చుట్టూ తిమింగలాలు... మధ్యలో నేను!

చదివింది ఇంజినీరింగ్‌. గూగుల్‌లో ఉద్యోగం. కానీ ఆమె ధ్యాసంతా పర్యావరణం, జీవుల పరిరక్షణ గురించే! ఆ ప్రయత్నానికి తాజాగా ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాన్నీ అందుకున్నారు రుఖియా మహ్మద్‌.

Eenadu icon
By Vasundhara Team Published : 19 Aug 2026 14:24 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

చదివింది ఇంజినీరింగ్‌. గూగుల్‌లో ఉద్యోగం. కానీ ఆమె ధ్యాసంతా పర్యావరణం, జీవుల పరిరక్షణ గురించే! ఆ ప్రయత్నానికి తాజాగా ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాన్నీ అందుకున్నారురుఖియా మహ్మద్‌. ఇంతకీ తనేం చేస్తున్నారో ఆమె మాటల్లోనే..!

పులులకు తమ పరిధిలోకి ఎవరైనా వస్తే నచ్చదు. అయితే, అలాంటి ప్రవర్తనే నీమో క్లౌన్‌ ఫిష్‌ల్లోనూ కనిపిస్తుందని తెలుసా? వేలడంతే ఉంటాయి కానీ చిన్నపాటి పులుల్లా తమ రీఫ్‌లని సంరక్షించుకుంటాయి. ఓసారి వేల్స్‌ని చూద్దామని మారిషస్‌కి వెళ్లా. స్పర్మ్‌ వేల్స్‌ సరే... హమ్‌బాక్‌ వేల్స్‌ వలస వెళ్లాయి, కష్టమన్నారు. అయినా అదృష్టం పరీక్షించుకుందామని నీళ్లలోకి దిగా. శబ్దం విని పక్కకి చూస్తే పెద్ద హమ్‌బాక్‌ వేల్‌. ఇన్‌స్ట్రక్టర్‌కి చెబుదామని పక్కకి తిరిగితే మరొకటి! నా కాళ్ల కింద నుంచి బేబీ వేల్‌ వెళ్తుంది. మామూలుగా ఇవి వేగంగా ఈదుతాయి. అందుకే కనిపించవు. బేబీ ఇంకా పాలు తాగే వయసులో ఉంది. వాటికోసమని తల్లి, తండ్రి వేల్స్‌ నెమ్మదిగా ప్రయాణిస్తాయి. అలా వాటిని చూడటం సాధ్యమైంది. ఇవే కాదు ప్రకృతిలో ప్రతిదీ అద్భుతమే. మనమే ప్లాస్టిక్, వ్యర్థాలతో... హాని చేస్తున్నాం. పర్యావరణాన్ని ఆ హాని నుంచి కాపాడాలన్నదే నా ప్రయత్నం.

నేర్చుకున్నాకే కొన్నా...

మాది విజయవాడ. అమ్మ ఫిరాసత్‌. నాన్న రుహుల్లా, ఓఎన్‌జీసీలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌గా చేసేవారు. ఆయన వృత్తిరీత్యా కాకినాడలో పెరిగాను. చుట్టుపక్కల బీచ్‌లు, కొండప్రాంతాలకు నాన్న ట్రిప్‌లకి తీసుకెళ్లేవారు. ఇంట్లో కొడక్‌ కెమెరా ఉండేది. దాంతో ఫొటోలు తీసేదాన్ని. కానీ మధ్యతరగతి కుటుంబాల్లో చదువు, ఉద్యోగాలకే కదా ప్రాధాన్యం! అందుకని ఇంజినీరింగ్‌ ఆపై ఎంబీఏ పూర్తిచేసి... డెలాయిట్‌లో తొలి ఉద్యోగం తెచ్చుకున్నా. ప్రస్తుతం గూగుల్‌లో అసెట్‌ మేనేజర్‌గా చేస్తున్నా. సంపాదన మొదలుపెట్టాక ఫొటోగ్రఫీపై దృష్టిపెట్టా. ముందు అద్దె కెమెరాతో ప్రయోగాలు చేశా. ప్రత్యేక కోర్సులేం చేయలేదు. తెలిసినవాళ్లలో నేర్చుకున్నవాళ్లూ లేరు. దీంతో యూట్యూబే నా గురువైంది. అలా నేర్చుకున్నాకే సొంత కెమెరా కొనుక్కున్నా. నేను పెరిగిందంతా తూర్పు కనుమల్లోనే కదా! ఓసారి కెమెరా తీసుకుని వెళ్లా. కింద నుంచి ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా! పైనుంచి ఇంకెలా ఉంటాయోనన్న ఆలోచన వచ్చింది. దాంతో డ్రోన్‌తో ఫొటోలు తీయడం నేర్చుకున్నా. అప్పుడే చిన్నప్పుడు ఎంతందంగా ఉండేవి. ఇప్పుడేంటిలా మారిపోతున్నాయి అనిపించింది. దీని గురించి మాట్లాడాలనుకున్నా. కానీ మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటో చెప్పగలదు అనిపించింది. అలా కన్జర్వేషన్‌ ఫొటోగ్రఫీలోకి అడుగుపెట్టా.

అడ్వాన్స్‌డ్‌ డైవర్‌ని

ఒకప్పటిలా కాదు... ఇప్పుడు సమాచారం త్వరగా అందరికీ చేరుతోంది. ఏదైనా ప్రదేశం బాగుందంటే చాలు. అందరూ వెళ్లిపోతున్నారు. ఆస్వాదించి వస్తే బాగుణ్ణు. కానీ పాడు చేస్తున్నారు. చెత్తతో నింపేస్తున్నారు. రెండేళ్లు కొండ ప్రాంతాల్లో తిరుగుతూ ఈస్ట్రన్‌ ఘాట్స్‌ మారుతున్న తీరుని గమనించా. ఇవీ మనవల్ల బలవుతున్నాయి. వాటిని కాపాడాలంటే ప్రపంచానికి పరిస్థితి అర్థమవ్వాలి. అందుకు ఓ పెద్ద ప్లాట్‌ఫామ్‌ కావాలనిపించింది. అందుకే డ్రోన్‌తో ఫొటోలు తీసి, నేచర్‌ ఇన్‌ ఫోకస్‌ (ఎన్‌ఐఎఫ్‌) సంస్థకి పంపా. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా సమస్యల్ని గుర్తిస్తారు. అవి ప్రపంచమంతా తెలిసేలా, పరిష్కారాలు ఆలోచించేలా చేస్తారు. నా ఫొటోలు వాళ్లకి నచ్చి, ‘ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పోర్ట్‌ఫోలియో’ అవార్డు ఇచ్చారు. ఇది నా బాధ్యతని మరింత పెంచింది. నేల, గాల్లో ఫొటోలు తీస్తున్నా. నీటిలోపలి అందాల సంగతేంటన్న ఆలోచన వచ్చింది. దాంతో డైవింగ్‌ నేర్చుకున్నా. అడ్వాన్స్‌డ్‌ డైవర్‌ని... 40మీటర్ల లోతువరకూ వెళ్లగలను. దాదాపు అన్ని సముద్రాల్లో డైవింగ్‌ చేశా. దానికోసమూ ప్రత్యేక కెమెరా కొనుక్కున్నా. నాకు సొరలు, తిమింగలాలంటే ఇష్టం. వేల్స్‌ని దగ్గరగా చూడాలనే ఫ్రీడైవింగ్‌ నేర్చుకున్నా. ఆక్సిజన్‌ సిలిండర్‌ లేకుండా నీటిలోకి వెళ్లడమన్నమాట. లెవల్‌-1 పూర్తిచేశా. రెండున్నర నిమిషాల వరకూ ఊపిరి ఆపుకోగలను. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూనే ఫొటోగ్రఫీనీ కొనసాగిస్తున్నా. ఇప్పటివరకూ 12 దేశాలు తిరిగాను. కన్జర్వేషన్‌ అంటే అడవులు, బొటానికల్‌ గార్డెన్లు వంటి చోట్లకి వెళ్లాలి. వారాంతాలు కేటాయిస్తా, విదేశాల్లో వాటికి మాత్రం కాస్త ఎక్కువ రోజులుండేలా చూసుకుంటా. అరుదైన, అంతరించిపోతున్న జీవుల్ని ఫొటోలు తీస్తుంటా. దానికి చాలా ఓపిక కావాలి. ఎంతో తెలుసుకోవాలి. అందుకే ఇన్‌స్ట్రక్టర్ల సాయం తీసుకుంటా. చిన్న కన్జర్వేషన్‌ ఫిల్మ్స్‌ చేయాలి. నేషనల్‌ జియోగ్రఫీ కమ్యూనిటీలో సభ్యురాలయ్యేంతగా ఎదగాలన్నది నా ఆశ. 

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :