చైనా గెలుపు మంత్రమేంటి?

Eenadu icon
By Editorial Team Updated : 25 Feb 2026 06:14 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా విజయ రహస్యం ఏంటి? వాణిజ్య రంగంలో దూసుకెళ్లడానికి అనుసరించే గెలుపు సూత్రమేంటి? చైనా కంపెనీలు స్టార్టప్‌ల స్థాయి నుంచి టెక్‌ దిగ్గజాలుగా శరవేగంగా ఎలా ఎదుగుతున్నాయి? ఈ విశేషాలను తెలుసుకోవడం ఆసక్తికరమే కాదు, అవసరం కూడా!

షాంఘైలోని చైనా యూరప్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్కూల్‌(సీఈఐబీఎస్‌)కు ఆసియాలో అత్యుత్తమ వాణిజ్య విద్యాసంస్థగా పేరుంది. అందులో నా పూర్వ సహోద్యోగి ఆచార్య లియాంగ్‌ నెంగ్, అమెరికాలోని వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన హర్బీర్‌ సింగ్, పీటర్‌ కాపెలి, మైఖేల్‌ యూసీమ్‌లతో కలిసి ‘ద ఫార్చ్యూన్‌ మేకర్స్‌’ పుస్తకాన్ని వెలువరించారు. ఆసియా వ్యాపారాలపై ఉన్న సాధారణ అభిప్రాయాలను పటాపంచలు చేసే భిన్నమైన విశ్లేషణను ఆ గ్రంథంలో అందించారు. చైనా పారిశ్రామిక వ్యవస్థాపకుల విజయాలకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అందిస్తున్న అండదండలే కారణమనుకోవడం సరికాదని స్పష్టంచేశారు. అటువంటి అండ లేకపోయినా వారు రాణిస్తున్నారని తేల్చారు. వ్యాపార స్థాపన, అభివృద్ధికి అన్ని వేళలా వ్యవస్థాగతమైన మద్దతు లభించకపోవచ్చు. మార్కెట్‌లో పోటీ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నా స్వశక్తితో తట్టుకుని నిలబడి వ్యాపారాన్ని విజయవంతం చేసుకోవాల్సి ఉంటుంది. తమకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు దూసుకెళ్లాల్సిందే. వ్యాపార పరంగా వివిధ పక్షాలతో సంబంధాలను వృద్ధి చేసుకుంటూ పురోగమించాల్సిన అవసరం ఉంటుంది.

నిరంతర తపన

అంతా బాగుంటే సమస్యలూ ఉండవు, వాటిని అధిగమించడానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరమూ ఉండదు. వనరుల సమృద్ధికంటే కొరతలు, ప్రతిబంధకాలే నవీకరణను సాధించాలనే తపనను పుట్టిస్తాయి. చైనీయులు పాశ్చాత్య వ్యాపార నమూనాలపై పూర్తిగా ఆధారపడకుండా స్థానిక పరిస్థితులకు తగినట్లుగా మార్పుచేర్పులు చేసుకున్న నమూనాలనే అనుసరిస్తారు. ఈ క్రమంలోనే కొత్తదనాన్ని అన్వేషించి, ఆవిష్కరిస్తారు. మార్కెట్‌ గురించి పూర్తి సమాచారం కోసం ఎదురు చూడకుండా, తక్షణం రంగంలోకి దిగి తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త ఆలోచనలతో, సరికొత్త పద్ధతులతో ముందుకు సాగుతారు. నవీకరణ కొరత నుంచి పుడుతుందే తప్ప సమృద్ధి నుంచి పుట్టదని నిరూపిస్తారు. బీవైడీ తదితర సంస్థలు ఈ పంథాలోనే ముందుకుసాగి ప్రపంచ దిగ్గజాలుగా వెలుగుతున్నాయి. పోటీ తీవ్రంగా ఉండి, పరిస్థితులు మారిపోయే అస్థిర మార్కెట్‌లో మనుగడ సాగించాలంటే, వైఫల్యం ఎదురయ్యే లోపే సరైన పాఠాలు నేర్చుకుంటూ, విజయం వైపు దూసుకెళ్లాలి. ఈ నేర్పు శిక్షణ ద్వారా మాత్రమే సిద్ధించదు. ఎదుటివారి అత్యుత్తమ నిర్వహణ పద్ధతులను గమనిస్తూ, నిరంతర అభ్యాసంపై మక్కువతో పురోగమించడం ద్వారా మాత్రమే ఒంటబడుతుంది. అనుభవాన్ని, దాని నుంచి నేర్చుకున్న పాఠాలను సంస్థలో అంతర్గత జ్ఞానంగా మార్చి, సిబ్బందితో పంచుకోవడం ద్వారానే అలీబాబా వంటి కంపెనీలు ప్రపంచంలో మేటిగా ఎదిగాయి. ఎప్పటికప్పుడు మారిపోయే అస్థిర మార్కెట్లలో భవిష్యత్తును అంచనా వేయడంకన్నా వేగంగా స్పందించగల, పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యానికే విజయం లభిస్తుంది. వ్యవస్థాపకులు వేగంగా తీసుకునే నిర్ణయాలు, వనరులను అవసరమైన చోటికి తక్షణం మళ్లించే విధానాలే వ్యాపార విజయానికి కీలకాలు. షావొమీ తన కొత్త మోడళ్లను నెలల వ్యవధిలోనే విడుదల చేస్తుంటుంది. విజయవంతమైన మోడళ్లనూ అదే పనిగా కొనసాగించదు. వ్యాపార వ్యూహమనేది సజీవ నిరంతర ప్రవాహమనే సూత్రమే షావొమీ విజయానికి మూలం.

చైనా కంపెనీలు అనునిత్యం అభివృద్ధినే జపిస్తాయి, పరితపిస్తాయి. నిరంతర ప్రగతి లేనిదే మనుగడే లేదన్నట్లుగా వ్యవహరిస్తాయి. వ్యాపారంలో ఎంత ఎత్తుకు ఎదిగితే అంతగా పోటీ నుంచి రక్షణ లభిస్తుందని, ప్రభుత్వ విధానాల్లో మార్పులను తట్టుకునే సత్తా లభిస్తుందని భావిస్తాయి. అందుకే వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి, కొత్త మార్కెట్లలోకి విస్తరించడానికి అహోరాత్రులు శ్రమిస్తాయి. అంతర్జాతీయీకరణను రక్షాకవచంగా భావిస్తూ ఎదుగుతాయి. బయటి ప్రపంచంలో పోటీ, సర్కారీ విధానాల్లో మార్పులు, అనూహ్య పరిస్థితులు సర్వసాధారణం. ఇలాంటి అస్థిరతను ఏ కంపెనీ అయినా బలమైన అంతర్గత సంస్కృతితోనే అధిగమించగలదు. లోతైన క్రమశిక్షణ కంపెనీ సంస్కృతిలో విడదీయరాని భాగం కావాలి. నిర్వహణా పద్ధతుల్లో లోపాలున్నా క్రమశిక్షణతో వాటిని అధిగమించి ముందుకు సాగవచ్చు. వ్యాపారమంటే అమ్మడం, కొనడంతో ముగిసిపోయే లావాదేవీల సంస్కృతి కాదని, అంతకు మించినదని గ్రహించాలి. అగ్రశ్రేణి చైనా కంపెనీలు ఈ గ్రహింపుతోనే దినదినాభివృద్ధి చెందుతున్నాయి.

వేగంగా కార్యనిర్వహణ

చైనాలో రాజకీయాల మాదిరిగానే వ్యాపారాలూ అగ్ర నాయకుడు(బిగ్‌బాస్‌), అంటే వ్యవస్థాపకుడి ఆధ్వర్యంలో నడుస్తాయి. నాయకుడంటే కేవలం అలంకారప్రాయంగా పదవిలో ఉండే వ్యక్తి కాదు. ప్రతి సాహసోపేతమైన నిర్ణయానికీ వ్యవస్థాపకుడే బాధ్యుడు. ఆ నిర్ణయాన్ని చురుగ్గా ఆచరణలో పెట్టే క్రియాశీల రూపశిల్పి కూడా. పాశ్చాత్య దేశాలకు ఇది నిరంకుశ కార్యశైలిగా కనిపించవచ్చు. కానీ, బిగ్‌బాస్‌ వ్యవస్థ అద్భుతమైన వేగంతో కార్యనిర్వహణ సాధిస్తుంది. వనరుల సమీకరణకు సమర్థ మార్గదర్శిగా పనిచేస్తుంది. అలాగని నాయకుడే అన్నీ చేయాలని కాదు, వ్యాపారాన్ని విస్తరించడానికి వృత్తిపరమైన నైపుణ్యాన్ని ఎప్పుడు, ఎలా నియోగించాలో కూడా ఉత్తమ నాయకులకు బాగా తెలుసు.

చివరగా, చైనాలో బుద్ధిగా నిబంధనలు పాటించినంత మాత్రాన వ్యాపారంలో విజయం దక్కదు. దాంతోపాటు బ్యాంకులు, స్థానిక అధికారులు, సరఫరాదారులతో ఉన్న సంబంధాలు, భాగస్వామ్యాల నెట్‌వర్కే కీలకం. దీని సాయంతో ఎంతటి క్లిష్ట పరిస్థితుల నుంచయినా గట్టెక్కగలుగుతారు. ‘ద ఫార్చ్యూన్‌ మేకర్స్‌’లో వివరించిన విజయ సూత్రాలు కేవలం చైనాకే వర్తించే లక్షణాలు కావు. ప్రపంచంలో ఎక్కడైనాసరే వ్యాపార నిర్వహణలో అనిశ్చితిని, అస్థిరతను ఎదుర్కొనే ఏ నాయకుడికైనా మార్గదర్శిలా పనికొస్తాయి. కేవలం అధిక వనరులు లేదా పరిపూర్ణమైన సంస్థలు ఉన్నంత మాత్రాన విజయం లభించదు. మన చుట్టూ ఉన్నవారికన్నా వేగంగా మార్పుచేర్పులకు స్పందించే మనస్తత్వాన్ని అలవర్చుకోవడమే విజయానికి దగ్గరి దారి!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 02:05 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.