గేమింగ్ సామ్రాజ్యంలో ‘ఆశా’ కిరణం!
సాంకేతిక రంగంలో మహిళల సంఖ్య పెరగడమే కాదు... ఉన్నత స్థానాల్లోనూ నిలబడి తమ సత్తా చాటుతున్నారు. తాజాగా గేమింగ్ రంగాన్నే శాసించే మైక్రోసాఫ్ట్ గేమింగ్ (ఎక్స్‌బాక్స్) విభాగానికి కొత్త సీఈఓగా భారత సంతతి మహిళ ఆశా శర్మ నియమితులయ్యారు.

- A
- A+
- A++

సాంకేతిక రంగంలో మహిళల సంఖ్య పెరగడమే కాదు... ఉన్నత స్థానాల్లోనూ నిలబడి తమ సత్తా చాటుతున్నారు. తాజాగా గేమింగ్ రంగాన్నే శాసించే మైక్రోసాఫ్ట్ గేమింగ్ (ఎక్స్‌బాక్స్) విభాగానికి కొత్త సీఈఓగా భారత సంతతి మహిళఆశా శర్మనియమితులయ్యారు. నాలుగు దశాబ్దాల పాటు మైక్రోసాఫ్ట్‌లో సేవలందించి రిటైర్ అవుతున్న దిగ్గజ నేత ఫిలిప్ స్పెన్సర్ స్థానంలో ఆమె ఈ బాధ్యతలు చేపట్టడం... ఇప్పుడు ఓ సంచలనం.
భారతీయ కుటుంబంలో, విలువలతో కూడిన వాతావరణంలో పెరిగారు ఆశ. చిన్నప్పటి నుంచీ చురుకైన అమ్మాయి. ‘కష్టపడటం ఒక్కటే సరిపోదు, ఆ కష్టానికి స్పష్టమైన లక్ష్యమూ ఉండాలి’ అని తల్లిదండ్రులు చెప్పిన మాటే మంత్రంగా ఆమె తన భవిష్యత్తు నిర్మించుకోవడం ఆరంభించారు. ఆశ బిజినెస్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. 17 ఏళ్ల వయసులోనే ఎస్‌సీ జాన్సన్ అండ్ సన్‌లో మార్కెటింగ్ విభాగంలో పనిచేయడం ఆరంభించారు. ఈ అనుభవం ఆమె కెరియర్‌కు బలమైన పునాది వేసింది. ముఖ్యంగా కార్‌గిల్, డెలాయిట్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం తెచ్చి పెట్టింది. చదువయ్యాక ఆశ ఒక ఎన్జీవోను స్థాపించారు. మిలియన్ డాలర్లకంటే ఎక్కువగానే నిధులను సేవాకార్యక్రమాల కోసం సేకరించారట.
2011లో మైక్రోసాఫ్ట్‌లో చేరారామె. అయితే కొన్నాళ్లకే అంటే 2013లోనే ఆ సంస్థను వీడారు. ఆ తర్వాత పలు అంతర్జాతీయ టెక్ కంపెనీలలో పనిచేశారు. రెండేళ్ల క్రితం తిరిగి మైక్రోసాఫ్ట్‌లోని కోర్ ఏఐ విభాగంలో సీనియర్ అధికారి హోదాలో చేరారు. ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణం, పార్ట్‌నర్‌షిప్‌లు, డిజిటల్ ఎకోసిస్టమ్స్‌లో ఆమెకు ఉన్న అపారమైన అనుభవం ఇప్పుడు ఆమెను గేమింగ్ విభాగానికి నాయకత్వం వహించేలా చేసింది.
దిగ్గజ సంస్థల్లో ముద్ర...
ఆశా శర్మ పేరు టెక్ లోకంలో మారుమోగడానికి కారణం ఆమె ఫేస్‌బుక్ మెటా, ఇన్‌స్టాకార్ట్ వంటి సంస్థల్లో పోషించిన కీలక పాత్రే. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో మెసెంజర్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఆమె... కోట్లాది మంది ప్రజలకు చేరువయ్యారు. ఇన్‌స్టాకార్ట్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా క్లిష్ట సమయాల్లో కంపెనీని లాభాల బాట పట్టించడంలో ఆమె చేసిన వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి.

సవాళ్లున్నాయి...
గత రెండు సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తూ సంస్థ అంతర్గత వ్యవస్థలు, గేమింగ్ వ్యాపార నిర్మాణం, స్టూడియోల సృజనాత్మక శక్తి... వంటి విషయాలన్నీ లోతుగా అర్థం చేసుకున్నారు. అయితే, మైక్రోసాఫ్ట్ గేమింగ్ ఆదాయ వృద్ధి మందగించడం, గేమింగ్ కంటెంట్ కోసం ప్రపంచ మార్కెట్‌లో ఉన్న తీవ్రమైన పోటీని ఎదుర్కోవడం వంటివి ఆమె ముందున్న సవాళ్లు. ఏఐ సాంకేతికత కంటే, మనుషుల సృజనాత్మకతతో కూడిన ఆటలకే తన ప్రాధాన్యం అంటారామె.
వ్యక్తిగత జీవితం - కుటుంబం
ఆశ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. వందల కోట్ల డాలర్ల సామ్రాజ్యాన్ని శాసిస్తున్నా ఆమె కుటుంబానికీ ప్రాధాన్యం ఇస్తారు. తన విజయానికి కుటుంబం అందించిన నైతిక మద్దతే పునాది అని తరచుగా చెబుతుంటారామె. పాత పద్ధతులను ప్రశ్నించి, కొత్త దారిని వెతకడం. ఎంత ఎదిగినా తన మూలాలను, తన టీమ్ కష్టాన్ని మర్చిపోకపోవడం, టెక్నాలజీ మారుతున్నా, మానవీయ విలువలు తగ్గకూడదని నమ్మడం ఆమె బలాలు.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :