Delhi Police issued a notice to Abhijit Dipke over the Tiranga Yatra

సాక్షి,న్యూఢిల్లీ:ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌పై నిరసనగా, అలాగే తమ పార్టీ నేతల అరెస్ట్‌లను ఖండిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ  తలపెట్టిన  తిరంగా యాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యాత్రను నిర్వహించేందుకు వీల్లేదంటూ ఢిల్లీ పోలీసులు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది.

అల్లర్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో 15 నుంచి 20 మంది ఢిల్లీ పోలీసులు న్యూఢిల్లీలోని అభిజిత్ దీప్కే నివాసానికి చేరుకుని నోటీసులు అందజేశారు. దీనిపై దీప్కే తీవ్రంగా మండిపడ్డారు. ‘సోషల్‌ మీడియాలో నేను రెచ్చగొట్టేలా, అల్లర్లు సృష్టించేలా ఒక్క ఆధారం, ఒక్క వీడియో ఉందా? ఏంటి ఈ నోటీసులు? ఓ తెల్ల కాగితం మీద మీకు ఏది నచ్చితే అది రాసుకొచ్చి నాకిస్తే సరిపోతుందా? ఆ ఆధారం ఉంటే నన్ను ఉరితీయండి’ అంటూ పోలీసులకు ఆయన సవాల్ విసిరారు.

మరోవైపు, కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉందని, అనుమతి లేని గుంపులుగా చేరడం, ర్యాలీలు చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. జాతీయ జెండాను గౌరవించాలని, అయితే నిబంధనలు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తిరంగా యాత్రకు సీజేపీ పిలుపు
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా శుక్రవారం సెంట్రల్ పార్క్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని సీజేపీ పిలుపునిచ్చింది. అయితే, చారిత్రాత్మక జంతర్ మంతర్‌ను నిరసన స్థలాల జాబితా నుంచి సుప్రీంకోర్టు తొలగించిన మరుసటి రోజే (అక్టోబర్ 13న) జాతీయ జెండాతో అక్కడికి ప్రవేశించిన సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ అరెస్ట్‌లను నిరసిస్తూ సీజేపీ ఈ తిరంగా యాత్రకు శ్రీకారం చుట్టింది.

పరిపాలనా కారణాల దృష్ట్యా శుక్రవారం, శనివారాల్లో సెంట్రల్ పార్క్‌ను ప్రజల సందర్శనార్థం మూసి వేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్  ప్రకటించింది. మరోవైపు, తమ వ్యాపారాలకు, పర్యాటకులకు అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ.. కన్నాట్ ప్లేస్‌లో నిరసనలు చేపట్టి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించవద్దని న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ నిరసనకారులను కోరింది.