కంగన చీరల కథ ఇదీ!

చీరకట్టు అమ్మాయిల అందాన్నే కాదు.. దేశీ సంస్కృతీ సంప్రదాయాల్నీ ప్రతిబింబిస్తుంది. మరి, దానికే నేత కళను జోడిస్తే చీర ప్రత్యేకత ద్విగుణీకృతమవుతుంది. అలాంటి స్పెషల్‌ హ్యాండ్‌లూమ్‌ శారీస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటుంది బాలీవుడ్‌ తార కంగనా రనౌత్‌.

Eenadu icon
By Vasundhara Team Published : 18 Jun 2026 12:59 IST Ee Font size
  • A
  • A+
  • A++
6 min read

(Photos: Instagram)

చీరకట్టు అమ్మాయిల అందాన్నే కాదు.. దేశీ సంస్కృతీ సంప్రదాయాల్నీ ప్రతిబింబిస్తుంది. మరి, దానికే నేత కళను జోడిస్తే చీర ప్రత్యేకత ద్విగుణీకృతమవుతుంది. అలాంటి స్పెషల్‌ హ్యాండ్‌లూమ్‌ శారీస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటుంది బాలీవుడ్‌ తార కంగనా రనౌత్‌. ఇటీవలే విడుదలైన తన చిత్రం ‘భారత్‌ భాగ్య విధాత’ ప్రమోషన్స్‌ కోసం ఆమె ఎక్కువగా చీరకట్టులోనే కనిపించింది. అందులోనూ తాను ఎంచుకున్న చేనేత చీరలు ఆయా రాష్ట్రాల నేత కళలకు నిలువుటద్దంలా నిలిచాయని చెప్పచ్చు. ఇలా తన శారీ లుక్స్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ‘ది శారీ క్వీన్‌’ అంటూ నెటిజన్లు కంగనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మరి, ఈ చిత్ర ప్రమోషన్స్‌ కోసం కంగన ఎంచుకున్న చేనేత చీరలు, వాటి వెనకున్న కథేంటో తెలుసుకుందాం రండి..

‘కంచిపట్టు’తో అదరగొట్టింది!

ప్రత్యేక సందర్భం అనగానే ముందుగా గుర్తొచ్చేవి చీరలే. అందులోనూ అకేషన్‌ని బట్టి పట్టుచీరలకే ప్రాధాన్యమిస్తుంటారు మగువలు. ‘భారత్‌ భాగ్య విధాత’ ప్రమోషన్స్‌ని ఇలాంటి ఓ పట్టుచీరతోనే ప్రారంభించింది కంగన. అందులోనూ కంచిపట్టు చీరను ఎంచుకుంది. పర్పుల్‌ కలర్‌ బోర్డర్‌తో కూడిన ఐవరీ రంగు చీరపై రంగురంగుల ఫ్లోరల్‌ మోటిఫ్స్‌తో హంగులద్దారు. ఇక బోర్డర్‌ని బంగారు జరీతో టెంపుల్‌ తరహా మోటిఫ్స్‌తో తీర్చిదిద్దారు. ఇలా హెవీ శారీకి పర్పుల్‌ కలర్‌ ప్లెయిన్‌ బ్లౌజ్‌ను మ్యాచ్‌ చేసిన కంగన.. సింపుల్‌ ఆభరణాలు, జడలో మల్లెపూలతో తన లుక్‌ని పూర్తిచేసింది. ఈ పట్టుచీరలో సంప్రదాయబద్ధంగా కనిపించిందీ బాలీవుడ్‌ తార.

కాంజీవరం, కాంచీపురం, కంచిపట్టు.. ఇలా ఆయా ప్రాంతాల్ని బట్టి వివిధ పేర్లతో పిలిచే ఈ చీరలకు తమిళనాడులోని కాంచీపురం ప్రసిద్ధి. మల్బరీ పట్టు, నాణ్యమైన బంగారు, వెండి జరీలతో నేసే ఈ చీరలు.. రాజసం ఉట్టిపడే లుక్‌ని అందిస్తాయి. వెడల్పాటి అంచుతో ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ చీరల్లో.. చీర-బోర్డర్‌ ఒకే రంగుతో కూడినవి, వ్యతిరేక రంగుల్లో ఉన్నవీ లభిస్తాయి. దక్షిణ భారతంలోని దేవాలయ శిల్పాలు, ప్రకృతి, పక్షులు, నెమళ్లు, పూల మోటిఫ్స్‌.. వీటి స్ఫూర్తితోనే ఈ చీరల్ని నేయడం ఇక్కడి ప్రత్యేకత.

‘పైథానీ’ సొగసులు..

చీర సాధారణంగానే ఉన్నా.. బోర్డర్‌, పల్లూతో హైలైట్‌ చేయడం పైథానీ చీరల ప్రత్యేకత. అలాంటి పైథానీ పట్టు శారీతో తన చిత్ర ప్రమోషన్‌ ఈవెంట్కి కొత్త కళ తీసుకొచ్చింది కంగన. పసుపు రంగు ప్లెయిన్‌ శారీకి జతచేసిన ఎరుపు రంగు బోర్డర్‌ అద్భుతమైన కలర్‌ కాంబినేషన్‌ని అందించిందని చెప్పచ్చు. ఇక బోర్డర్‌పై పురివిప్పిన నెమలి మోటిఫ్స్‌ని తీర్చిదిద్దారు. ఇలా తన శారీకి కాంట్రాస్ట్‌ కలర్‌లో ఎరుపు రంగు బ్లౌజ్‌ను జతచేసిన ఈ ముద్దుగుమ్మ.. సింపుల్‌ ఆభరణాలు, వదులైన హెయిర్‌స్టైల్‌తో సూపర్బ్‌ అనిపించింది.

మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని పైఠన్‌ అనే గ్రామం ఈ చేనేత చీరలకు పుట్టినిల్లు. చీరపై అడ్డు, నిలువు నేత కోసం వేర్వేరు రంగు దారాల్ని వాడి నేయడంతో ఈ శారీస్‌ ఎక్కువగా మిక్స్‌డ్‌ కలర్స్‌లో కనిపిస్తుంటాయి. మల్బరీ పట్టుతో నేసే ఈ చీరల అంచులపై తీర్చిదిద్దే నెమళ్లు, తామరలు, చిలుకలు, పూల మోటిఫ్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఎక్కువగా కాంట్రాస్ట్‌ కలర్స్‌లో, చీర-బోర్డర్‌ వ్యతిరేక రంగుల్లో ఉండేలా నేసే ఈ చీరలు ఏ వయసు వారికైనా ఇట్టే నప్పేస్తాయంటున్నారు నిపుణులు.

‘పటాన్‌ పటోలా’తో రాయల్‌గా..!

చీరకట్టుతో రాయల్‌ లుక్‌ని సొంతం చేసుకోవాలంటే అది పటాన్‌ పటోలా చీరకట్టుతోనే సాధ్యమని తన శారీ స్టైల్‌తో నిరూపించింది కంగన. ఎరుపు రంగు బోర్డర్‌తో కూడిన మల్టీ కలర్‌ పటోలా శారీని ఎంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. దీనిపై రెడ్‌ కలర్‌ బ్లౌజ్‌ను మ్యాచ్‌ చేసింది. ట్రెడిషనల్‌ ఆభరణాలు, మల్లెపూలతో అలంకరించిన బన్‌ హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌ని పూర్తిచేసింది. తాను ఎంచుకున్న చీరే రాయల్‌గా ఉందంటే.. పల్లూని వెనక నుంచి ముందుకు ధరించి రాజసం ఉట్టిపడేలా మెరిసిపోయిందీ బాలీవుడ్‌ తార.

గుజరాత్‌లోని పటాన్‌ ప్రాంతానికి చెందిన ఈ పటోలా శారీస్‌ని ‘డబుల్‌ ఇక్కత్‌’ నేత పద్ధతిలో తయారుచేస్తారు. ముందే అడ్డు, నిలువు దారాల్ని విడివిడిగా కట్టి.. డిజైన్‌ ప్రకారం రంగులద్ది.. ఆరాక నేయడం ప్రారంభిస్తారట! ముందు, వెనక అనే తేడా లేకుండా ఇరువైపులా ఒకే రకమైన రంగు, డిజైన్‌తో కనిపించడం వీటి ప్రత్యేకత. రాజసానికి మారుపేరుగా నిలిచే ఈ చీరల అద్దకానికీ సహజ రంగుల్నే ఉపయోగిస్తారని.. చిలుకలు, నెమళ్లు, ఏనుగులు, పూలు.. వంటి మోటిఫ్స్‌తో పాటు జామెట్రిక్‌ షేప్స్‌ పటోలా చీరల్లో ఎక్కువగా కనిపించే డిజైన్లని నిపుణులు చెబుతున్నారు. అలాగే చీరంతా హెవీ డిజైన్‌తో ముస్తాబైనా.. బోర్డర్‌, పల్లూ మాత్రం ప్లెయిన్‌గా, లేదంటే బంగారు, వెండి జరీ గీతలతో డిజైన్‌ చేస్తారట నేత కళాకారులు.

‘కోట్‌పడ్‌’తో కళగా..!

కాటన్‌ చీరలు సౌకర్యాన్నివ్వడమే కాదు.. హుందాగానూ కనిపించేలా చేస్తాయి. అలాంటి ‘కోట్‌పడ్‌ కాటన్‌’ శారీలో మెరిసిపోయింది కంగన. చీర మొత్తం తెలుపు రంగులో, బోర్డర్‌ ఎరుపు రంగులో రూపొందించిన ఈ శారీకి.. పూర్తిగా మ్యాచింగ్‌ బ్లౌజ్‌ను జతచేసి అదరగొట్టిందీ ముద్దుగుమ్మ. హెవీ ఇయర్‌ రింగ్స్‌, పోనీ హెయిర్‌స్టైల్‌ కంగన లుక్‌ను సింప్లీ సూపర్బ్‌గా మార్చేశాయని చెప్పచ్చు.

ఒడిశా కొరాపుట్‌ జిల్లాలోని కోట్‌పడ్‌ అనే ప్రాంతం ఈ చీరలకు ప్రసిద్ధి. సహజ రంగులద్ది నేసిన ఈ చీరలపై అక్కడి గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ట్రైబల్‌ మోటిఫ్స్‌ దర్శనమిస్తాయి. ఈ క్రమంలోనే చేపలు, తాబేళ్లు, పూలు, పడవలు.. వంటి డిజైన్లతో పాటు కొన్నింటిపై ఎక్స్‌ట్రా వెఫ్ట్‌ పద్ధతిలో టెంపుల్‌ మోటిఫ్స్‌తో హంగులద్దుతారట. ఈ కాటన్‌ శారీస్‌ శరీరానికి సౌకర్యాన్నివ్వడంతో పాటు వేసవిలో చల్లదనాన్ని, చలికాలంలో వెచ్చదనాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోనూ రిచ్‌ లుక్‌ కావాలనుకునే వారి కోసం టస్సర్‌ సిల్క్‌తో రూపొందించిన కోట్‌పడ్‌ శారీస్‌ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.

‘వీణాపాణి’ శారీ లుక్‌లో..!

చీరకట్టును ఎంచుకోవడంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది కంగన. ఇందుకు నిదర్శనమే ఈ వీణాపాణి చీర. పేరుకు తగినట్లుగానే చదువుల తల్లి సరస్వతీ దేవి రూపానికి ప్రతీకగా నిలుస్తుందీ నేత చీర. ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న ఈ శారీపై హంసలు, తామర పువ్వుల మోటిఫ్స్‌ని నిర్ణీత దూరాల్లో తీర్చిదిద్దారు. ఇక బోర్డర్‌ని హంసల వరుసతో డిజైన్‌ చేశారు. ఇలా ఈ చీరపైకి పసుపు రంగు హైనెక్‌ బ్లౌజ్‌ను జతచేసిన కంగన.. హెవీ జుంకాలు, పోనీ హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌ని పూర్తిచేసింది.

వీణాపాణి చేనేత చీరల్ని హ్యాండ్‌స్పన్‌ టస్సర్‌ సిల్క్‌, సహజ పట్టుతో రూపొందిస్తారు. సరస్వతీ దేవి రూపానికి ప్రతీకగా నిలిచే ఈ చీరలపై వీణ, హంస, పుస్తకం, తామర పూల మోటిఫ్స్‌తో హంగులద్దుతారు. వీటిలోనూ తెలుపు, పసుపు, ఎరుపు, లేత గులాబీ, పేస్టల్‌ షేడ్స్‌లో తయారైన చీరల్ని ఎక్కువగా మార్కెట్లోకి తీసుకొస్తారు డిజైనర్లు. ప్రత్యేక ప్రాంతమనేది లేకుండా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన నేత కళాకారులు ఈ వీణాపాణి చీరల్ని ఎక్కువగా రూపొందిస్తారట.


► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :