Drinking water: ఆర్వో ప్లాంట్ నీళ్లు తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మన ఇంట్లోని నీళ్లే కదా... మన ఆర్వో ప్లాంట్లోనే శుద్ధిఅయింది కదా... నిక్షేపంలా తాగొచ్చని అనుకుంటాం. కానీ అందులో రసాయనాల అవక్షేపాలు ఉంచొచ్చు. తస్మాత్ జాగ్రత్త!
- బాటిల్‌లో అయినా, బబుల్‌లో అయినా తాగునీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యానికి కారణమయ్యే విషాలు ఏ దశలోనైనా పోగుపడొచ్చు. అందుకే ఆర్వో ప్లాంట్ నుంచి ఆ నీటిని నిల్వ చేసిన పాత్ర వరకు అన్నిటినీ తరచిచూడాలి. ఎందులోనైనా సరే నీరు ఎక్కువరోజులు నిల్వ ఉంటే అందులో ప్రమాదకర బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఆల్గే, శిలీంధ్రాలు వేగంగా పెరుగుతాయి.
- ప్లాంట్‌లో లీకేజీలు ఉన్నా, ప్లంబింగ్ కనెక్షన్లు సక్రమంగా లేకున్నా నీటిలోకి సీసం, సింథటిక్ మూలకాలు చేరే ప్రమాదం ఉంది.
- కొన్ని ఆర్వో ప్లాంట్లు శరీరానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలను కూడా పూర్తిగా ఫిల్టర్ చేసేస్తాయి. ఆ నీటితో చాలా సమస్యలు వస్తాయి. ఒకవేళ ఆ నీళ్లనే తాగాల్సివస్తే ఫిల్టర్ అయిన పోషకాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
- ఎక్కువ పీడనంలో నీటిని ఫిల్టర్ చేస్తుంటే ఆర్వో ప్లాంట్‌లో వడకట్టే రంధ్రాలు కుంచించుకుపోతాయి. దానివల్ల విద్యుత్తు వినియోగం ఎక్కువవడంతో పాటు... కరిగిన ఘన పదార్థాలు పోయి నీటి నాణ్యత కూడా తగ్గిపోతుంది.
- ఆల్గే తొలగించడానికి ఉపయోగించే క్లోరిన్ వంటి రసాయనాల అవశేషాలు ప్లాంట్‌లో మిగిలిపోతే దీర్ఘకాలంలో అనారోగ్యాలకు దారితీయొచ్చు
- ఆర్వో ప్లాంట్లలో శుద్ధి అయిన నీళ్లలో ఆమ్లత ఉంటుంది. అది మన శరీరంలోని ఖనిజ లవణాలను తొలగించే అవకాశం ఉంది. ఇది మన ఆహారం రుచిని కూడా ప్రభావితం చేస్తుంది.
- ఒకవేళ బాటిళ్లు, బబుల్స్‌లో నీటిని వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ నాణ్యత ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కువ కాలం వాడితే బిస్పినాల్స్, థాలేట్లు వంటి రసాయన అవశేషాలు, మైక్రోప్లాస్టిక్‌లు నీటిలోకి లీక్ అవుతుంటాయి. ఇవి మన శరీరంలోని జీవక్రియలను ఛిన్నాభిన్నం చేస్తాయి.

- ఆర్వో ప్లాంట్లలోని ఫిల్టర్లలో బయోఫిల్మ్‌లను మార్చడమే కాకుండా పూర్తిగా సిస్టమ్ శానిటైజేషన్‌ను తరచూ చేస్తుండాలి.
- గాలి, కాలుష్యం లోపలికి రాకుండా కంటెయినర్లు, బాటిళ్లను గట్టిగా మూసేయాలి. స్క్రూఆర్ క్యాప్‌లు దీనికి బాగా ఉపయోగపడతాయి.
- బాటిళ్లలో నీళ్లనైతే నేరుగా సూర్యుడి కిరణాలు పడని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి. సూర్యకాంతి నుంచి వచ్చే యూవీ కిరణాలు నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి.
- ప్లాస్టిక్‌వి కాకుండా సర్టిఫైడ్ ఫుడ్‌గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా హెచ్‌డీపీఈ ట్యాంకులను వాడుకోవాలి.
- వడకట్టే పొరకు నష్టం జరగకుండా పీడనాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ఆటోమేటెడ్ షట్‌డౌన్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి.
- ఆర్వో ప్లాంట్లను తరచూ తనిఖీచేయాలి. ఏవైనా కాలుష్య సంకేతాలు, రంగు, రుచి, వాసనలో మార్పులుంటే ఆ నీటిని వాడకూడదు. ప్లాంట్‌ను సరిచేసుకోవాలి.
- ఆర్వోప్లాంట్‌లోని నీటిని 24 నుంచి 48 గంటల్లో తాగేయడం మేలు.