పది నిమిషాలు వెనక్కి నడిస్తే మంచిదట!
సాధారణంగా చాలామంది ఫిట్‌నెస్ రొటీన్‌లో నడక తప్పనిసరిగా ఉంటుంది. అయితే వాకింగ్ అనగానే ముందుకు నడవడం పైనే దృష్టి పెడతారంతా. కానీ వెనక్కి నడవడం వల్ల మరిన్ని అదనపు ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు.

- A
- A+
- A++

సాధారణంగా చాలామంది ఫిట్‌నెస్ రొటీన్‌లో నడక తప్పనిసరిగా ఉంటుంది. అయితే వాకింగ్ అనగానే ముందుకు నడవడం పైనే దృష్టి పెడతారంతా. కానీ వెనక్కి నడవడం వల్ల మరిన్ని అదనపు ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. ‘రెట్రో వాకింగ్’గా పిలిచే ఈ పద్ధతిని రోజూ పది నిమిషాల పాటు పాటిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. మరి, ఇంతకీ వెనక్కి నడవడం ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు ఎందుకు మంచిదో తెలుసుకుందాం రండి..
⚛ ముందుకు నడవడం కంటే వెనక్కి నడవడం వల్ల కాళ్లు, కోర్ కండరాలు (వెన్నెముక, పొత్తికడుపు, నడుము, తుంటి భాగాలను కలుపుతూ శరీరానికి కేంద్రంగా ఉండే కండర సమూహం) ఉత్తేజితమవుతాయి. ఫలితంగా శరీరాన్ని బ్యాలన్స్ చేసుకునే శక్తి పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ సమన్వయం అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నుంచే రెట్రో వాకింగ్‌ని సాధన చేయడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
⚛ వెనక్కి అడుగులు వేసే క్రమంలో పడిపోకుండా నడవడానికి ప్రయత్నిస్తాం. మరింత ఏకాగ్రత పెడతాం. ఈ ప్రక్రియ మెదడు పనితీరును మెరుగుపరుస్తుందంటున్నారు నిపుణులు. రోజూ ఈ నడక సాధన చేయడం వల్ల ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని ఓ అధ్యయనం చెబుతోంది.
⚛ బరువు తగ్గాలనుకునే వారూ నడకను తమ ఫిట్‌నెస్ రొటీన్‌లో చేర్చుకుంటుంటారు. అయితే వెనక్కి నడవడం వల్ల 40 శాతం అధికంగా క్యాలరీలు ఖర్చై మరింత తక్కువ సమయంలోనే బరువు తగ్గి ఫిట్‌గా మారచ్చని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి త్వరగా నాజూగ్గా మారాలనుకునే వారికి ఈ నడక మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
⚛ కొంతమంది తొడలు, పిరుదులు లావుగా ఉన్నాయని ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు రోజూ రెట్రో వాకింగ్‌ను సాధన చేయడం వల్ల ఆయా శరీర భాగాల్లోని అదనపు కొవ్వులు కరిగి.. అక్కడి కండరాలు దృఢంగా మారి, తీరైన ఆకృతిలోకి వస్తాయి. ఫలితంగా నడుం కింది భాగం దృఢమవడంతో పాటు.. నాజూగ్గా తయారవుతుంది.
⚛ ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. వంటి సమస్యల్ని దూరం చేయడంలోనూ ఈ నడక పద్ధతి మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. తద్వారా మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
ఈ జాగ్రత్తలు..
అయితే ముందుకు నడవడంతో పోల్చితే వెనక్కి నడవడం వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఆ సమస్య లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.
⚛ మొదట కొన్ని రోజులు ఈ నడకను నిదానంగా సాధన చేయాలి. ఇందుకోసం గోడలు, కుర్చీ, టేబుల్.. వంటి వస్తువుల సహాయం తీసుకోవాలి.
⚛ కాస్త విశాలంగా ఉన్న ప్రదేశంలో ఈ నడకను సాధన చేయడం, నునుపైన ఉపరితలాలు, పదునైన వస్తువులు లేకుండా జాగ్రత్తపడడమూ ముఖ్యమే.
⚛ వేగంగా కాకుండా నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయాలి. దీనివల్ల మన కాళ్లు మనకే తగిలి పడిపోకుండా జాగ్రత్తపడచ్చు.
⚛ ట్రెడ్‌మిల్ పైనా ఈ నడకను సాధన చేయచ్చంటున్నారు నిపుణులు. అయితే తక్కువ వేగాన్ని సెట్ చేసుకొని, హ్యాండ్‌రెయిల్స్ పట్టుకొని ప్రాక్టీస్ చేయడం ఉత్తమం అని చెబుతున్నారు.
అయితే ఈ నడక మంచిదే అయినా.. గర్భిణులు, వృద్ధులు, మోకాళ్లు-కీళ్ల నొప్పులున్న వారు ముందుగా డాక్టర్ సలహా తీసుకున్నాకే సాధన చేయడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా శరీరంపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.