Gold Price non stop crash reasons gold fall latest gold rates

దేశంలో బంగారం ధరలు నాన్‌స్టాప్‌గా తగ్గుముఖం పట్టాయి. పసిడి కొనుగోలుదారులకు భారీగా ఊరటనిస్తున్నాయి. దేశంలో పసిడి ధర నాలుగు రోజుల్లో సుమారు రూ.3 వేల మేర దిగివచ్చింది. పుత్తడి ధరలు రూ.లక్షన్నర దిగువకు రావడంతో కొనుగోలుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 12 నుంచి 15 వరకు గత నాలుగు రోజుల్లో పుత్తడి ధరలను పరిశీలిస్తే.. అక్టోబర్‌ 11తో పోలిస్తే 15 నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.3,170, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.2,910 తగ్గింది. అక్టోబర్‌ 11న 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,51,420 ఉండగా నేడు (అక్టోబర్‌ 15) రూ.1,48,250 లకు వచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర అక్టోబర్‌ 11న రూ.1,38,800 ఉండగా నేడు రూ.1,35,890 దిగివచ్చింది.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలివే!

అమెరికాలో పెరిగిన ద్రవ్యోల్బణం

అమెరికాలో సెప్టెంబర్‌ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) వార్షిక ప్రాతిపదికన 3.7 శాతానికి చేరింది. మార్కెట్‌ అంచనా 3.6 శాతంగా ఉండగా, అంతకంటే ఎక్కువగా నమోదైంది. నెలవారీ ద్రవ్యోల్బణం కూడా 0.6 శాతానికి పెరిగింది. దీంతో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలపై అంచనాలు బలపడ్డాయి. ఈ పరిణామం బంగారం, వెండి ధరలపై ఒత్తిడిని పెంచింది.

వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు

బంగారం నుంచి సాధారణంగా వడ్డీ ఆదాయం లభించదు. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు వంటి వడ్డీ చెల్లించే పెట్టుబడులపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశ వ్యయం పెరుగుతుంది. అక్టోబర్‌, డిసెంబర్‌ ఫెడ్‌ సమావేశాల్లో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ప్రస్తుతం మార్కెట్‌ వర్గాల్లో కీలకంగా మారింది. డిసెంబర్‌లో రేట్ల పెంపు అవకాశంపై అంచనాలు పెరగడం పసిడి ధరలకు ప్రతికూలంగా మారింది.

బలపడిన అమెరికా డాలర్‌

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు డాలర్లలో నిర్ణయిస్తారు. డాలర్‌ బలపడితే ఇతర కరెన్సీలు కలిగిన కొనుగోలుదారులకు బంగారం ఖరీదుగా మారుతుంది. దీంతో డిమాండ్‌పై ఒత్తిడి ఏర్పడవచ్చు. అక్టోబర్‌ 14న అమెరికా డాలర్‌ సూచీ 102.72 స్థాయిని తాకగా, బంగారం ధరలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణమైంది.

అమెరికా బాండ్‌ రాబడుల పెరుగుదల

అమెరికా పదేళ్ల ట్రెజరీ బాండ్‌ రాబడి అక్టోబర్‌ 14న 5.3 శాతానికి పెరిగింది. అధిక బాండ్‌ రాబడులు పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై ఆసక్తిని పెంచుతాయి. దీంతో బంగారంపై కొనుగోళ్ల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. డాలర్‌ బలపడటం, బాండ్‌ రాబడులు పెరగడం రెండూ కలిసి పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం చూపాయి.

ఇకపై బంగారం ధరలు ఎలా ఉండొచ్చు?

అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్‌ కదలికలు, బాండ్‌ రాబడులు బంగారం ధరల దిశను ప్రభావితం చేయనున్నాయి. అయితే ధరలు తగ్గిన ప్రతిసారీ ఇదే ధోరణి కొనసాగుతుందని చెప్పలేం. అక్టోబర్‌ 15న అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ బలహీనపడటం, బాండ్‌ రాబడులు తగ్గడంతో బంగారం ధరలు తిరిగి పుంజుకున్నట్లు రాయిటర్స్‌ నివేదించింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు నమోదైన బంగారం ధరలు ఇలా..

gold1
1/4
gold2
2/4
gold3
3/4
gold4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)