బృందావనం థీమ్‌తో.. అందమైన లెహెంగాలో..!

పండగైనా, వేడుకైనా అంబానీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. ఆయా సందర్భాలకు అనుగుణంగా దుస్తులు ధరిస్తూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తుంటారు అంబానీ ఆడపడుచులు. అలా ప్రస్తుతం అందరూ ఈషా అంబానీ లుక్‌ గురించే మాట్లాడుకుంటున్నారు.

Eenadu icon
By Vasundhara Team Published : 15 Oct 2026 15:34 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

(Photos: Instagram)

పండగైనా, వేడుకైనా అంబానీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. ఆయా సందర్భాలకు అనుగుణంగా దుస్తులు ధరిస్తూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తుంటారు అంబానీ ఆడపడుచులు. అలా ప్రస్తుతం అందరూ ఈషా అంబానీ లుక్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే తమ బ్రాండ్‌ ‘స్వదేశ్‌’ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అదే రోజున నవరాత్రి ఉత్సవాల్ని కూడా నిర్వహించింది అంబానీ కుటుంబం. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై.. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే దుస్తుల్లో మెరిసిపోయారు. అయితే వీళ్లందరిలోకెల్లా ఈషా ధరించిన లెహెంగా అందరినీ ఆకట్టుకుంది. నిజానికి దీన్ని రూపొందించడానికి దాదాపు 90 రోజులకు పైగా సమయం పట్టిందంటున్నారు డిజైనర్లు. అంతేకాదు.. ఈ లెహెంగా డిజైనింగ్‌లో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

బృందావనం థీమ్‌తో..!

ఏడాది క్రితం రిలయన్స్‌ ఫౌండేషన్‌ భారతీయ సంప్రదాయ కళలు, చేనేత వస్త్రాలు, హస్తకళల్ని ప్రోత్సహించేందుకు ‘స్వదేశ్‌’ బ్రాండ్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మొదటి వార్షికోత్సవ వేడుకల్ని, నవరాత్రి ఉత్సవాల్ని ఇటీవల ఒకే రోజున నిర్వహించింది అంబానీ కుటుంబం. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ నిర్వహణ, అంతర్జాతీయ విస్తరణ బాధ్యతలు చూసుకుంటోన్న ఈషా ఈ వేడుకల్ని ప్రతిబింబించేలా ఓ లవ్లీ లెహెంగాను డిజైన్‌ చేయించుకుంది. ఐవరీ సిల్క్‌ ఫ్యాబ్రిక్‌పై తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కళంకారీ హస్తకళను, ఒడిశాకు చెందిన సంప్రదాయ పట్టచిత్ర కళను జోడించి కళాత్మకంగా ఈ లెహెంగాను తీర్చిదిద్దారు. బృందావనం థీమ్‌తో డిజైన్‌ చేసిన ఈ లెహెంగా స్కర్ట్‌పై రాధాకృష్ణుల రాసలీలల ఘట్టాల్ని చేత్తో పెయింట్‌ చేశారు. అక్కడక్కడా జర్దోసీ వర్క్‌తో హంగులద్దిన ఈ లెహెంగాను ముత్యాలు, బీడ్స్‌, మిర్రర్‌ వర్క్, లట్కన్లతో అలంకరించి నవరాత్రి లుక్‌ తీసుకొచ్చారు. ఇలా తన లెహెంగా స్కర్ట్‌కి జతగా మ్యాచింగ్‌ షర్ట్‌ స్టైల్‌ బ్లౌజ్‌ ధరించిన ఈషా.. ఎరుపు రంగు దుపట్టాతో మెరుపులు మెరిపించింది. దుపట్టా బోర్డర్ పైనా కళంకారీ, పట్టచిత్ర హస్తకళలతో హంగులద్దారు. బ్లౌజ్‌ హ్యాండ్స్, దుపట్టా చివర్లలో లట్కన్స్‌ని జతచేసి అదనపు లుక్‌ తీసుకొచ్చారు డిజైనర్లు.

అమ్మ నగలు..

పది మంది కళాకారులు, 90 రోజుల పాటు కష్టపడి, 2 వేల గంటలకు పైగా సమయం వెచ్చించి మరీ ఈ లెహెంగాను డిజైన్‌ చేశారట. ఇలా తన ట్రెడిషనల్‌ లుక్‌కి అందమైన ఆభరణాలతో హంగులద్దింది ఈషా. తన తల్లి నీతా అంబానీ జ్యుయలరీ కలెక్షన్‌ నుంచి భారీ చోకర్‌ నెక్లెస్‌ను ఎంచుకున్న ఆమె.. షాండ్లియర్‌ ఇయర్‌ రింగ్స్‌తో తన లుక్‌ని పూర్తిచేసింది. ఇలా ఈషా లెహెంగానే కాదు.. ఆమె హెయిర్‌ యాక్సెసరీ కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది. వదులైన హెయిర్‌స్టైల్లో.. జడ పొడవునా సరిపోయేలా ఎరుపు, నీలం, పసుపు, తెలుపు రంగుల ఆర్టిఫిషియల్‌ పూలతో తయారుచేసిన జడకుచ్చుల్ని ధరించి స్టైలిష్‌గా మెరిసిపోయింది. ప్రముఖ ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌ అనైతా ష్రాఫ్‌ అదజానియా ఈషాకు స్టైలిస్ట్‌గా వ్యవహరించారు. ఈషా లెహెంగా లుక్స్‌ని, ఆమెతో కలిసి దిగిన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘హార్ట్‌’ సింబల్‌ని జోడించారామె. ఈ ఫొటోలు వైరలవడంతో అటు సెలబ్రిటీలు, ఇటు నెటిజన్లు ఈషా లుక్‌కి ఫిదా అవుతున్నారు. ‘బ్యూటిఫుల్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :