ఆనాటి ఫొటో... అందమైన జ్ఞాపకం!

ఆ రోజు ఆదివారం... అమ్మ అల్మరాలోని సామాన్లన్నీ బయటకు తీసింది. నా దృష్టి ఆల్బమ్స్‌ మీద పడింది. వాటిని తిరగేస్తుంటే... 

Eenadu icon
By Vasundhara Team Updated : 19 Aug 2026 04:25 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఆరోజు ఆదివారం... అమ్మ అల్మరాలోని సామాన్లన్నీ బయటకు తీసింది. 

నా దృష్టి ఆల్బమ్స్‌ మీద పడింది. వాటిని తిరగేస్తుంటే... అమ్మ వచ్చి పక్కనే కూర్చుంది. 

తరవాత నాన్న కూడా. వాటిల్లో అమ్మానాన్నల చిన్నతనం, స్కూలు, కాలేజీ, పుట్టినరోజు, పెళ్లి సందర్భాల్లో తీసినవి... వీటితోపాటు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, చిన్నతాతలు, చిన్నమ్మలు... బంధువులందరూ కలిసి ఉన్నవీ... మొత్తమ్మీద పదుల సంఖ్యలోనే. 

వాటిని చూపిస్తూ ‘ఇది మావయ్య వాళ్ల ఊరు వెళ్లినప్పటిది, అది నా ఓణీల వేడుకదీ...’ అంటూ అమ్మ ఆనాటి రోజుల్లోకి వెళ్లిపోయింది. ఒక్కో ఫొటో... ఎంతో అపురూపం. ఎన్నో జ్ఞాపకాల సమాహారం. 

కొన్ని ఫొటోలకి వెనక తేదీ, స్థలం, సందర్భం రాసి ఉన్నాయి. ఆ ఫొటోలకోసం కొత్తబట్టలేసుకుని, పౌడరు ముస్తాబు చేసుకుని, స్టూడియోకి వెళ్లడం, జుట్టు సవరించుకుని కదలకుండా కూర్చోవడం... ఇలా అప్పటి విశేషాల్ని ఆపకుండా చెబుతూనే ఉంది. ఇల్లు, ఉద్యోగ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా ఉండే అమ్మ... అన్నీ మరిచి అలా కబుర్లు చెప్పడం నాకెంతో ఆనందంగా అనిపించింది. 

అప్పట్లో ఎవరికైనా కెమెరా ఉంటే ఎంతో గొప్ప. విహారయాత్ర, పండుగ, పెళ్లికి తెలిసినవాళ్లంతా అదే అడిగి తీసుకునేవారు. ఆ రీల్‌ పూర్తయి, ఫొటో చేతికొచ్చేవరకూ ఎంతో ఎదురుచూసేవారట. ఆ ఫొటోల్లో అప్పటి మా తాతయ్య పెంకుటిల్లునీ చూడగలిగా. ఇప్పుడు దాని స్థానంలో డాబా వచ్చింది మరి. 

అందుకే... ఆ ఫొటోలు కేవలం జ్ఞాపకాలు కాదు. అప్పటి ఫ్యాషన్లనీ చుట్టాల్నీ ఊరినీ... తరాల చరిత్రనీ పరిచయం చేస్తాయని అర్థమైంది. 

చివరగా నా చిన్నప్పటి ఆల్బమ్‌... అవి తీయడానికి నన్ను ఎలా తయారుచేసిందీ, అప్పుడు నేను చేసిన అల్లరీ... ఇలా అన్నీ చెబుతోంది అమ్మ. నాకోసమే కొడక్‌ తరవాత ఒలింపస్‌ కెమెరా కొన్నామనీ... ఒక్కో రీలుకి 24 వరకే ఉండేవనీ జాగ్రత్తగా రెండుమూడు నెలలపాటు తీసేవాళ్లమనీ... అదయ్యాక, ఫిల్మ్‌ కడగానికి ఇచ్చి... ఫొటోలు తెచ్చినరోజు... ఇంట్లో చిన్నపాటి పండుగేననీ... ఆఫీసులోనూ అందరికీ చూపించి మురిసిపోయేదాన్ననీ అమ్మ చెబుతుంటే... ఫొటో అంత అపురూపమా అనిపించింది. 

అయితే హైస్కూలు తరవాత ఆల్బమ్‌లో నా ఫొటోల్లేవు. అదే అడిగితే...

‘తరవాత డిజిటల్‌ కెమెరా వచ్చింది. కొన్నాళ్లకే స్మార్ట్‌ఫోన్‌ చేతికొచ్చేసింది. ఫొటో తీయడానికి ఖర్చు, సమయం లేకుండా పోయాయి. కూర్చున్నా, నిలుచున్నా ఫొటోనే, సెల్ఫీలే... హార్డ్‌ డిస్క్‌లో ఫోన్‌లో గూగుల్‌ మెమరీలో అవన్నీ భద్రమే. వాటిల్లో కొన్నింటిని తీసి ఎప్పటికప్పుడు ప్రింట్‌ చేయిద్దాం అనుకుంటూనే కాలం వేగంగా గడిచిపోతోంది. నీకు పాతికేళ్లు వచ్చేశాయి’ అని నవ్వింది.  

అవును కదా... ఒకటీ రెండూ ఉన్నప్పుడు అది అపురూపం. క్షణక్షణాన్నీ బంధించేస్తుంటే... వాటిల్లో దేన్ని ప్రింట్‌ చేయించాలో ఫ్రేమ్‌ చేయించాలో తెలియని పరిస్థితి. ఫలితమే ఇప్పటి నేను... ఆల్బమ్‌లో లేకపోవడం!

పైగా అప్పట్లో ఇంటికి చుట్టాలొచ్చినా లేదా ఏ కాస్త ఖాళీ దొరికినా ఆల్బమ్‌లే తిరగేసేవారు. మరి నేడో... ‘మా పిల్లల పెళ్లి వీడియో... కాదు, ట్రైలర్‌ చూపిస్తామ’న్నా ‘కాస్త పనుందండీ... మరోసారి చూద్దాం’ అని మర్యాదగానే తప్పించుకుంటున్నారు. ఎవరివి వాళ్లు చూసుకోవడమే గగనమైంది మరి.. ఇక ఫొటోలయితే లెక్కే లేదు. వాటిల్లో కొన్నింటిని ఎంపికచేసే తీరికలేక... ఆల్బమ్‌ చేయించకుండానే సంవత్సరాలు గిర్రున తిరిగిపోతున్నాయి. 

అందుకే... ఏదీ అతి కాకూడదు. అప్పట్లో ఫొటోలు తక్కువ... జ్ఞాపకాలు ఎక్కువ. ఇప్పుడు... దీనికి రివర్స్‌!

లక్షల్లో ఫొటోలుంటున్నాయి. అనుభూతులే కరవయ్యాయి!

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 03:04 IST