DJ Tillu movie title: త్రివిక్రమ్ సూచన.. ‘డీజే టిల్లు’గా మారిన మూవీ టైటిల్..

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: చాలా సినిమాలకు కథానాయకుడి పాత్ర పేరు, అతడి ఔచిత్యాన్ని బట్టి సినిమా టైటిల్స్ పెడుతుంటారు. కథకు సరిపోయే టైటిల్స్ తక్కువగా వస్తుంటాయి. అలా అనుకుని మారిపోయిన టైటిలే ‘డీజే టిల్లు’ (DJ Tillu). సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కథానాయకుడిగా విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్’ కూడా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. అయితే, ‘డీజే టిల్లు’కు మొదట ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్ పెట్టాలనుకున్నారట. ఆ టైటిల్ ఎందుకు మారిపోయిందనే ఆసక్తికర విషయాన్ని గతంలో సిద్ధు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
‘‘డీజే టిల్లు’ మూవీకి అసలు టైటిల్ అది కాదు. కథ రాసుకున్నప్పుడు ‘నరుడు బ్రతుకు నటన’ అని అనుకున్నాం. అప్పటికే ఆ పేరును ఎవరో రిజిస్టర్ చేయించి ఉంచారు. దీంతో వాళ్లకు డబ్బులు కట్టేసి టైటిల్ తీసుకున్నాం. నిజ జీవితంలోనూ మనిషి చేస్తున్నది నటనే కదా! ఎందుకో మేము అనుకున్న కథకు ఇది అర్థవంతమైన పేరు అనిపించింది. ఆ తర్వాత కథను మరింత డెవలప్ చేసుకుంటూ వెళ్లాం. నేను సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, డైలాగ్‌లు నా ఫ్రెండ్స్‌కు చెబుతుంటే, అందరూ టిల్లు పాత్రకు ఈజీగా కనెక్ట్ అయ్యేవారు. ‘సినిమా టైటిల్ ఏంటి’ అని అడిగితే ‘నరుడు బ్రతుకు నటన’ అని చెప్పగానే ‘అవునా! సర్లే’ అంటూ ఓ రకమైన హావభావాలను ప్రకటించేవారు’’
‘‘ఆ తర్వాత పూర్తి కథను సిద్ధం చేసుకున్న తర్వాత ఓసారి త్రివిక్రమ్ గారికి వినిపించాం. సినిమా పేరు ‘నరుడు బ్రతుకు నటన’ అని చెప్పాం. అది విని ఆయన ‘ఎవరో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి స్ప్లెండర్‌పై వెళ్తున్న ఊహ కలుగుతోంది కదా’ అని అన్నారు. ఆయనకు కూడా డీజే టిల్లు పాత్ర, ఆ క్యారెక్టరైజేషన్ నచ్చింది. దీంతో మేము అనుకున్న టైటిల్‌ను పక్కన పెట్టేసి ‘డీజే టిల్లు’ పేరునే సినిమాకు పెట్టాం.’’ అని సిద్ధు వెల్లడించారు. 2022లో వచ్చిన ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.30 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ అయితే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. మరి ‘అట్లుంటది టిల్లుతోని..’
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 17:53 IST