప్రాణ స్నేహితులు ఒక్కరైనా ఉండాలి’ అని అనుకుంటాం కదా. మరి మనమూ అలాగే ఉంటున్నామా అన్నదీ ఆలోచించండి. అలాంటి స్నేహితులు మీకున్నా మీరూ అలాగే ఉన్నా గుండెలమీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోవచ్చు... అది ఆరోగ్యాన్నీ ఆయుష్షునీ పెంచుతుంది. అలా లేరనుకుంటే ఈ రోజునుంచే జీవన శైలిని మార్చుకోవాల్సిందే. లేకపోతే ఏదోక దశలో ఒంటరితనం వెతుక్కుంటూ వస్తుంది.

అందుకే మరి... ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని థింక్‌ చేద్దాం! సరిహద్దులూ సంస్కృతులతో సంబంధం లేకుండా చేయీ చేయీ కలుపుదాం. స్నేహంగా ఉందాం... స్నేహాన్ని పంచుదాం... సమస్యలకీ స్పందిద్దాం!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న గర్ల్‌ గైడ్స్‌ అండ్‌ గర్ల్‌ స్కౌట్స్‌ ప్రతినిధులు 1926 నాటి సమావేశంలో తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక రోజు ఉండాలనుకున్నారు. దానికే ‘థింకింగ్‌ డే’గా పేరు పెట్టడంతోపాటు బాయ్‌ స్కౌట్‌ ఉద్యమ స్థాపకులైన లార్డ్‌ పావెల్, ఆయన భార్య వరల్డ్‌ చీఫ్‌ గైడ్‌ ఒలావ్‌ పావెల్‌ ఇద్దరి పుట్టినరోజూ అయిన ఫిబ్రవరి 22ను ఎంపికచేశారు. అలా మొదలైన ఈ థింకింగ్‌ డేకి నేటికి వందేళ్లు. ఈ గైడ్స్‌ అండ్‌ స్కౌట్స్‌ సంస్థకు అలా మొత్తం ఐదు కేంద్రాలు ఉండగా అందులో ఒకటి మనదేశంలో ‘సంగం’ పేరుతో పుణెలో ఉంది.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :