మోతాదులోనే ఎరువులు వాడాలి

మోతాదులోనే ఎరువులు వాడాలి

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి:మిరప పంటలో తగిన మోతాదులోనే రసాయన ఎరువులను వాడాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మిరపకోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొండాయిల్‌పల్లిలో శనివారం రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిరపకోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతుల అభిప్రాయాలను అడిగితెలుసుకున్నారు. మిరప సాగులో కూలీల సమస్యను అధిగమించేందుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని, మార్కెట్‌లో దోపిడీని అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూసారం దెబ్బతింటుందని తెలిపారు. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ శాస్త్రవేత్తలు సూచించిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మార్కెట్‌లో మిర్చికి మంచి ధర లభిస్తుందని తెలిపారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం శాస్ల్రవేత్త డాక్టర్‌ రాజకుమార్‌ విదేశీ ఎగుమతులకు అవసరమైన నాణ్యతా ప్రమాణాలు, మిర్చి ఆరబెట్టెటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడి కోసం పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించారు. నర్సంపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలాయి శ్రీనివాస్‌, సర్పంచ్‌ ఎరుకల స్వప్న, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్‌ ఆఫీసర్‌ సురేఖ, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏడీఏ దామోదర్‌ రెడ్డి, ఉద్యాన అధికారి జ్యోతి, మండల వ్యవసాయాధికారి బన్న రజిత, ఉద్యాన టెక్నికల్‌ అధికారి రాకేశ్‌, పంచాయతీ కార్యదర్శి రజిత, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.