ఆ ఇబ్బందులకు చెక్‌ పెట్టేస్తూ!

వంట చేయడం ఒక ఎత్తైతే... పూర్తయ్యాక ఆ గదిని శుభ్రం చేయడం మరొక ఎత్తు. ఎంత చిందర వందరగా పడుంటాయో వృథా పదార్థాలు. అందులోనూ ఎక్కువ మందికి వండేటప్పుడు శుభ్రత పనులన్నీ రెట్టింపు అవుతాయి.

Eenadu icon
By Vasundhara Team Updated : 19 Aug 2026 12:33 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

వంట చేయడం ఒక ఎత్తైతే... పూర్తయ్యాక ఆ గదిని శుభ్రం చేయడం మరొక ఎత్తు. ఎంత చిందర వందరగా పడుంటాయో వృథా పదార్థాలు. అందులోనూ ఎక్కువ మందికి వండేటప్పుడు శుభ్రత పనులన్నీ రెట్టింపు అవుతాయి. ఆ ఇబ్బందులన్నీ అధిగమించాలంటే ప్రతి ఇంట్లోనూ ఈ పరికరాలు ఉండాల్సిందే...

చికెన్, చేపలు, కొన్ని రకాల కూరగాయలు... కరకరలాడుతుంటే తినడానికి భలే ఉంటాయి కదూ! అందుకే ఇవి వండేటప్పుడు బ్రెడ్‌ పొడిని అద్దుతుంటారు. ఇలా చేస్తే పిల్లలూ ఇష్టంగా తింటారు. అయితే పొడి ఎక్కువైనా, తక్కువైనా సమస్యే. అందుకే గంటల కొద్దీ సమయం వెచ్చిస్తుంటారు. ఈ క్రమంలో కింద ఒలికిపోవడం, కిచెన్‌ గట్టు పాడవడం, చీమలు చేరడం... లాంటి సమస్యలు చాలానే. అలాకాకూడదంటే ఈ ‘బ్రీడర్‌ బ్రెడ్‌ బాక్స్‌’ను వాడి చూడండి. దీనిలో బ్రెడ్‌ పొడిని వేసి, జాలీలా ఉండే కప్పుపై ఆహారపదార్ధాలను పెట్టాలి. మూతపెట్టేసి షేక్‌ చేస్తే సరి. కోటింగ్‌ సరిగ్గా పడుతుంది. మిగిలిన మిశ్రమం బాక్స్‌లోనే ఉండిపోతుంది.

పూరీలు, చపాతీలు, రోటీలు... వంటివి ఎక్కువ మందికి చేసేటప్పుడు ఒకేసారి వండేసి హాట్‌ బాక్సుల్లో పెట్టేస్తాం కదా! సాధారణ హాట్‌ బాక్సుల్లో ఆవిరి నీరుగా మారి కింద ఉన్న చపాతీలు తడిసిపోయి పాడవుతూ ఉంటాయి. అలాకాకూడదంటే ఈ ‘స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ రోటీ క్యాసరోల్‌’ను వినియోగించాల్సిందే. ఇదో ఇన్సులేటెడ్‌ హాట్‌ బాక్స్‌. డబుల్‌ లేయర్‌ స్టీల్‌తో తయారుచేయడం వల్ల వేడి బయటకు పోదు. రోటీ, చపాతీలు చాలాసేపు వేడిగా ఉంటాయి. బాక్స్‌ అడుగు భాగంలో ఒక ప్రత్యేకమైన జల్లెడ లాంటి ప్లేట్‌ని ఇస్తారు. దీనివల్ల ఆవిరి కిందకు పోయి ఆయా పదార్థాలు మెత్తగా అయిపోవు. 

కొబ్బరి పచ్చళ్లూ, లడ్డులూ, పొడులూ ఇష్టపడని వాళ్లుంటారా! రుచి కోసం స్వీట్స్‌పైన దీన్ని చల్లుకుని తినేవాళ్లూ ఉంటారు. కూరల్లోనూ ఈ పొడిని ఉపయోగిస్తారు. సమస్యంతా దీన్ని తురమడంతోనే. పాతకాలపు పరికరాల్ని వినియోగిస్తే సమయమూ వృథా, శారీరక శ్రమా తప్పదు. ఈ ‘ఎలక్ట్రిక్‌ కొబ్బరి తురుము మెషీన్‌’ను వాడితే ఆ ఇబ్బందులు ఉండవు. మోటార్‌ సహాయంతో తిరిగే ఇనుప రోలర్‌కు చుట్టూ చిన్న చిన్న ముళ్లు ఉంటాయి. హ్యాండిల్‌ పట్టుకుని కొబ్బరి పుడకలో రోలర్‌ పెట్టి స్విచ్‌ ఆన్‌ చేస్తే సరి. రోలర్‌ తిరుగుతూ కొబ్బరి తురుము వచ్చేస్తుంది. మెషీన్‌తోపాటు రకరకాల సైజుల్లో తురుముకోవడానికి వీలుగా బ్లేడ్లు వస్తాయి. నచ్చిన బ్లేడ్‌ను అమర్చి తురిమేయొచ్చు. 

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 01:47 IST