Mother Of All Bombs On Iran Nuke Sites On Table If US Resumes War

వాషింగ్టన్:ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మళ్లీ ప్రారంభిస్తే.. ఆ దేశంలోని అణు కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేసే అవకాశాలను అమెరికా సైన్యం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ (MOAB)గా పిలిచే అత్యంత శక్తిమంతమైన బాంబును ఉపయోగించే ప్రణాళిక కూడా ఉన్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. ఈ వివరాలను అమెరికా అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్‌ పేర్కొంది. అయితే ఈ నివేదికను రాయిటర్స్‌ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.

ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే.. ఇరాన్‌లోని ఇంధన కేంద్రాలు, పిక్‌యాక్స్‌ మౌంటైన్‌ వంటి అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశాలను సైన్యం ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ దాడులు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు కానీ.. లేదంటే ఎన్నికల తర్వాత ఈ సైనిక చర్యలను పునఃప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సదరు కథనం పేర్కొంది.

భూగర్భ కేంద్రాలపై ఎంతవరకు ప్రభావం?
MOAB బరువు సుమారు 9,800 కిలోలు. ఇది అణ్వాయుధం కాదు కానీ, భారీ పేలుడు సృష్టించగలదు. అయితే గ్రానైట్‌ పొరలతో రక్షణ కల్పించిన భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఈ బాంబు ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుందనే సందేహాలు అమెరికా అధికారుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీని భారీ పేలుడు పరిధి కారణంగా జరిగే ప్రాణనష్టంపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

యుద్ధం నుంచి బయటపడేందుకు, తమకు విజయం లభించినట్లు చూపించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం వివిధ సైనిక ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు సీఎన్‌ఎన్‌ నివేదించింది. అయితే, ఇరాన్‌పై కొత్త దాడులకు సంబంధించి తుది నిర్ణయం  తీసుకున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చదవండి:భారత్, చైనాపై సుంకాల ముప్పు.. 10 రోజుల్లో ట్రంప్ కీలక నిర్ణయం!