Sania Mirza reveals Farah Khan gave son Izhaan Rs 100 signing amount

PC: Instagram

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జాగురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డబుల్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌గా ఎదగడంతో పాటు.. ఆరుసార్లు గ్రాండ్‌ స్లామ్‌ చాంపియన్‌గా నిలిచిన ఘనత ఆమెకు ఉంది. ఈ హైదరాబాదీ నాలుగుసార్లు ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది.

తన పదేళ్ల కెరీర్‌ (2003-2023)లో మొత్తంగా 43 డబ్ల్యూటీఏ డబుల్స్‌ టైటిళ్లు, ఒక సింగిల్‌ టైటిల్‌ గెలిచిన సానియా.. రియో ఒలింపిక్స్‌ 2016లో సెమీ ఫైనల్‌కు కూడా చేరింది. తద్వారా భారత్‌లో అత్యంత విజయవంతమైన మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌గా ఆమె పేరుగాంచింది.

వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు
అయితే, కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న సానియా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌కు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. కొన్నేళ్ల క్రితం అతడితో విడిపోయింది. షోయబ్‌ సానియాతో వివాహ బంధంలో ఉండగానే.. పాక్‌ నటితో ఎఫైర్‌ పెట్టుకున్నాడనే వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో సదరు నటిని పెళ్లాడి షోయబ్‌ మాలిక్‌ పెళ్లి ఫొటోలు షేర్‌ చేయగా.. సానియా షోయబ్‌కు విడాకులు ఇచ్చిన సంగతి బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలో తనకు సమస్యలు వచ్చినపుడు స్నేహితులే అండగా నిలిచారని గతంలో సానియా పలు సందర్భాల్లో వెల్లడించింది.

బెస్ట్‌ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ 
సానియా బెస్ట్‌ ఫ్రెండ్స్‌లో.. భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప భార్య శీతల్‌, బిర్లా గ్రూపు వారసురాలు అనన్య బిర్లా, బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌, బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఫరా సానియాకు అత్యంత సన్నిహితురాలు.

ఈ నేపథ్యంలో తాజాగా.. బాలీవుడ్‌ జంట నేహా దుఫియా- అంగద్‌ బేడీ చాట్‌ షోలో పాల్గొన్న సానియా మీర్జా.. ఫరాతో తన స్నేహం గురించి గుర్తు చేసుకుంది. తనకే కాకుండా తన కుమారుడు ఇజహాన్‌ ( Izhaan Mirza Malik )కు కూడా ఫరా మంచి స్నేహితురాలు అని హర్షం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇజహాన్‌ పుట్టినపుడే వాడిని సినిమా హీరో చేస్తానని ఫరా తనకు మాటిచ్చిందని సరదాగా పేర్కొంది.

వాడిని హీరో చేస్తాననే మాటతో పాటు.. రూ. 100 ఇచ్చింది
ఈ మేరకు.. ‘‘ఇజహాన్‌ నెలల పిల్లవాడిగా ఉన్నపుడే ఫరా నాకు మాట ఇచ్చింది. వీడు పెరిగి పెద్దైన తర్వాత.. వీడితో సినిమా చేస్తానని చెప్పింది. అంతేకాదు.. అందుకోసం ఇప్పుడే ఒప్పందం చేసుకుంటున్నానని.. రూ. 100 నోటు నా చేతిలో పెట్టింది. ఇప్పటికీ ఆ నోటు నా దగ్గరే ఉంది’’ అని సానియా మీర్జా తమ మధ్య జరిగిన సరదా సంభాషణను వివరించింది.

కాగా సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌లకు 2018లో కుమారుడు ఇజహాన్‌ జన్మించాడు. అయితే, షోయబ్‌తో విడిపోయిన తర్వాత కుమారుడి బాధ్యతను సానియా తీసుకుంది. 

ప్రస్తుతం కొడుకుతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్న ఆమె.. అక్కడే టెన్నిస్‌ అకాడమీ కూడా నెలకొల్పింది. కుమారుడి పెంపకమే తనకు అన్నింటికంటే ముఖ్యమైన విషయమని.. అతడు ఏ కెరీర్‌ ఎంచుకున్నా తాను కచ్చితంగా ప్రోత్సహిస్తానని సానియా గతంలో పేర్కొంది.

చదవండి: వన్డేలో సెహ్వాగ్‌ కుమారుడి విధ్వంసం.. డబుల్‌ సెంచరీ మిస్‌!