T20 WC 2026 IND vs NED: Predicted XI Bumrah not needed Washi In

టీ20 ప్రపంచకప్‌-2026టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీద ఉంది. గ్రూప్‌-ఎ నుంచి అమెరికా, నమీబియా వంటి పసికూనలపై గెలుపొందిన భారత్‌.. చివరగా దాయాది పాకిస్తాన్‌ను మట్టికరిపించిది.

‘చిరకాల ప్రత్యర్థి’ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి.. లీగ్‌ దశలో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సూపర్‌-8కు అర్హత సాధించింది. ఇక గ్రూప్‌-ఎలో భాగంగా నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా బుధవారం రాత్రి (ఫిబ్రవరి 18) మరో పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.

అభిషేక్‌ శర్మ డకౌట్‌ అయినా..
కాగా ఇప్పటికే సూపర్‌-8కు చేరిన తరుణంలో నెదర్లాండ్స్‌తో ఆడే తుదిజట్టులో భారత్‌ మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ (0,0) రెండు మ్యాచ్‌లు ఆడి డకౌట్‌ అయినా.. అతడిని కొనసాగించడం ఖాయమే. దీంతో మరోసారి సంజూ శాంసన్‌కు మొండిచేయి తప్పదు.

ఇక ఇప్పటికే ఓపెనర్‌గా ఇరగదీస్తూ.. పాక్‌పై భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌ కిషన్‌ స్థానానికి ఢోకా లేదు. సూర్యకుమార్‌ కెప్టెన్సీలోని ఈ జట్టులో తిలక్‌ వర్మ, శివం దూబే, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి కొనసాగటం లాంఛనమే.

బుమ్రాకు రెస్ట్‌.. అతడిపై వేటు
అయితే, పాక్‌తో మ్యాచ్‌ ఆడిన ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అతడి స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ రావడం పక్కా. అదే విధంగా.. కుల్దీప్‌ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ను తుదిజట్టులో ఆడించే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు సమాచారం.

కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు గాయపడిన వాషీ.. నమీబియాతో మ్యాచ్‌ నుంచి అందుబాటులోకి వచ్చాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినప్పటికీ అతడి విషయంలో మేనేజ్‌మెంట్‌ రిస్క్‌ తీసుకోలేదు. అయితే, నెదర్లాండ్స్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో ఆడించి తదుపరి మ్యాచ్‌లకు అతడిని సన్నద్ధం చేయనున్నట్లు సమాచారం.

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)
ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

చదవండి: T20 WC: ఆస్ట్రేలియా అవుట్‌.. సూపర్‌-8కు జింబాబ్వే