Afsar Zazai Punished By ICC For Code of Conduct Breach In AFG vs BAN Only Test

source: X

ఆఫ్ఘనిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అఫ్సర్‌ జజాయ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్‌తో అబుదాబిలో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడిని అధికారికంగా మందలించింది. అతడి క్రమశిక్షణ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది.

బంగ్లాతో మ్యాచ్‌లో అఫ్సర్ ఆఫ్ఘన్‌ జట్టుకు 12వ ఆటగాడిగా వ్యవహరించాడు. ఈ సమయంలో మైదానంలోకి రావద్దని, ఆట ఆలస్యమయ్యేలా చేయవద్దని అంపైర్లు పలుమార్లు సూచించినా అతడు పట్టించుకోలేదు. ఓ దశలో అంపైర్ల అనుమతి లేకుండా మైదానంలోకి ప్రవేశించాడు.

దీంతో అంపైర్‌ అతడిపై ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఐసీసీ అఫ్సర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ ఆదేశాలను పాటించకపోవడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.4 ఉల్లంఘన కిందికి వస్తుంది.

అఫ్సర్ జజాయ్ ఎవరు..?
అఫ్సర్ జజాయ్ కుడిచేతి వాటం వికెట్ కీపర్ బ్యాటర్. ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించాడు. 2018 జూన్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లోనూ అతడు పాల్గొన్నాడు. 16 ఏళ్ల వయసులో ఆఫ్ఘన్‌ అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకున్న జజాయ్.. 2010, 2012 అండర్‌-19 ప్రపంచకప్‌లలోనూ ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 10 టెస్టులు ఆడిన జజాయ్‌ 378 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. 17 వన్డేల్లో 264 పరుగులు, ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 141 పరుగులు సాధించాడు.

ఇదిలా ఉంటే, అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆఫ్ఘన్‌ ప్లేయర్లు అద్భుతంగా పోరాడి ఓటమి తప్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 346, 372-7 స్కోర్లు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్‌ 240 మరియు 346-8 స్కోర్లు చేసింది.

ఇదీ చదవండి:ఏషియన్‌ గేమ్స్‌ విజేతలను అభినందించిన ప్రధాని మోదీ