
సాక్షి, హైదరాబాద్:తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. బీఆర్‌ఎస్ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. సభను భజన మండలిగా మార్చారు అంటూ మండిపడ్డారు.
కృష్ణ జలాలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అనంతరం, బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు పటేల్ వరం అయితే.. నెహ్రూ శాపం. పటేల్ రజాకర్ల నుంచి విముక్తి చేస్తే.. నెహ్రూ తెలంగాణను ఆంధ్రాలో కలిపి ద్రోహం చేశారు. జల దోపిడికి నెహ్రూ చేసిన పనితోనే శ్రీకారం పడింది. బీఆర్‌ఎస్ పాలనలో సాగు నీళ్ల ముసుగులో నిధులు మహా దోపిడీకి గురయ్యాయి. అదే బాటలో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని దురాశతో ఏపీకి సాగు నీళ్ళను దారాదత్తం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన గుత్తదారుల జేబులు నింపడానికి అదే పని చేస్తుంది. నాగార్జున సాగర్ తెలంగాణకు వచ్చే ఎడమ కాల్వను పైకి కట్టి, కుడి కాల్వను కిందకు కట్టి దోపిడిని ఆరోజే ప్రారంభించారు. తెలంగాణ కోసం చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ అంతా గందరగోళం.. ఇంకా పూర్తి కాలేదు.
సభలో కాంగ్రెస్ తరఫున 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. బీజేపీ నుండి ఒక్కరికీ మాత్రమే ఇచ్చారు. బీజేపీ నుండి మరొకరికి అవకాశం అడిగితే ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఎలాగో సభలో లేనే లేదు.. ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వచ్చు కదా?. ఎంఐఎం, సీపీఐతో డబ్బా కొట్టించుకున్నారు. సభను భజన మండలిగా మార్చారు’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.