Year of AI: ఏఐ నామ సంవత్సరమే!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

సాంకేతికపరంగా చూస్తే 2025 ఏఐ నామ సంవత్సరమే. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వినూత్న ఏఐ మోడళ్ల రూపకల్పన పుంజుకుంది. ఏజెంటిక్ ఏఐ విస్తృతమైంది. మల్టీమోడల్, రీజనింగ్ సామర్థ్యాలు గణనీయంగా మెరుగ య్యాయి. పరిశ్రమలు సైతం పెద్ద పెద్ద భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాయి. సమ్మిళిత ఏఐ గొప్ప విజయాలు సాధించింది. మనిషిని పోలిన హ్యూమనాయిడ్ రోబోలు క్లిష్టమైన పనులనూ చేయగల స్థాయికి చేరుకోవటమే దీనికి నిదర్శనం. భవిష్యత్ ఏఐ కాలానికి దిశా నిర్దేశం చేసిన ఈ ఏడాదికి కొద్దిరోజుల్లో గుడ్‌బై చెప్పనున్న నేపథ్యంలో కొన్ని మైలురాళ్లు ఇవిగో..
ఫొటోనిక్ ఏఐ చిప్
ఏఐ రంగంలో ఖర్చును తగ్గించే విషయంలోనూ 2025 కొత్త దారిని చూపించింది. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లొరిడాకు చెందిన సెమీకండక్టర్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన కొత్తరకం ఫొటోనిక్ ఏఐ చిప్ దీనికి ఒక ఉదాహరణ. డేటా ప్రాసెసింగ్ కోసం విద్యుత్తుకు బదులు కాంతిని వాడుకోవటం దీని ప్రత్యేకత. మరోవైపు చైనాకు చెందిన డీప్‌సీక్ చవక ఆర్1 వర్షన్ ఏఐ మోడల్‌ను తీసుకొచ్చింది. అమెరికా కంపెనీలతో పోలిస్తే 70% తక్కువ ఖర్చుతోనే దీనికి శిక్షణ ఇచ్చినట్టు కంపెనీ ప్రకటించింది.
గ్రాక్ అద్భుతం
జెమినైని అధునాతనంగా తీర్చిదిద్దే క్రమంలోనే గూగుల్ నవంబరులో ప్రొ, డీప్ థింక్ వర్షన్లతో జెమినై 3ని ఆవిష్కరించింది. అడ్వాన్స్‌డ్ రీజనింగ్ దీని ప్రత్యేకత. అనంతరం కొద్ది రోజులకే ఇలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ మరో అడుగు ముందుకేసి గ్రాక్ అనే ఏఐ బాట్‌ను పరిచయం చేసింది. దీన్ని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లోనూ సమ్మిళితం చేయటం విశేషం. ట్వీట్ల మతలబులను అప్పటికప్పుడు తెలుసుకోవటానికి ఇప్పుడు యూజర్లు ఎక్కువగా దీన్నే ఆశ్రయిస్తున్నారు. సమాచారాన్ని విడమరచి చెప్పటంలో ఇది అద్భుతః అనిపిస్తోంది. ఇమేజ్‌లు, పొట్టి వీడియోలనూ సృష్టిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ రీలవెంట్ కార్యక్రమంలో కొత్త నోవా 2.0 మోడల్‌ను పరిచయం చేసింది. ఇది టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, డాక్యుమెంట్స్, స్పీచ్‌లను ప్రాసెస్ చేయగల మల్టీమోడల్ ఫౌండేషన్ మోడల్స్ వేదిక.
డీప్‌సీక్ సంచలనంతో ఆరంభం
ఏడాది మొదట్లో జనవరిలోనే చైనాకు చెందిన డీప్‌సీక్ సంచలనం సృష్టించింది. డీప్‌సీక్-ఆర్1 అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్‌ఎల్‌ఎం) ఏఐ రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. గొలుసుకట్టు థాట్ రీజనింగ్ మీద దృష్టి సారించిన దీనికి అతి తక్కువ ఖర్చుతోనే శిక్షణ ఇవ్వటం గమనార్హం. మిస్ట్రల్ ఏఐ ఫిబ్రవరిలో తీసుకొచ్చిన లీ చాట్ తక్కువదేమీ కాదు. హై స్పీడ్ అసిస్టెంట్ అయిన ఇది సెకండుకు వెయ్యి పదాల వరకూ అవుట్‌పుట్ ఇస్తుంది. అదే నెలలో పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ శిఖరాగ్ర సదస్సులో 100కు పైగా దేశాలకు చెందిన విధానకర్తలు ఏఐ అంశాలపై చర్చించారు. దీనికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహ అధ్యక్షత వహించారు. ప్రభుత్వాలు ఏఐ మీద నిశితంగా దృష్టి సారిస్తున్నాయనే సంగతిని ఇది ఘనంగా చాటిచెప్పింది.
జెమినై రోబోటిక్స్, మనుస్ ఏఐ అసిస్టెంట్
మనుషులు నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం లేకుండా నిత్య జీవితంలో ఉపయోగపడే పనులను నిర్వహించటం సాధ్యమేనని మార్చిలో ఆవిష్కృతమైన అటనమస్ ఏఐ ఏజెంట్ ‘మనుస్’ నిరూపించింది. మరోవైపు గూగుల్ డీప్‌మైండ్, యాప్‌ట్రానిక్ సంయుక్తంగా జెమినై రోబోటిక్స్‌ను పరిచయం చేశాయి. ఇదో విజన్ లాంగ్వేజ్ మోడల్. రోబోలకు తమ చుట్టుపక్కల ప్రపంచాన్ని అర్థం చేసుకొని, మసలుకోవటానికిది తోడ్పడుతుంది. మనిషి మెదడును అనుకరించగల ‘సూపర్ ట్యూరింగ్ ఏఐ’ పరిశోధన గొప్ప పురోగతి సాధించింది. యూసీఎల్‌ఏ, టెక్సాస్ ఏఅండ్‌ఎం, పలు సంస్థల భాగస్వామ్యంతో రూపొందించిన ఏఐ చిప్ స్వల్ప విద్యుత్తుతోనే అప్పటికప్పుడు తనకుతాను నేర్చుకోగలదు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా పనులు చేయటానికి తోడ్పడగలదు.
జీపీటీ 5, జెమినై ఫ్లాష్ మోడళ్లు
ఆంత్రోపోనిక్ మేలో అటనమస్, బహుళ అంచెల పనుల కోసం క్లాడ్ 4 మోడల్‌ను తీసుకొచ్చింది. దీన్ని మరింత మెరుగుపరచే ఓపస్ 4, సానెట్ 4 వర్షన్లనూ పరిచయం చేసింది. ఇక గూగుల్ సంస్థ జూన్‌లో మెరుగు పరచిన జెమినై 2.5 ప్రొ, ఫ్లాష్ మోడళ్లను తీసుకొచ్చింది. అధునాతన రీజనింగ్, మల్టీమోడల్ సామర్థ్యాలు వీటి సొంతం. ఇవి ప్రయోగాత్మక డీప్ థింక్ వంటి మోడళ్లకు దన్నుగా నిలిచాయి. రీజనింగ్, మల్టీమోడల్ అవగాహనను మెరుగుపరచే ఉద్దేశంతో ఓపెన్‌ఏఐ ఆగస్టులో భారీ మోడల్ జీపీటీ-5ని ఆవిష్కరించింది. కాకపోతే ఇది యూజర్ల నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కొంది.
ఓపెన్‌ఏఐతో డిస్నీ జట్టు
ఓపెన్‌ఏఐ డిసెంబరులో అధునాతన రీజనింగ్, కోడింగ్, లాంగ్ కాంటెక్స్ట్ సామర్థ్యాలతో కూడిన జీపీటీ 5.2 మోడల్‌ను పరిచయం చేసింది. ఇదే నెలలో ఓపెన్‌ఏఐ, వాల్ట్ డిస్నీ కంపెనీలు మూడేళ్ల భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఓపెన్‌ఏఐకి చెందిన సోరా ద్వారా జనరేటివ్ వీడియోలను సృష్టించటానికి 200కు పైగా డీస్నీ పాత్రలను వాడుకోవటం దీని ఉద్దేశం.
ఫిజికల్ ఏఐ మహత్తు
కృత్రిమ మేధ మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లను దాటుకొని భౌతిక రూపం ధరిస్తోంది. రోబోలకు ఆలోచన, వివేచన శక్తిని ప్రసాదిస్తోంది. అదే ఫిజికల్ ఏఐ. ఏవో కొన్ని కమాండ్ల మేరకు నడచుకోవటం కాకుండా మనుషుల్లా ఆలోచించి, నడచుకోగల హ్యూమనాయిడ్ రోబోలకు ప్రాణం పోస్తోంది. టెస్లా రూపొందిస్తోన్న ఆప్టిమస్ రోబోలు ప్రయోగాత్మక ఉత్పత్తి దశకు చేరుకున్నాయి. ఎన్‌విడియాకు చెందిన ఓమ్నివర్స్, ఫిజికల్ ఏఐ ఫ్రేమ్‌వర్క్స్ వివిధ రంగాల్లో రోబోల రూపకల్పనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఫిజికల్‌ఏజెంట్, ఎనెర్‌వర్స్ వంటి ఏజెంట్ ఫ్రేమ్‌వర్క్స్ అయితే రోబోలకు ఏఐ మోడళ్లను సమ్మిళితం చేస్తున్నాయి. కమాండ్స్‌ను అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మలచుకోవటానికివి తోడ్పడుతున్నాయి.
జెమినై 3:గూగుల్ తాజా ఏఐ మోడల్. సృజనాత్మక రచన, సమస్యల పరిష్కారం, ప్రత్యక్ష రీజనింగ్‌లో దిట్ట.
నానో బనానా:సమగ్ర ఏఐ ఆధారిత పర్సనల్ అసిస్టెంట్. రోజువారీ డిజిటల్ పనులకు తోడు.
ఓపెన్‌ఏఐ అట్లాస్:ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్. బిల్టిన్‌గా చాట్‌జీపీటీ సామర్థ్యాలు సొంతం.
అడోబ్ మ్యాక్స్ ఏఐ సూట్:ఏఐ సామర్థ్యాలతో కూడిన సృజనాత్మక టూల్స్ బుట్ట.
వియో 3:టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో వీడియోలుగా మలచే మోడల్. వాటికి డైలాగ్స్, సౌండ్ ఎఫెక్ట్స్, సంగీతాన్నీ జోడిస్తుంది.
చాట్‌జీపీటీ 5.2:ఓపెన్‌ఏఐ చాట్‌బాట్ తాజా వర్షన్. ప్రొఫెషనల్, సంక్లిష్ట నాలెడ్జ్ పనులకు ప్రత్యేకం.
పర్‌ప్లెక్సిటీ కామెట్:పర్సనల్ ఏజెంట్‌లాంటి ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్. టాస్కులను ఆటోమేట్ చేయటం, కంటెంట్ సారాంశాన్ని గుదిగుచ్చటం వంటి పనులను తేలికగా చేసేస్తుంది.
ఫ్లో:గూగుల్ రూపొందించిన అధునాతన ఫిల్మ్ మేకింగ్ టూల్. టెక్స్ట్ ప్రాంప్ట్స్, ఇమేజెస్ నుంచి వీడియో క్లిప్స్, సీన్స్, స్టోరీలను జనరేట్ చేస్తుంది.
► Read latest Technology Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :