Sagubadi: How to Use Milk to Prevent Pests and Boost Plant Health

మిద్దె /పెరటి తోటల్లో  పాలను ఉపయోగించటం వల్ల మొక్కలకు అద్భుతమైన పోషకాలు అందటంతో పాటు అనేక ప్రయోజనాలు, అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. పాలను నేరుగా కాకుండా నీటితో కలిపి పలుచన చేసి వాడటం వల్ల తోటపనిలో మంచి ఫలితాలు సాధించవచ్చు.

1. పాలల్లో ఉండే కొన్ని అమైనో ఆమ్లాలు, లవణాలు మిద్దె తోటల్లో మొక్కలకు సోకే బూజు తెగులు వంటి శిలీంధ్ర వ్యాధులను అరికట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

2. పాలలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మొక్కల కణజాలం బలంగా పెరగడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా టమోటా, మిరప, బెండ మొక్కల్లో వచ్చే ‘బ్లాసమ్‌ ఎండ్‌ రాట్‌’ (కాయల కింది భాగం నల్లగా మారి కుళ్ళిపోవడం) వ్యాధిని ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ దశలో వారానికి ఒకసారి మట్టిలో, ఆకులపై చల్లితే కాల్షియం లోపం పూర్తిగా తొలగిపోతుంది.

3. పాలలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు మొక్కల అంతర్గత రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

4. పాలను మట్టిలో చల్లటం వల్ల నేలలో ఉండే మేలు చేసే సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెంది, మట్టి సారవంతం అవుతుంది.

5. పాల మిశ్రమాన్ని ఆకులపై స్ప్రే చేయటం వల్ల ఆకులు క్లోరోఫిల్‌ (పచ్చదనం) పెంచుకుని, ఆరోగ్యంగా మెరుస్తాయి.

6. పాలను ఎక్కువ మోతాదులో వాడినా లేదా సరిగ్గా పలుచన చేయకుండా మట్టిలో పోసినా, అది కుళ్ళిపోయి తీవ్రమైన దుర్వాసన వస్తుంది. మిద్దె తోటల్లో ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది.

ఇదీ చ‌ద‌వండి:హైడ్రోజెల్స్‌తో కరువుకు చెక్‌!

7. పాలలో ఉండే చక్కెర (లాక్టోస్‌), కొవ్వు పదార్థాల వల్ల చీమలు, ఈగలు, ఇతర హానికరమైన కీటకాలు మొక్కల వైపు ఆకర్షితులవుతాయి.

8. పాలను నేరుగా లేదా ఎక్కువ మోతాదులో వాడితే, ఆకులపై ఒక మందపాటి కొవ్వు పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల మొక్కలు గాలిని, సూర్యరశ్మిని సరిగ్గా తీసుకోలేక కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోయి ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి.

9.  మట్టిలో పాలు ఎక్కువైతే ఫంగస్‌ పెరిగి, వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.

10. ఎప్పుడూ పాలను నేరుగా మొక్కలకు పోయకూడదు. 1 వంతు పాలకు 9 వంతు నీటిని (1:9 నిష్పత్తిలో) కలిపి బాగా పలుచన చేయాలి.

ఇదీ చదవండి:అడవిని కాపాడే ఆడపులులు

11. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి 2 వారాలకు ఒకసారి ఆకులపై, ముఖ్యంగా ఉదయం పూట ఎండ రాకముందు స్ప్రే చేయాలి.

12. పాడైపోయిన పాలు లేదా ఇళ్లలో మిగిలిపోయిన పాలను కూడా ఈ విధంగా నీటిలో కలిపి వాడుకోవచ్చు.

13. టమోటా, మిరప, వంగ వంటి కూరగాయల మొక్కలకు పాలను వాడటం వల్ల పూత రాలడం తగ్గుతుంది. కాయలు కుళ్ళిపోఒకుండా నాణ్యంగా పెరుగుతాయి.

14. మొక్క నాటిన 20–30 రోజులకు ఆకులపై లైట్‌గా స్ప్రే చేయడం వల్ల ఆకులు ముడత పడకుండా ఆరోగ్యంగా, పచ్చగా పెరుగుతాయి.

15. మొగ్గ, పూత దశ  సమయంలో పాల మిశ్రమాన్ని స్ప్రే చేయడం చాలా ముఖ్యం. పాలలో ఉండే కాల్షియం, అమైనో ఆమ్లాలు పూత రాలడాన్ని తగ్గించి, ఎక్కువ పిందెలు వచ్చేలా చేస్తాయి.  

కొల్లి కృష్ణ కుమారి,
అడ్మిన్, గుంటూరు జిల్లా 
మిద్దె తోటల బృందం
మొబైల్‌: 94906 02366