
అడవి పండ్ల జాతి –23
తెల్ల జువ్వి చెట్లలో అనేక రకాలున్నాయి. అందులో తెల్లజువ్వి/ పాల దంతం ఒకటి. దీని ప్రత్యేకత పూలు విచ్చుకున్న తరువాత త్వరగా ముడుచుకుంటుంది. దీనికి విశేషంగా ఔషధ గుణాలు ఉన్నాయి. అనాది నుంచి నాటు వైద్యంలో వాడుతున్నారు.
ఉనికి:
తెల్లజువ్వి చెట్లు మధ్యస్థంగా పెరుగుతాయి. వీటి పూలు తెలుపు రంగులో ఉంటాయి. ఈ చెట్లు ఆకులు రాలుస్తాయి. ఇవి ఉష్ణ మండల అడవుల్లో దాదాపు 1000 మీటర్ల ఎత్తులో కూడా పెరుగుతాయి. దీని స్వస్థలం ఇండియా. చైనా, భూటాన్, పాకిస్తాన్, లావోస్, మైన్మార్ తదితర దేశాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వీటి ఉనికి ఉంది. నల్లమల అడవుల్లో ఈ చెట్లు అధికంగా ఉండేవి. రాను రాను వీటి సంఖ్య తగ్గుతున్నది. దీనికి ఎన్నో కారణాలు. వాతావరణ మార్పులు, ఇతర చెట్ల పోటీ (ఉదా: సీమకోరింత), చెట్లను నరకటం తదితర కారణాలున్నాయి. వీటిపైన ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ చాలా వరకు ఔషధగుణాలు, వాటి ఉపయోగం పైనే సాగాయి. ఇతర కోణాల్లో కూడా చెయ్యాలి.
ఉపయోగాలు:
కలప వంట చెరుకుగా ఉపయోగపడుతుంది. మేకలు ఈ ఆకులు తింటాయి. వీటిని ఆర్నమెంటల్ మొక్కలుగా కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు భాగాలను నాటు వైద్యం, ఆయుర్వేద మందుల్లో వాడతారు. వీటి పండ్లు రుచికరంగా, తీపిగా ఉంటాయి. ఒక విధమైన ఫ్లేవర్ కలిగి ఉంటాయి. వీటి కాయలు గ్రీన్గా ఉండి ఎరుపు, పండిన తరువాత నలుపు రంగుకు మారుతాయి. ఇవి గుత్తులుగా కిందికి వాలి ఉంటాయి. వీటి ఆకులు అల్సర్లు, మాడు నొప్పులను తగ్గించే పెయిన్ బామ్ తయారీలో వాడుతారు. నోటి పుండ్లు, ఆస్త్మా, కీళ్ళ నొప్పులకు వాడుతారు. పండ్లలో రక్తస్రావాన్ని నిరోధించటానికి, నులి పురుగులను విసర్జించటానికి, బాధను తగ్గించడానికి, మూత్ర విసర్జన చక్కగా ఉండటం కోసం వాడతారు. అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్యలకు, ప్లీహం సమస్యల అదుపునకు వీటిని వినియోగిస్తారు.
కుండీల్లో పెంచుకోవచ్చు (బోన్సాయి మొక్కవలే). గింజల పొడిని కొబ్బరి నూనెతో కల్పి తామర సమస్య ఉన్న చోట రుద్దితే ఉపశమనం కలుగుతుంది. ఈ చెట్టులో ఉన్న రసాయనాలు ఊబకాయం, షుగర్, గుండె సమస్యలు, బీపీ, కొవ్వు సమస్య నివారణకు ఉపయోగిస్తారు. వైరస్ ద్వారా సంక్రమించే జబ్బులను అదుపులో ఉంచుతుంది. ఈ పండ్ల చెట్ల ఆకులు, బెరడు వేర్ల పైన ఎన్నో అధ్యయనాలు ఉన్నా, అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. పండ్లపై అధ్యయనాలు అరుదు. అనేక ఉపయోగాలున్న ఈ చెట్లు, జీవవైవిధ్యంలో మంచి భాగస్వామిగా వర్ణించవచ్చు. నల్లమల అడవుల్లో వీటి ఉనికి ఉన్నది. పరిశోధనలు డొమెస్టికేషన్ వైపు అంతగా సాగలేదు. ఆగ్రో ఫారెస్ట్రీలో ఉపయోగించటానికి ఈ చెట్లు అనువుగా ఉంటాయి. ఈ దిశగా పరిశోధనలు అవసరం.
ఇదీ చదవండి:అడవి పండ్ల జాతి జివిలిక..!
వివిధ భాషల్లో తెల్లజువ్వి పేర్లు:
ఇంగ్లీష్: ఇరన్ ఫుడ్, గుజరాతీ: వధవరిడి
మరాఠీ: దట్రంగ్ అజన్ వృక్ష
మలయాళం: హరండి కరంటి
తమిళం: కాల్విరాసు, నరివళ్ళి, కల్ బిరుసు
తెలుగు: తెల్ల జువ్వి, పల్డట్టం, పెద్ద పుల్మెర, పొగడి చెట్టు, చిల్లపోకు, తెల్ల పిసిని, పాలదంతం, పెద్ద పిడ్క, బోదిది, గిడగూరి
హిందీ: చురోర్ కొడ, దరార్, దట్ర రంగ, పాపి
సంస్కృతం: చర్మ వృక్ష
పూత : మే – సెప్టెంబర్
పండ్లు : ఆగస్టు – అక్టోబర్

English Name:
White&Berry Bush/Chamror
శాస్త్రీయ నామం: ఎహరే సియ లెవిస్
Scientific Name:
Ehretia laevis Roxb.
Synonym (s): Bourreria aspera (Willd.) G.Don Ehretia pubescens Royle ex Benth. Ehretia aspera. Willd.
కుటుంబం: బొరిగినేసి
Family:Boraginaceae