Vangaveeti Narendra Fires On Chandrababu And Yellow Media

సాక్షి, తాడేపల్లి:రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్‌ జగన్‌పై తప్పుడు కేసులతో ఎల్లో మీడియాతో కలిసి విష ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఫైర్‌ అయ్యారు.

ఎన్నికలు రాగానే తాము చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఏ రాజకీయ పార్టీకైనా సహజమని, కానీ చంద్రబాబు మాత్రం ఎదుటివారిపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందడమే పనిగా పెట్టుకున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ధ్వజమెత్తారు. వంగవీటి నరేంద్ర ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఎన్నికలు రాగానే టీవీ సీరియళ్లలా అక్రమ కేసులు:
ప్రపంచంలో ఎక్కడైనా ఎన్నికలొస్తే తాము చేసిన సంక్షేమం, అభివృద్ధిని చెప్పుకుని ఓట్లు అడుగుతారు. కానీ వెన్నుపోటు రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన చరిత్ర కలిగిన చంద్రబాబు ఆలోచన విధానం ఎప్పుడూ వక్రీకరించే దిశలోనే ఉంటుంది. ఎన్నికలు రాగానే తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని జగన్‌గారిపై విష ప్రచారాలు మొదలుపెడతారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై పెట్టిన అక్రమ కేసులు, వివేకానందరెడ్డి హత్య కేసు, లిక్కర్‌ స్కామ్‌ అంటూ ఆధారాలు లేని అంశాలను టీవీ సీరియళ్లలా ఏళ్ల తరబడి నడిపిస్తున్నారు. ఇందులో ఏ ఒక్క ఆరోపణకైనా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా? వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోరేవాళ్లు, నిందితులు అంతా నేడు చంద్రబాబు ఆఫీసుల చుట్టూనే తిరుగుతున్న వాస్తవం ప్రజలకు తెలియదా?.

హామీల అమలులో ఘోర వైఫల్యం. ప్రజలకు వెన్నుపోటు:
ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయంలో ప్రజలను ఘోరంగా వంచించి వెన్నుపోటు పొడిచారు. తమ వైఫల్యాలను ప్రశ్నిస్తారనే భయంతోనే ఇప్పుడు జగన్‌ గారి కేసులంటూ తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకునే దమ్ము లేక, పత్రికల్లో ’ఈడీ ఎదురుదెబ్బ’, ’ వైఎస్‌ జగన్‌కు షాక్‌’ అంటూ రోజూ అసత్యాలు ప్రచురిస్తూ కాలం గడుపుతున్నారు.

అది కోరుకున్నది స్వయంగా జగనే:
సీబీఐ కేసుల విచారణ ముగిసిన తర్వాతే ఈడీ కేసులు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానాల తీర్పులు స్పష్టంగా ఉన్నాయి. పదేళ్ల క్రితం పెట్టిన కేసుల్లో ఇప్పుడు హడావిడిగా విచారణలు చేయిస్తూ జగన్‌ గారికి షాక్‌ తగిలిందని అసత్యాలు రాస్తున్నారు. చంద్రబాబులా మేము వ్యవస్థలను, పత్రికలను అడ్డుపెట్టుకుని గానీ, కేంద్రంతో పొత్తులు పెట్టుకుని గానీ ఏనాడూ కేసులను ఆపుకోలేదు. మాపై పెట్టిన తప్పుడు కేసుల విచారణను ఆపాలంటూ కోర్టులో మేము వేసిన ఒక్క పిటిషన్‌ అయినా చూపించగలరా? నింద పడినప్పుడు రాజ్యాంగబద్ధంగా అభ్యంతరాలు తెలపడం హక్కు. పైగా ఈ కేసులను వీలైనంత త్వరగా, న్యాయబద్ధంగా ముగించాలని న్యాయస్థానాలను కోరుతున్నది స్వయంగా జగనే

24 క్రిమినల్‌ కేసులున్న చంద్రబాబు నీతులు చెప్పడమా?:
2024 ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్‌లో చంద్రబాబు తనపై 24 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని స్వయంగా పేర్కొన్నారు. వాస్తవానికి ఆయనపై రౌడీషీట్‌ తెరవాలి. గత ప్రభుత్వంలో ఆధారాలతో సహా సీఐడీ ఎంక్వైరీ చేసి స్కిల్‌ స్కామ్‌ లో అరెస్ట్‌ చేస్తే, అధికారంలోకి రాగానే వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుని ’మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్స్‌’ పేరుతో ఏడు కేసులను ఎలా మాఫీ చేయించుకున్నారో సమాధానం చెప్పాలి. దేశంలోనే అత్యధికంగా క్రిమినల్‌ కేసులున్న పార్టీ వెన్నుపోటు పార్టీ. ముఖ్యమంత్రిగా ఎక్కువ కేసులున్న వ్యక్తుల్లో చంద్రబాబు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి శ్రీరంగనీతులు చెబుతూ ఇతరులపై నిందలు వేయడం సిగ్గుచేటు.

దమ్ముంటే చేసిన పనులపై స్థానిక ఎన్నికల్లో తేల్చుకుందాం:
ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేక కుళ్లుకుంటున్న చంద్రబాబు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదనే భయంతోనే ఈ కుట్రలకు తెరలేపారు. కరోనా లాంటి గడ్డు కాలంలో కూడా మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చి ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లిన చరిత్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదే. ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి దమ్ము, చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన పనులతో ప్రజల్లోకి రావాలి. దీంతో స్థానిక ఎన్నికల్లో  ప్రజలు ఎవరి వైపు ఉన్నారో, ఎవరికి బుద్ధి చెబుతారో తేలిపోతుందని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు?