నేనెప్పుడూ నిత్య విద్యార్థినినే!

పట్టుదల, క్రమశిక్షణ, శ్రమశక్తి... వీటినే ఆయుధాలుగా చేసుకుని కెరియర్‌లో విజయం సాధించారు సంగీత యనమండ్ర. జావా నుంచి ఏఐ వరకూ... ఎన్నో నేర్చిన నిత్య విద్యార్థి. ఓపెన్‌ టెక్స్ట్‌ టెక్నాలజీస్‌ హైదరాబాద్‌ కేంద్రంలో ‘వైస్‌ ప్రెసిడెంట్‌- ఇంజినీరింగ్, సైట్‌ లీడర్‌’గా వందలమందికి నాయకత్వం వహిస్తూ, వేలమందికి స్ఫూర్తినిస్తోన్న ఆమె ప్రస్థానం ఇది...

Eenadu icon
By Vasundhara Team Updated : 05 Jan 2026 13:25 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

పట్టుదల, క్రమశిక్షణ, శ్రమశక్తి... వీటినే ఆయుధాలుగా చేసుకుని కెరియర్‌లో విజయం సాధించారుసంగీత యనమండ్ర. జావా నుంచి ఏఐ వరకూ... ఎన్నో నేర్చిన నిత్య విద్యార్థి. ఓపెన్‌ టెక్స్ట్‌ టెక్నాలజీస్‌ హైదరాబాద్‌ కేంద్రంలో ‘వైస్‌ ప్రెసిడెంట్‌- ఇంజినీరింగ్, సైట్‌ లీడర్‌’గా వందలమందికి నాయకత్వం వహిస్తూ, వేలమందికి స్ఫూర్తినిస్తోన్న ఆమె ప్రస్థానం ఇది...

1987... నాకప్పుడు 13 ఏళ్లు. మోపెడ్‌ నేర్చుకుంటుంటే అడ్డు చెప్పలేదు నాన్న. అదేకాదు, నేనేదైనా కొత్తగా ప్రయత్నిస్తే మౌనంగానే ఆమోదించేవారు. దాంతో నేర్చుకోవాలనే కుతూహలం పెరిగి, బైక్‌ నడపడమూ నేర్చుకున్నా. ఇప్పటికీ కొత్త ప్రాజెక్టు వస్తే ముందు చేస్తానని చెప్పేసి తర్వాత వివరాల్లోకి వెళ్తా. నాన్న లక్ష్మణరావు, అమ్మ కుసుమ కుమారి హైదరాబాద్, ఈసీఐఎల్‌లో పనిచేసేవారు. ఉదయం ఆరున్నరకే అమ్మ ఆఫీసుకు వెళ్లాలి. అందుకని మూడున్నరకే లేచి వంట చేసేది. ఆమె నుంచే మల్టీ టాస్కింగ్‌ నేర్చుకున్నా.

తన ప్రోత్సాహంతోనే...

బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంసీఏ చేశాను. వై2కే సమస్యవల్ల ఐటీలోకి వెళ్లలేకపోయా. దాంతో బీసీఏ, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పార్ట్‌టైమ్‌ క్లాసులు చెప్పేదాన్ని. తర్వాత ఉస్మానియా ఈవెనింగ్‌ కాలేజీలో చేరి బ్యాచ్‌ టాపర్‌గా ఎం.టెక్‌. పూర్తిచేశా. స్కూల్లో ఉన్నప్పుడు మ్యాథ్స్, సైన్స్‌ అంటే భయం. రోజూ 2గం. అదనంగా చదివి వాటిపై భయం పోగొట్టుకున్నా. కొత్తవాటిని నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పట్టుదలతో పరిమితుల్ని అధిగమించొచ్చు అని తెలుసుకున్నా. మావారు మెహర్జీ, అడ్వొకేట్‌. తన ప్రోత్సాహంతోనే ఎంటెక్, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేయగలిగా.

నా లక్ష్యం అదే...

ఎంటెక్‌ తరవాత ఐటీలోకి వచ్చా. ప్రస్తుతం ఓపెన్‌ టెక్స్ట్‌ టెక్నాలజీస్‌ ఇంజినీరింగ్‌ విభాగ పర్యవేక్షణ, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌లతోపాటు అనలిటిక్స్, లీగల్‌ టెక్‌ విభాగాలనూ పర్యవేక్షిస్తున్నా. లీడర్‌షిప్‌లో ఉంటే ప్రణాళిక రచన నుంచి అమలు దాకా మన బాధ్యతే. జావా, సీ, పైథాన్, డాట్‌నెట్, ఏఐ... ఇలా అన్ని రకాల లాంగ్వేజ్‌లూ, సాఫ్ట్‌వేర్‌లతో ముడిపడిన ప్రాజెక్టులు చేశాను. ప్రాజెక్టులో భాగమవుతూనే కొత్త అంశాల్ని ఒకట్రెండు నెలల్లోనే నేర్చుకునేదాన్ని. నా కెరియర్‌లో నేనెప్పుడూ ఆవిష్కరణలకే ప్రాధాన్యమిచ్చా. ఈ ప్రయాణంలో ఇప్పటివరకూ 5 పేటెంట్లు పొందాను. స్టార్టప్, ఆంత్రప్రెన్యూర్‌ మైండ్‌సెట్‌తో వేగంగా, నాణ్యంగా ఉత్పత్తులు తెస్తాను. పనులకు ప్రాధాన్యక్రమం నిర్దేశించుకుని, చిన్న భాగాలుగా విభజించుకోవడంవల్ల ఇది సాధ్యమవుతుంది. సమస్యను రివర్స్‌ ఇంజినీరింగ్‌ చేసి పరిష్కరిస్తా. రాత్రి ఏ సమయానికి నిద్రపోయినా... తెల్లవారు జామున మూడింటికే నిద్రలేచి చదువుతుంటా. ఐఐటీ హైదరాబాద్‌ ఏఐ క్లాసులు నిర్వహిస్తుంటే వెళ్లి నేర్చుకున్నా. ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ ఫ్రమ్‌ మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ పరీక్షనీ రాశా. అప్‌స్కిల్లింగ్‌ కోసం రోజుకు 15 నిమిషాలు కేటాయించినా పురోగతి ఉంటుంది. అయిదేళ్లలో సీటీఓ/సీఈఓ అవ్వాలన్నది లక్ష్యం. ఇటీవల 3ఏఐ, హైసియా ద్వారా అనలిటిక్స్‌ రంగంలో ‘ఇన్‌స్పైరింగ్‌ విమెన్‌ లీడర్‌’గా గుర్తింపు పొందా. ‘విమెన్‌ ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(వైజ్‌)-హైదరాబాద్‌’లో నెలకోసారి సమావేశమై మహిళలకున్న అవకాశాలూ, అవరోధాలనూ చర్చిస్తాం. నాస్కామ్‌ లాంటి సంస్థల్లో మెంటార్‌గానూ ఉన్నా.

  • హాఫ్‌ మారథాన్లలో పాల్గొంటా. ఏడాది కిందట మోకాళ్ల నొప్పులు ఎక్కువైతే బ్రేక్‌ ఇచ్చా. దృఢత్వాన్ని పెంచుకుని... మళ్లీ రన్నింగ్‌ని కొనసాగిస్తున్నా. డ్రైవింగ్‌ ఇష్టం. బైకులూ, కార్లూ నడుపుతా. 
  • అమ్మాయిలూ... తాత్కాలిక సమస్యలకు భయపడి కెరియర్‌ను వదులుకోకూడదు. లక్ష్యాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర అభ్యాసం అవసరం. ఇది మా అమ్మాయి వైష్ణవి నుంచి నేను నేర్చుకున్న పాఠం. 
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 02:49 IST