
ఇంగ్లిష్ పాటకు కూచిపూడి చేశా!
ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారులు, గురువులైన రాజా- రాధారెడ్డి దంపతుల గారాలపట్టి భావనారెడ్డి. ఐదేళ్లకే గజ్జెకట్టి దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తున్నారు. తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న భావన... కూచిపూడి వైభవాన్ని మరింత పెంచేందుకు కంకణం కట్టుకున్నారు.

- A
- A+
- A++
ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారులు, గురువులైన రాజా- రాధారెడ్డి దంపతుల గారాలపట్టిభావనారెడ్డి. ఐదేళ్లకే గజ్జెకట్టి దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తున్నారు. తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న భావన... కూచిపూడి వైభవాన్ని మరింత పెంచేందుకు కంకణం కట్టుకున్నారు. ఆ ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...
ఊహ తెలియక ముందునుంచే కూచిపూడి నా జీవితంలో భాగమైంది. దిల్లీలోని మా ఇంట్లో గురుకుల వాతావరణం ఉండేది. ఎందరో పిల్లలు కూచిపూడి నేర్చుకునేవారు. అక్క యామిని, నేను వాళ్లతో కలిసిపోయేవాళ్లం. జ్వరమనో, ఇంకో అనారోగ్యంవల్లనో రాలేదని పిల్లలెవరైనా చెబితే ‘వచ్చి కూర్చొని చూడండి పోనీ’ అనేది అమ్మ. దాంతో సాకులు చెప్పి తప్పించుకునే అవకాశమే లేదు. చదువుని నిర్లక్ష్యం చేసినా ఒప్పుకొనేవారు కాదు. ఎప్పుడూ డిస్టింక్షన్ మార్కులు వచ్చేవి. లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి బీకామ్ ఆనర్స్ చేశా. అయిదేళ్లప్పట్నుంచీ రాజా- రాధారెడ్డి, కౌసల్యరెడ్డి బృందంలో సభ్యురాలినే. 1997లో అమెరికా పర్యటనలో భాగమై ప్రహ్లాద చరిత్ర ప్రదర్శనలో చిన్ననాటి ప్రహ్లాదుడి పాత్రను పోషించా. ఆరోజుల్లోనే సోలోగా అజంతా, ఎల్లోరా ఫెస్టివల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. దిల్లీలోని ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్’ ఆడిటోరియంలో రాష్ట్రపతి, ప్రధాని సహా దేశవిదేశాలకు చెందిన ప్రముఖులెందరో హాజరైన కార్యక్రమాల్లో నృత్యం చేశా.
కూచిపూడి ప్రత్యేకం...
డ్యాన్స్ ఏకాగ్రతని పెంచడమే కాదు, మెదడు పనితీరునీ మెరుగుపరుస్తుంది. కూచిపూడి ఇంకా ప్రత్యేకం. ఈ నృత్యం వేగంగా, కఠినంగా సాగుతూనే ఒక్కోసారి నెమ్మదిగా ఉంటుంది. దీన్లో నృత్యంతోపాటు కథనీ చెబుతుండాలి. ఈ విభాగంలో నాన్న కొన్ని ప్రయోగాలు చేసేవారు. ‘భామా కలాపం’లో సత్యభామ లేఖ రాయడాన్ని నృత్య రూపంలో చూపాలి. మధ్యలో డైలాగులూ ఉంటాయి. సూఫీ సంగీతం, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లోని పద్యాలూ, కథల్నీ కూచిపూడి ద్వారా ప్రదర్శించాం. శివుడు, కృష్ణుడు, రాధ, సత్యభామ... ఇలా ఎన్నో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశా. ఇటీవల అమెరికాలో జార్జ్ హారిసన్ ‘మై స్వీట్ లార్డ్’ పాటని కూచిపూడి ద్వారా ప్రదర్శించినప్పుడు మంచి స్పందన వచ్చింది.
పాశ్చాత్య సంగీతం...
నటన, నృత్యం, గానం కలగలిపి ఉండే ఓ సంపూర్ణ కళారూపం కూచిపూడి. దాంతో చిన్నప్పుడే కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. గాత్రం, వయోలిన్ వచ్చు. శ్రుతి జ్ఞానం ఉండటంతో సంగీతంపైన ఆసక్తి పెరిగింది. దాంతో పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నా. పాటల కంపొజిషన్, ప్రొడక్షన్ కూడా వచ్చు. ‘ఫేసెస్’ పేరుతో మ్యూజిక్ కంపెనీ ప్రారంభించా. దీనిద్వారా భారతీయ, పాశ్చాత్య సంగీత రీతుల్ని కలిపి ఆల్బమ్లు తెచ్చాం. ప్రస్తుతానికి దీన్నుంచి విరామం తీసుకున్నా.
ఆన్లైన్ శిక్షణ...
ఓ వైపు ప్రదర్శనల్ని కొనసాగిస్తూనే... ఆన్లైన్లో కూచిపూడి క్లాసులు చెప్పడానికి ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డ్యాన్స్’ని కొవిడ్లో ప్రారంభించా. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, యూఏఈ తదితర దేశాల్లో ఉన్నవాళ్లతోపాటు భారత్ నుంచీ ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. ఏడాదిపాటు వీళ్లకు శిక్షణ ఉంటుంది. చివరగా ఓరోజు ప్రత్యేక ప్రదర్శనని ఏర్పాటుచేస్తా. ఫలితంగా కూచిపూడి ప్రపంచవ్యాప్తం అవుతోంది. దిల్లీలోని ‘నాట్య తరంగణి’కి బోర్డు డైరెక్టర్గా చేరా. అమ్మానాన్న 50 ఏళ్ల కిందట పెట్టిన ప్రతిష్ఠాత్మక సంస్థ ఇది. ఇక్కడ క్లాసులు చెబుతూనే నిర్వహణ బాధ్యతలూ చూస్తున్నా. అక్క హైదరాబాద్లోని నాట్య తరంగణి కేంద్రాన్ని చూసుకుంటోంది. కూచిపూడి నాకు జీవనవిధానం. సాధన, బోధన లేకుంటే ఆరోజు సంతృప్తినివ్వదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలూ, నృత్య ఉత్సవాల్లో కూచిపూడి ప్రదర్శనలు ఇస్తుంటా. మావారు డెనిస్ నిల్సన్ది స్వీడన్. పెర్క్యూషనిస్ట్... సోలో ప్రదర్శనలు ఇస్తారు. ఓ బ్యాండ్లోనూ సభ్యుడు. మాకో అబ్బాయి మాల్టాస్ రెడ్డి.
వాళ్లు కళాకారులు కారు
సంప్రదాయ నృత్యం పవిత్రతతో ముడిపడిన భావన. పాదాల కదలిక, అభినయం, ముద్ర, జతి వీటిమధ్య చక్కని సమన్వయం ఉండాలి. ఇవేవీ తెలియకుండానే రీల్స్ పేరుతో ఇప్పుడు ఈ నృత్యాలకు సంబంధించిన వీడియోలు పెడుతున్నారు. వాళ్లను కంటెంట్ క్రియేటర్లుగానే చూడాలి. నిమిషం, రెండు నిమిషాలు కాదు, కనీసం గంటసేపు నృత్యం చేయగలిగేవాళ్లే కళాకారులు.
- ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఆధ్వర్యంలో విదేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు.
- లాస్ ఏంజెలెస్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాలో భాగంగా 2019లో వాల్ట్ డిస్నీ కాన్సెర్ట్ హాల్లో ప్రదర్శన ఇచ్చారు.
- సంగీత నాటక అకాడమీ నుంచి బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం అందుకున్నారు.
- కూచిపూడి నృత్యానికి అందించిన సేవలకుగానూ తెలుగు కల్చరల్ అసోసియేషన్, టెక్సాస్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం.
- ఫిక్కీ యంగ్ ఉమెన్ అఛీవర్ అవార్డు.