Bill Gates admits affairs with Russian women apologises for Epstein ties

గేట్స్‌ ఫౌండేషన్‌ సిబ్బందికి బిల్‌గేట్స్‌ విజ్ఞప్తి  

ఎప్‌స్టీన్‌ను కలవడం నేను చేసిన పెద్ద తప్పు  

అతడి నేరాల్లో ఏనాడూ పాలుపంచుకోలేదు  

ఎప్‌స్టీన్‌ మహిళలతో నాకు ఎలాంటి సంబంధాల్లేవు  

ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలున్న మాట నిజమే  

న్యూయార్క్‌:సెక్స్‌ కుంభకోణం సూత్రధారి, అమెరికా ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు సంబంధాలున్న మాట నిజమేనని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఎట్టకేలకు అంగీకరించారు. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించినట్లు వెల్లడించారు. అయితే, చట్టవిరుద్ధమైన పనులేవీ చేయలేదని పేర్కొన్నారు. ఎప్‌స్టీన్‌ నేరాల్లో తాను పాలుపంచుకోలేదని స్పష్టంచేశారు. అయినప్పటికీ తన వల్ల ‘గేట్స్‌ ఫౌండేషన్‌’కు చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. 

ఎప్‌స్టీన్‌ను కలవడం తప్పేనని, తనను పెద్ద మనసుతో క్షమించాలని ఫౌండేషన్‌ సిబ్బందికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఫౌండేషన్‌ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఒక నివేదికను తాజాగా బహిర్గతం చేసింది. తనపై వచ్చిన ఆరోపణలపై మంగళవారం జరిగిన టౌన్‌హాల్‌ సమావేశంలో బిల్‌ గేట్స్‌ వివరణ ఇచ్చారని పేర్కొంది.  ‘‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫొటోల్లో మహిళలతో నేను ఉన్నట్లు చూపించారు. 

ఆ ఫొటోల్లో మహిళల ముఖాలను తారుమారు చేశారు. నిజానికి ఎప్‌స్టీన్‌ సహాయకులతో ఫొటో దిగాను. ఎప్‌స్టీన్‌ వినతి వల్లే దిగాల్సి వచ్చింది. అతడి చుట్టూ ఉన్న మహిళలతో ఏనాడూ నేను కాలం గడపలేదు. ఎప్‌స్టీన్‌ బారిన పడిన బాధిత మహిళలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్‌స్టీన్‌ను కలవడం ద్వారా పెద్ద తప్పు చేశా. అతడితో సమావేశాలకు గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులను కూడా తీసుకెళ్లడం ఇంకా పెద్ద తప్పు.

 మైనర్లతో వ్యభిచారం కేసులో ఎప్‌స్టీన్‌ 2008లో దోషిగా తేలాడు. మూడేళ్ల తర్వాత.. 2011లో అతడిని కలిశా. అతడి నేపథ్యం గురించి సరిగ్గా తనిఖీ చేసుకోలేదు. ఎప్‌స్టీన్‌తో సంబంధాల గురించి 2013లో నా భార్య మెలిండా ఆందోళన వ్యక్తంచేసింది. అయినప్పటికీ 2014 దాకా అతడిని పలుమార్లు కలిశా. ఎప్‌స్టీన్‌తో కలిసి ప్రైవేట్‌ జెట్‌ విమానాల్లో ప్రయాణించా. జర్మనీ, ఫ్రాన్స్, న్యూయార్క్, వాషింగ్టన్‌లో అతడితో సమావేశమయ్యా. కానీ, ఎప్‌స్టీన్‌ ఐలాండ్‌లో ఏనాడూ ఒక్కరాత్రి కూడా గడపలేదు. నా వల్ల గేట్స్‌ ఫౌండేషన్‌కు మచ్చ రావడం బాధగా ఉంది. 

నా వ్యవహార శైలి, ప్రవర్తన ఫౌండేషన్‌ విలువలకు, లక్ష్యాలకు విరుద్ధంగానే ఉన్నాయి. చివరిసారిగా 2014లో ఎప్‌స్టీన్‌ను కలిశా. ఎప్‌స్టీన్‌ విషయంలో నా భార్య మెలిండాకు మొదటినుంచీ అనుమానాలున్నాయి. ఎప్‌స్టీన్‌తో సంబంధాల వల్ల నా పేరు ప్రతిష్టలు మంట గలుస్తున్నాయని చివరికి గ్రహించా. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించిన సంగతి నిజమే. వారిలో ఒకరు బ్రిడ్జ్‌ ప్లేయర్‌. బ్రిడ్స్‌ ఈవెంట్లలో ఆమె నన్ను కలిశారు. మరొకరు న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌. బిజినెస్‌ కార్యక్రమాల్లో భాగంగా మేము కలుసుకున్నాం’’అని బిల్‌ గేట్స్‌ వ్యాఖ్యానించిట్లు వార్తా సంస్థ స్పష్టంచేసింది. 

లక్షలాది పత్రాలు విడుదల  
ఎప్‌స్టీప్‌ ఫైళ్లను అమెరికా న్యాయ శాఖ గత నెలలో బయటపెట్టిన సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, టెక్నాలజీ రంగ దిగ్గజాలు ఎప్‌స్టీన్‌తో సన్నిహితంగా మెలిగారని తెలియజేసింది. ఎప్‌స్టీన్‌తో బిల్‌ గేట్స్‌కు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈ దస్త్రాల్లో తేలడంతో సంచలనాత్మకంగా మారింది. 
 

ఇదీ చదవండి:భారత్‌కు అమెరికా కొత్త ‘షాక్‌’.. 126% టారిఫ్‌!