కుటుంబం అండగా... ఆత్మవిశ్వాసం మెండుగా!

Eenadu icon
By Editorial Team Published : 25 Feb 2026 02:01 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

చదువు, విజ్ఞానం, మార్కులు, ర్యాంకులు, ఆర్థిక, సాంఘిక స్థోమత ఉన్నా- ఆత్మస్థైర్యం లేక, సమస్యలను ఎదుర్కోలేక సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే వైఫల్యం తప్పదు. యువత జీవితంలో ముందడుగు వేయడానికి, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి, కష్టనష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి... జీవన నైపుణ్యాలే ఆధారం. వీటిని సహజ రీతిలో కుటుంబం, సమాజం అందించడమే మేలు.

ప్రస్తుత కాలంలో సున్నితంగా పెరుగుతున్న పిల్లల్లో పరిపక్వత కొరవడుతోంది. చిన్నపాటి సమస్యను కూడా భరించలేకపోతున్నారు. పరీక్షల్లో తప్పినా, ఒక్కమార్కు తగ్గినా, మిత్రులు మాట్లాడకపోయినా, తల్లిదండ్రులతో విభేదించినా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏదో కోల్పోయామనే భావనతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఉద్వేగభరిత సందర్భాల్లో అవలంబించాల్సిన వ్యూహాలు, నైపుణ్యాలు తెలియక చిక్కులపాలవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యువత ఎదుగుదలలో ప్రత్యేకంగా పది జీవన నైపుణ్యాలు ముఖ్యమని పేర్కొంది. స్వీయజాగృతి అంటే తన సామర్థ్య పరిమితులు ఇష్టాయిష్టాలు ఆకాంక్షలను గుర్తించే నైపుణ్యం అందులో మొదటిది. సహానుభూతి, సమస్యా పరిష్కారం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, భావ వ్యక్తీకరణ, విమర్శనాత్మక ఆలోచనాశైలి, సృజనాత్మకత, వ్యక్తిగత సంబంధాల నిర్వహణ, భావోద్వేగాల నియంత్రణ, ఒత్తిడిని తట్టుకునే శక్తి వంటి జీవన నైపుణ్యాలను పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవడేలా చూడాలి. పాఠశాలలు, తల్లిదండ్రులు, సమాజం దీన్నొక బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే ప్రస్తుత పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు సఫలీకృతమవుతారు. కనీసం పన్నెండో ఏట నుంచే పిల్లలకు జీవన నైపుణ్యాలను అలవరిచేలా తల్లిదండ్రులు, పాఠశాలలు కృషి సాగించాలి.

పెంపకంలో భాగం కావాలి!

పిల్లలకు వయసును బట్టి తరగతుల వారీగా కరికులం ఉన్నట్లుగానే, వయసువారీగా జీవన నైపుణ్య సాధనను పెంపకంలో భాగంగా చేర్చాలి. కౌమారంలో ప్రవేశించే పిల్లలు చదువులతోపాటు కుటుంబం, సమాజం నుంచి సహజసిద్ధంగా అలవరచుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గడపడం, కుటుంబ కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావడం, ఉమ్మడి కుటుంబాల నేపథ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించడం, సామాజిక కార్యక్రమాలకు హాజరుకావడం వంటివి యువతకు తప్పనిసరి. పాఠశాలల్లో చదువులు, మార్కులే కాదు, మెరుగైన జీవితానికి అవసరమైన మెలకువలను కూడా అందించాలి. ప్రస్తుతం బడుల్లో నైతిక విలువలపై అవగాహన కల్పించడం, జీవన నైపుణ్యాలపై సలహాలు ఇవ్వడం వంటివి కొరవడ్డాయి. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబమే నిలువెత్తు పరిశోధన విశ్వవిద్యాలయంగా ప్రతి సమస్యకూ ప్రత్యక్షానుభవాల ప్రయోగశాలగా ఉండేది. జీవితాన్ని తీర్చిదిద్దుకునే నైపుణ్యాలను పాఠ్యాంశాలుగా చదవకున్నా, మానసిక పరిణతితో పటిష్ఠ పునాది పడేది. ప్రస్తుత కాలంలో చిన్నారులు అనునిత్యం మొబైల్, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లో గడపడంతోనే సరిపోతోంది. ప్రత్యక్షంగా మిత్రులు, బంధువులు, ఇరుగుపొరుగుతో సంభాషించే అవకాశమే లేకుండా పోయింది. అంతర్జాల అనుసంధానిత అనుబంధాలే అధికమయ్యాయి. ఇవి యువతను లోలోపలే కబళించి వేస్తున్నాయి. కంటి జబ్బులు, మానసిక ఒత్తిడి, సామాజిక రుగ్మతలు వంటివి ముప్పుగా పరిణమిస్తున్నాయి.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎదుగుతున్న పిల్లలకు ముఖ్యంగా కౌమార దశలో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు శారీరక, మానసిక, సామాజిక మార్పులపట్ల అవగాహన కల్పించాలి. ప్రతి విషయాన్నీ స్నేహపూర్వకంగా చర్చించాలి. అనుమానాలను నివృత్తి చేయాలి. భయాందోళనలను పారదోలాలి. స్వీయ సామర్థ్యాలను గుర్తించగలిగేలా ప్రేరణ ఇవ్వాలి. ఆలోచనలు, అభిప్రాయాలను సంకోచం లేకుండా వ్యక్తీకరించేలా వెన్నుతట్టాలి. విమర్శనాత్మక విశ్లేషణ, సృజనాత్మక ఆలోచన, వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరచుకునే నైపుణ్యాల్ని పెంపొందించాలి. ఒత్తిడిని, భావోద్రేకాలను సంయమనంతో ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలి. తోటివారితో ప్రేమగా వ్యవహరించడం, శత్రుత్వ భావనలూ ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడి విశ్లేషణాత్మక నిర్ణయాలు తీసుకునేలా పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదే.

మరెక్కడా నేర్పని విషయాలివి!

కుటుంబ భారాన్ని, సామాజిక బాధ్యతలను, ఆర్థిక అంశాలను తాము ఎలా సమన్వయం చేస్తున్నామనే విషయంపై పిల్లలకు అమ్మనాన్నలు లోతైన అవగాహన కల్పించాలి. కుటుంబాన్ని చక్కదిద్దడం, బంధువులూ స్నేహితులతో మాట్లాడటం, వారితో వ్యవహరించే తీరుతెన్నులు, సాటివారిని ఆప్యాయంగా పలకరించే విధానం వంటి ఎన్నో విషయాలు ఏ బడిలోనూ, వర్సిటీలోనూ బోధించలేరు. అందుకని, కుటుంబమే ఒక కళాశాల. జీవన నైపుణ్య శిక్షణలో కుటుంబం, సమాజం క్షేత్రస్థాయి అనుభవాన్ని అందించే వేదికలు. కుటుంబం కోసం ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించాలి. ఆ కొద్ది సమయమే పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. విలువలతో కూడిన జీవన నైపుణ్యాలే జీవితాలకు సుస్థిర పునాదులవుతాయి. ఇళ్లలో తల్లిదండ్రులు రోజుకొక్కసారైనా గంటసేపు టీవీ, మొబైల్‌ పక్కనపెట్టి పిల్లలతో గడపడం, చర్చించడం, బంధువులూ స్నేహితులతో వారు కలిసిమెలిసి ఉండేలా చూడటం ముఖ్యం. తద్వారా యువత జీవన నైపుణ్యాలు అలవరచుకోవడంలో కొత్త ఒరవడికి నాంది పలకాలి.

పారిశ్రామిక రంగ ప్రగతి దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల సృష్టికి అక్కరకొస్తుంది. అత్యవసర వస్తువులూ సరకుల ఉత్పత్తి ద్వారా జనజీవన ప్రమాణాల మెరుగుకు సహకరిస్తుంది. మన దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఎక్కువగా భారీ పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. దేశీయంగా సంఘటిత తయారీ రంగంలో మొత్తం కొలువుల్లో 60శాతం ఎనిమిది రకాలైన పరిశ్రమల నుంచే లభిస్తున్నాయి. ఆ పరిశ్రమలు, ఉపాధి కల్పనలో వాటి వాటా (శాతాల్లో)...

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.