Shreyas-Hetmyer-Heat Argument-Naman-Dhir Takes-Revenge-3rd T20I

ఇండోర్ వేదిక‌గా టీమిండియా, వెస్టిండీస్ మ‌ధ్య జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌, విండీస్ హిట్ట‌ర్ షిమ్రోన్ హెట్‌మైర్ మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ ఆల‌స్యంగా వెలుగు చూసింది. విండీస్ బ్యాటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. నమన్‌ ధీర్‌ బౌలింగ్‌ వేయడానికి ముందు స్ట్రైక్‌లో ఉన్న హెట్‌మైర్.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట‌ర్‌తో అదే ప‌నిగా మాట్లాడుతూ కనిపించింది. 

దీంతో చిర్రెత్తుకొచ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్ అంపైర్ ద‌గ్గ‌రకు వెళ్లి.. ''ఓవ‌ర్ టూ ఓవ‌ర్ గ్యాప్‌లో విండీస్ బ్యాట‌ర్లు చాలా స‌మ‌యం తీసుకుంటున్నారు.  దీనివ‌ల్ల 30 గ‌జాల స‌ర్కిల్ వెలుప‌ల మాకు ఒక ఫీల్డ‌ర్ త‌క్కువ‌య్యే ప్ర‌మాదం పొంచి ఉంది. వాళ్ల తీరుపై చ‌ర్య తీసుకోండి'' అని ఫిర్యాదు చేశాడు. 

దీంతో విండీస్ బ్యాట‌ర్ల‌ను పిలిచిన అంపైర్ ఇలా చేయ‌డం త‌గద‌ని హెచ్చ‌రించారు. అనంత‌రం క్రీజులోకి వెళుతున్న హెట్‌మైర్ అయ్య‌ర్ వైపు చూస్తూ.. ''బౌలింగ్ చేయ‌డమే మీ ప‌ని. మాట్లాడుకోవ‌డానికి నేను నా స‌మ‌యం తీసుకుంటాను.'' అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. అయితే అయ్య‌ర్ గొడ‌వ పెద్ద‌ది చేసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. 

ఇదంతా గమనించిన నమన్‌ ధీర్‌కు ఒళ్లు మండినట్లుంది. అదే ఓవ‌ర్‌లో త‌న బౌలింగ్‌తో హెట్‌మైర్‌ను పెవిలియ‌న్ చేర్చిన నమన్‌ ధీర్‌ కెప్టెన్ శ్రేయ‌స్‌ను సంతోషంలో ముంచెత్తాడు. ఇదే సమయంలో పెవిలియ‌న్ వైపు బాట ప‌ట్టిన హెట్‌మైర్ వైపు చూస్తూ శ్రేయ‌స్ న‌వ్వుతూ ఇచ్చిన‌ లుక్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదీ చ‌ద‌వండి:చ‌రిత్ర సృష్టించిన శ్రేయ‌స్‌ అయ్యర్‌

'ఆ అమ్మాయికి మాటిస్తున్నా.. బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా'