మహిళా ‘అర్జున’లు!

అమ్మాయిలకు ఆటలా అనొద్దు! ఆసక్తి చూపితే... వాళ్లనీ పోత్సహించండి, వీలైతే అవకాశాలు కల్పించండి. రెట్టించిన ఉత్సాహంతో అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రోత్సాహాన్ని పతకాలుగా మారుస్తారు.

Eenadu icon
By Vasundhara Team Published : 19 Aug 2026 03:10 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

అమ్మాయిలకు ఆటలా అనొద్దు! ఆసక్తి చూపితే... వాళ్లనీ పోత్సహించండి, వీలైతే అవకాశాలు కల్పించండి. రెట్టించిన ఉత్సాహంతో అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రోత్సాహాన్ని పతకాలుగా మారుస్తారు. అంతర్జాతీయ వేదికల్లో జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తారు. తాజాగా ‘అర్జున’ అవార్డుకు ఎంపికైన ఈ అమ్మాయిలే అందుకు నిదర్శనం.

11 ఏళ్లకు రాష్ట్రస్థాయి విజేత ఆమె..., 14 ఏళ్లకు జాతీయ ఛాంపియన్, 15 ఏళ్లకు ప్రపంచస్థాయి క్రీడాకారిణి... ఈ ప్రయాణం చాలదూ గాయత్రి గొప్పతనం చెప్పడానికి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుని ప్రకటించింది. దిగ్గజ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ కుమార్తె అనే అంచనాల భారాన్ని మోస్తూనే, తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సాధించుకున్నారామె. తల్లి పీవీవీ లక్ష్మి కూడా ఒలింపియనే కావడం విశేషం. నాన్న అకాడమీలోనే శిక్షణ... అయినా మినహాయింపులేమీ లేకుండానే కఠోర సాధన చేశారు. క్రమశిక్షణ అలవరుచుకున్నారు. అదే తన విజయానికి పునాది అయ్యింది. కెరియర్‌ ఆరంభంలో గాయత్రి సింగిల్స్‌ క్రీడాకారిణిగా జూనియర్, సీనియర్‌ స్థాయిలో మంచి విజయాలూ సాధించారు. అయితే, తన ఆసక్తి డబుల్స్‌ వైపు ఉండటంతో అటే మొగ్గు చూపారు. అదే ఆమె కెరియర్‌ని మలుపు తిప్పింది. కోచ్‌ల సలహాతో కేరళకు చెందిన ట్రీసా జాలీతో జోడీ కట్టారు. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచిందీ జంట. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌లో వరుసగా రెండుసార్లు సెమీఫైనల్స్‌ చేరి సంచలనం సృష్టించింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించడంతో పాటు, ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చరిత్రాత్మక స్వర్ణం అందించడంలోనూ కీలక పాత్ర పోషించింది. అద్భుతమైన నెట్‌ ప్లే చేయడంలోనే కాదు, ఎంత ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయగల శక్తి గాయత్రి సొంతం.

సొంతూరు కేరళలోని కన్నూర్‌ జిల్లా, పులింగోమ్‌. ఇంటి ప్రాంగణమే మొదటి కోర్టు. పీఈటీ అయిన తండ్రి జాలీ మాథ్యూ, తొలి గురువు. కూతురు కెరియర్‌ కోసం ఉద్యోగాన్ని వదిలేశారాయన. ఏడేళ్లకే అండర్‌-11 కేటగిరీలో ఆడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు గెలిచారు ట్రీసా. అమ్మాయి ఆటల్లో ముందుకు వెళ్లాలంటే నిరంతర శిక్షణ ఉండాలనుకున్నారు జాలీ. బంగారం అమ్మి, కొంత అప్పు చేసి ఇంటి ముందే ఇండోర్‌ కోర్టు కట్టించారు. శిక్షణ, క్రీడా వస్తువులు, ప్రయాణాలు, పోషకాహారం... వీటికి చాలా మొత్తమే కావాలి. ఒక దశలో స్పాన్సర్లు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో కన్నూర్‌ యూనివర్సిటీ ప్రారంభించిన విద్యార్థి దత్తత కార్యక్రమానికి ఎంపికయ్యారు ట్రీసా. శిక్షణతోపాటు ఇతర సదుపాయాలన్నీ ఉచితంగా అందాయి. ఆపై కేరళ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ చేయూతనిచ్చింది. ప్రత్యేక శిక్షణ కోసం ఇండోనేషియాకి పంపింది. ఆ క్రమంలో ప్రపంచ జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానానికి చేరారు ట్రీసా. తర్వాత హైదరాబాద్‌ వచ్చి గోపీచంద్‌ అకాడమీలో చేరారు. గాయత్రీ గోపీచంద్‌ భాగస్వామిగా 2021 నుంచి డబుల్స్‌కు మారారు. అప్పట్నుంచీ కెరియర్‌ ఊపందుకుంది. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పతకాలు సాధించారు ట్రీసా. గాయత్రి, ట్రీసా కోర్టులో భాగస్వాములే కాదు, బయట మంచి స్నేహితులు కూడా. తాజాగా ఫిలిప్పైన్‌ ఇంటర్నేషనల్‌ ఛాలెంజ్‌ గెలుచుకున్నారు. ఈ ఏడాది మార్చిలో కేరళ ప్రభుత్వం రాష్ట్ర జీఎస్టీ ఆఫీసర్‌గా ట్రీసాకు ఉద్యోగం ఇచ్చింది. 

ఒక్క అవకాశంకోసం ఎన్ని తిరస్కరణలను ఎదుర్కోవాలో..? సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి... అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కలలు కనే అమ్మాయిలకైతే మరీనూ. పోషకాహారం, క్రీడా దుస్తులు, మౌలిక వసతులు, ఆట మైదానం ఇలా ప్రతిదానికీ పోరాటం చేయాల్సిందే. వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు ప్రియాంక గోస్వామి. ఈమెది ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌. నాన్న మదన్‌ పాల్‌ బస్‌ కండక్టర్‌. అమ్మ ప్రతిభ. ప్రియాంకాకు చిన్నప్పట్నుంచీ ఫ్యాషన్‌ డిజైనర్‌ అవ్వాలన్నది కోరిక. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే త్వరగా ఉద్యోగం వస్తుందని అటుగా వెళ్లారు. మొదట్లో జిమ్నాస్టిక్స్‌పై దృష్టి పెట్టారు. అవకాశాల లేమి వల్ల అథ్లెటిక్స్‌వైపు అడుగులు వేశారు. రేస్‌ వాకింగ్‌ని ఎంపిక చేసుకున్నారు. స్పాన్సర్‌ షిప్‌లు రాక, కుటుంబ పరిస్థితీ అంతంత మాత్రం కావడంతో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. సాధన చేయడానికి సరైన ట్రాక్‌లు లేక, మట్టి రోడ్లపై షూలేకుండానే ప్రాక్టీస్‌ చేసేవారు. దీనికితోడు రాష్ట్ర, జాతీయ పోటీల్లో చాలానే ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ ఓటములన్నీ ఒత్తిడికి కారణమై... ఓ దశలో కుంగిపోయారట. అమ్మానాన్నల ప్రోత్సాహంతో తిరిగి పుంజుకుని మళ్లీ ప్రయత్నించారు. జాతీయ స్థాయిలో పలుమార్లు బంగారు పతకాలు సాధించి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. అది మొదలు వెనుదిరగలేదామె. 2022లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం సాధించి, రేస్‌ వాకింగ్‌లో పతకం గెలుచుకున్న మొదటి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. నాలుగేళ్లుగా వరుస విజయాల్ని అందుకొంటూ తాజాగా అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. 

హరియాణా... కబడ్డీకి పుట్టినిల్లుగా పేరొందిన ప్రాంతం. అక్కడ నుంచి వచ్చిన ఆణిముత్యమే పూజ కాజ్లా. హత్వాలా అనే గ్రామంలో పుట్టి పెరిగారామె. క్రీడలకు ప్రాధాన్యతనిచ్చే వాతావరణంలో పెరగటంతో చిన్నతనం నుంచీ కబడ్డీపై ఆసక్తి ఉండేది. దానికి కుటుంబ మద్దతూ తోడవడంతో అందులోనే రాణించాలనుకున్నారు. మట్టి కోర్టుల్లో నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నారు. పాఠశాల స్థాయి నుంచి క్రమంగా జిల్లా, రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌లలోకి అడుగుపెట్టారు. ప్రతిష్ఠాత్మకమైన ‘ఇండియన్‌ రైల్వేస్‌ విమెన్స్‌ కబడ్డీ’ జట్టులో చోటు సంపాదించుకోవడం ఆమె కెరియర్‌ను మలుపుతిప్పింది. ఇది క్రీడాకారిణిగా ఎదగటానికీ, అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు సిద్ధం కావడానికీ సాయపడింది. లెఫ్ట్‌హ్యాండ్‌ రైడర్‌ కావడం తనకున్న ప్రత్యేక బలం. మెరుపు వేగంతో చేసే ఫుట్‌వర్క్, చురుగ్గా ప్రత్యర్థుల నుంచి తప్పించుకోవడం, చావో రేవో తేల్చుకోవాల్సి వచ్చిన రైడ్‌లలో కీలకమైన పాయింట్లను దక్కించుకోవడంలో దిట్ట పూజ. 2022లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంలో పూజది కీలకపాత్ర. 2025లో టెహ్రాన్‌లో జరిగిన ఆసియా ఆరో మహిళల కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లోనూ అద్భుతమైన రైడ్‌లతో విరుచుకుపడ్డారు. ఒకే మ్యాచ్‌లో 13 రైడ్‌ పాయింట్లు సాధించి తన కెరియర్‌లోనే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. భారత్‌ స్వర్ణం సాధించడంలో కీలకంగా ఉన్నారు. ఇందుకు జాతీయ కాజ్లా ఖాప్‌ అందించే ‘కాజ్లా గౌరవ్‌’ బిరుదునూ అందుకున్నారు. తాజాగా ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును సొంతం చేసుకున్నారు.  

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :