నట్స్‌ని ఎలా భద్రపరచాలో తెలుసా?
జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, వాల్‌నట్స్, పల్లీలు.. వంటి నట్స్‌ని కొంతమంది ఎక్కువ మొత్తంలో కొనేస్తుంటారు. అయితే ఫైబర్, ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం, మంచి కొవ్వులు.. ఇలాంటి ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఈ నట్స్‌ని....

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, వాల్‌నట్స్, పల్లీలు.. వంటి నట్స్‌ని కొంతమంది ఎక్కువ మొత్తంలో కొనేస్తుంటారు. అయితే ఫైబర్, ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం, మంచి కొవ్వులు.. ఇలాంటి ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఈ నట్స్‌ని సరైన పద్ధతిలో నిల్వ చేసినప్పుడే వాటిలోని పోషకాలన్నీ తరిగిపోకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇందుకు కొన్ని చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..
ఎందుకు పాడవుతాయి?
కొన్నిసార్లు నట్స్ కొని ఇంటికి తెచ్చిన కొన్నాళ్లకే పాడైపోతుంటాయి. వాటి నుంచి అదో రకమైన వాసన వస్తుంటుంది.. రుచిలోనూ తేడా కనిపిస్తుంది. ఇందుకు కారణం వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడమే అంటున్నారు నిపుణులు. సాధారణంగా జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్, పిస్తా.. వంటి పప్పు గింజల్లో నూనెలు, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. గాలి, వేడి, వెలుతురు వీటికి తగలడం వల్ల ఆక్సిడేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఫలితంగా అవి పాడైపోతాయి.. రుచిని కోల్పోతాయి.. వాటిలోని పోషకాలూ తరిగిపోతాయి. ఇక తేమ తగిలితే వీటిపై శిలీంధ్రాలూ వృద్ధి చెందుతాయి. కాబట్టి వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఎలా నిల్వ చేయాలంటే..?!
నట్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. వాటిని నిల్వ చేసే క్రమంలో కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
* ఎక్కువ రోజులు ఉండేలా పప్పులు, ఉప్పు, కారం వంటి నిత్యావసరాల్ని గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయడం మనకు అలవాటే! ఈ చిట్కా నట్స్/డ్రైఫ్రూట్స్‌కీ వర్తిస్తుందంటున్నారు నిపుణులు. మనం ఎంచుకునేది గాజు సీసా అయినా ప్లాస్టిక్ జార్ అయినా మూత బిగుతుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా గాలి చొరబడని డబ్బాలో వీటిని నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
* కొంతమంది ప్యాకెట్లలోని నట్స్‌ని వాడి.. ఈ ప్యాకెట్స్‌ని అలాగే భద్రపరుస్తుంటారు. అయితే ఈ క్రమంలో వాటిలోకి గాలి చొరబడకుండా ఉండాలంటే సీలింగ్ క్లిప్స్‌ని ఉపయోగించాలి. అవసరమైనప్పుడు వీటిని తెరిచి, ఆపై తిరిగి అమర్చుకోవడం సులభమవుతుంది.
* నట్స్‌ని నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో అస్సలు ఉంచకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలనుకునే వారు.. చల్లగా, పొడిగా, చీకటిగా ఉండే ప్రదేశంలో వీటిని ఉంచాలి.
* కొంతమంది ఎక్కువ మొత్తంలో నట్స్‌ని కొని.. నెలల తరబడి ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారు వీటిని నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్‌ని వాడుకోవచ్చు. ఈ క్రమంలో గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే ఇవి కనీసం ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయంటున్నారు నిపుణులు. అదే ఫ్రీజర్‌లో నిల్వ చేస్తే 9-12 నెలల పాటు తాజాగా ఉంటాయట! ఇక ఇందుకోసం ‘ఫ్రీజర్ సేఫ్ కంటెయినర్’ని ఉపయోగిస్తే మరీ మంచిదంటున్నారు. ఎందుకంటే దీనివల్ల ఆయా పదార్థాలు గడ్డ కట్టకుండా, వాటిపై ఐస్ పేరుకోకుండా ఉంటుంది. తద్వారా గాలి తగిలిన వెంటనే ఇవి పాడవకుండానూ ఉంటాయి.
* అలాగే ఫ్రిజ్‌లో ఉంచినా మసాలాలు, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలకు దూరంగా వీటిని భద్రపరచాలి. ఎందుకంటే ఆ వాసనను ఇవి పీల్చుకుంటాయి. తద్వారా అవి త్వరగా పాడవుతాయి. అందుకే గాజు జార్‌లో మూత బిగుతుగా పెట్టి ఫ్రిజ్‌లో పెట్టడం మేలంటున్నారు నిపుణులు.

* ఇక వీటిని ఫ్రిజ్‌లో నుంచి బయటికి తీసినా.. గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాకే జార్ మూత తెరవాలి. అప్పుడే బయటి గాలి, వేడి, తేమ.. వంటివి వెంటనే వాటికి తగలకుండా, తద్వారా అవి పాడవకుండా ఉంటాయట!
* కొన్నిసార్లు ముక్కలుగా చేసిన నట్స్ మిగిలిపోతుంటాయి. సాధారణ నట్స్‌తో పోల్చితే ఇవి త్వరగా పాడైపోతాయట! ఎందుకంటే ముక్కలు చేయడం/తరగడం వల్ల వీటి నుంచి నూనెలు బయటికి వచ్చి.. అవి గాలితో కలవడం వల్ల త్వరగా పాడవుతాయట!
* షెల్స్‌లో ఉన్న నట్స్ సాధారణ నట్స్ కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయట! ఎందుకంటే వాటికి గాలి, వేడి, తేమ తగలకపోవడమే కారణం. కాబట్టి ఎక్కువ మొత్తంలో నట్స్ కొనాలనుకునే వారు షెల్స్‌తో కూడినవే కొనడం మంచిది.
* ఎంత జాగ్రత్తగా భద్రపరిచినా.. నట్స్ తాజాగా ఉన్నాయా, లేదా అనే విషయం అప్పుడప్పుడూ చెక్ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వాటి రంగు, రుచి మారినట్లుగా గుర్తిస్తే వాటిని వాడకపోవడమే ఉత్తమమట!
* ఇక నట్స్‌ని కొనే ముందు.. వాటి ప్యాకింగ్, గడువు తేదీల్ని లేబుల్‌పై ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవడమూ ముఖ్యమే!
గడువు.. దేనికెంత?
ప్రతి పదార్థానికీ గడువు తేదీ ఉన్నట్లే.. నట్స్‌కీ ఎక్స్‌పైరీ ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే ఆయా రకాలు, నిల్వ చేసే విధానాన్ని బట్టి ఇవి ఎన్ని రోజులు తాజాగా ఉంటాయనే విషయం ఆధారపడి ఉంటుందట!
* నట్స్ అన్నింటిలోకెల్లా బాదం పప్పులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయట! ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ఏడాది పాటు, ఫ్రిజ్‌లో/ఫ్రీజర్‌లో అయితే రెండేళ్లు.. అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయట!
* అదే వాల్‌నట్స్ గది ఉష్ణోగ్రత వద్ద – 3 నెలలు, ఫ్రిజ్‌లో - ఏడాది, ఫ్రీజర్‌లో - రెండేళ్లు తాజాగా ఉంటాయట!
* పల్లీలు గది ఉష్ణోగ్రత వద్ద – ఆరు నెలలు, ఫ్రిజ్‌లో - ఏడాది, ఫ్రీజర్‌లో - రెండేళ్ల పాటు పాడవకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. హేజల్‌నట్స్ గడువు తేదీ కూడా ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.
* జీడిపప్పు, పిస్తా పప్పు.. వంటివి గది ఉష్ణోగ్రత వద్ద – ఆరు నెలలు, ఫ్రిజ్‌లో - ఏడాది, ఫ్రీజర్‌లో - రెండేళ్ల పాటు తాజాగా ఉంటాయట!