Trump's Big Warning: Dont Call It AI Anymore

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధస్సు(AI-ఏఐ) అనే పదానికి బదులుగా ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌’ అనాలని సూచించారు. కాదని పాత పదాన్ని ఉపయోగించేవారిని శత్రువులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఏం చేస్తారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఏఐపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ పేరు మార్పు ప్రయత్నం చేస్తున్నారు. ‘ఆర్టిఫిషియల్‌’ అనే పదం ఈ సాంకేతికతను తక్కువ చేసి చూపిస్తోందని, ప్రస్తుత సాంకేతిక సామర్థ్యాలను ‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌’ అనే పదమే బాగా వివరిస్తుందని ఆయన వాదిస్తున్నారు. సెప్టెంబర్‌ 29న ఆయన సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం.. అమెరికా ప్రభుత్వ విభాగాలు అధికారిక సమాచారంలో ఏఐ(AI), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పదాలకు బదులుగా ఎస్‌ఐ(SI), సూపర్‌ ఇంటెలిజెన్స్‌ పదాలను ఉపయోగించాలి.

మస్క్‌ కూడా ఓకే అన్నారు!
ట్రంప్‌ ఆలోచనకు ఆయన సన్నిహితుడు, స్పేస్‌ఎక్స్‌ ఏఐ విభాగం అధిపతి ఎలాన్‌ మస్క్‌ కూడా మద్దతు పలికారు. తన సంస్థ పేరును ‘స్పేస్‌ఎక్స్‌ఏఐ’ నుంచి ‘స్పేస్‌ఎక్స్‌ఎస్‌ఐ’గా మార్చుతారా? అని ఓ ఎక్స్‌ వినియోగదారు అడగ్గా.. ‘అవును, ఆ మార్పు చేస్తాం’ అని మస్క్‌ బదులిచ్చారు. అయితే, పేరు మార్పునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

విమర్శలకు సమాధానంగానే.. 
కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్న కొద్దీ దాని భద్రత, దుర్వినియోగం, నియంత్రణపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. ప్రభుత్వ వెబ్‌సైట్లు, కంపెనీల వ్యవస్థలపై ఏఐ ఆధారిత దాడుల ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ సాంకేతికతపై ప్రజల్లో భయాలు, వ్యతిరేకత పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో దాని పేరును సానుకూలంగా మార్చడం ద్వారా ప్రజల దృష్టిని దాని అవకాశాలవైపు మళ్లించాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. 

ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనూ మార్పులు
ట్రంప్‌ ఆదేశాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ ఏఐ వెబ్‌సైట్‌లోనూ ‘SI’ అనే పదాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు. అయితే వెబ్‌సైట్‌ చిరునామా మాత్రం ‘AI.gov’గానే ఉంది. మరోవైపు, వైట్‌హౌస్‌లోని కొన్ని వెబ్‌పేజీల్లో ఇప్పటికీ ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ అనే పదం కనిపిస్తుండటం గమనార్హం.

ఏఐపై నియంత్రణ వద్దు..
అమెరికా ఏఐ రంగంలో ముందంజలో ఉందని, చైనాతో పోటీలో వెనుకబడకుండా ఈ సాంకేతికత అభివృద్ధిని వేగవంతం చేయాలని ట్రంప్‌ భావిస్తున్నారు. ఈ రంగంలోని కంపెనీలు స్వీయ నియంత్రణ పాటించగలవని ఆయన గతంలో పేర్కొన్నారు. అయితే ఏఐ భద్రతపై ప్రభుత్వ నియంత్రణలు అవసరమనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. పేరును మార్చడం వల్ల సాంకేతికతపై ఉన్న భద్రతా సందేహాలు తొలగిపోతాయా? లేదంటే ఇది కేవలం ప్రచార వ్యూహంగానే మిగిలిపోతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి:మిడ్‌ టర్మ్‌లో ట్రంప్‌కు ఘోర పరాభవం తప్పదా?