అప్పుడు నేనొక్కదాన్నే సెలక్టయ్యా..!
‘సినిమాల్లో నటించాలంటే సినీ నేపథ్యం ఉండాలి.. అబ్బో అంత అదృష్టం మనకెక్కడిది..?’ చిన్నప్పుడు సినీ తారల్ని చూసి ఇలాగే అనుకునేదట అందాల భామ నిధి అగర్వాల్.

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

(Photos: Instagram)
‘సినిమాల్లో నటించాలంటే సినీ నేపథ్యం ఉండాలి.. అబ్బో అంత అదృష్టం మనకెక్కడిది..?’ చిన్నప్పుడు సినీ తారల్ని చూసి ఇలాగే అనుకునేదట అందాల భామ నిధి అగర్వాల్. అలాంటిది ఆడిషన్స్‌లో నాలుగు రౌండ్లు దాటి.. 300 మందిని వెనక్కి నెట్టి తొలి సినిమా అవకాశం దక్కించుకుందామె. అంతేకాదు.. ‘ఫస్ట్ ఈజ్ ది బెస్ట్’ అన్నట్లు తొలి చిత్రానికే ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డూ అందుకుంది. ఇక ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయి సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. మొన్నటికి మొన్న ‘హరిహర వీరమల్లు’లో మెరిసిన ఈ భామ.. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’తో మన ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదల సందర్భంగా అందాల ‘నిధి’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!
‘డ్యాన్స్’ లవర్!

సాధారణంగా తమ పిల్లలు చదువుతో పాటు ఇతర వ్యాపకాల్లోనూ రాణించాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. తాను స్కూలుకెళ్లే వయసులో తన తల్లి కూడా తాను అన్నింట్లోనూ రాణించాలని కోరుకునేది అంటోంది నిధి.
‘నేను పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా.. పెరిగింది బెంగళూరులో! అక్కడి పిల్లలు అటు చదువుతో పాటు ఇటు ఇతర వ్యాపకాల్లోనూ ముందుంటారు. నా విషయంలోనూ మా అమ్మ ఇదే కోరుకుంది. అందుకే చదువు, ఆటలు, డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చే స్కూల్‌ని ఏరి కోరి మరీ ఎంచుకొని అందులో నన్ను చేర్పించింది. నిజానికి అప్పుడు నాకు డ్యాన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అయినా అమ్మ ప్రోత్సాహంతో బ్యాలే నేర్చుకున్నా. ఈ క్రమంలోనే డ్యాన్స్‌పై నాకు ఇష్టం పెరిగింది. ఈ మక్కువతోనే ఆపై ట్యాప్, బెల్లీ డ్యాన్సుల్లో శిక్షణ తీసుకున్నా. ఇలా పాశ్చాత్య నృత్య శైలులే కాదు.. మన దేశ సంప్రదాయ నృత్యం కథక్‌లోనూ నాకు ప్రావీణ్యం ఉంది. నిజానికి ఈ డ్యాన్సే నేను సినిమాల్లోకి అడుగుపెట్టేందుకు ముఖ్య కారణమైంది. అందుకే నా జీవితంలో డ్యాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దీంతో పాటు గుర్రపుస్వారీ, ఇతర క్రీడల్లోనూ ప్రావీణ్యం సంపాదించా..’ అంటోన్న ఈ అందాల తార.. 2014లో ‘యమహా ఫ్యాసినో మిస్ దివా’ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఇదే ఈవెంట్‌లో ‘వుయ్ చాట్ మిస్ పాపులర్’ టైటిల్ గెలుచుకుంది.
‘ప్రతిభ’ ముఖ్యం!

సినిమాల్లోకి రావాలన్న కల చాలామందికి ఉంటుంది. కానీ ఈ అదృష్టం చాలా తక్కువమందిని వరిస్తుంది. అందులో తానుండడం అదృష్టమంటోంది నిధి.
‘నాకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. సెలవులొస్తే చాలు.. సినిమాలు చూడ్డానికే ఇష్టపడేదాన్ని. అయితే అందులో నటీనటుల్ని చూసినప్పుడల్లా.. ‘సినిమాల్లో నటించాలంటే సినీ నేపథ్యం ఉండాలి.. అబ్బో అంత అదృష్టం మనకెక్కడిది?’ అనుకునేదాన్ని. అయినా మనసులో ఎక్కడో ఓ మూల నటిని కావాలన్న చిన్న ఆశ. ఆ కోరిక 2016లో ‘మున్నా మైఖేల్’ అనే బాలీవుడ్ చిత్రంతో తీరింది. ఇందులో ట్రైటైగర్ ష్రాఫ్ సరసన నటించా. అయితే తొలి అవకాశం అంత సులభంగా ఏమీ రాలేదు. 300 మంది అమ్మాయిల్ని ఈ సినిమా కోసం ఆడిషన్ చేయగా.. వాళ్లలో నేనొక్కదాన్నే సెలక్ట్ అయ్యా. అప్పుడనిపించింది.. సినిమాల్లోకి రావాలంటే సినీ నేపథ్యం కాదు.. ప్రతిభ ముఖ్యమని!’ అంటోన్న నిధి.. తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్టు కొట్టింది. చదువు పరంగా.. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తిచేసిందీ చిన్నది.
‘బాహుబలి 3’ డ్రీమ్!

‘బాహుబలి’ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో నటించాలన్నది చాలామంది నటీనటుల కల. కానీ ఆ అవకాశాలు అందరికీ రాకపోవచ్చు. అలా తానూ ఈ ప్రాజెక్టులో భాగమవ్వాలనుకున్నట్లు గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది నిధి.
‘నా ఫేవరెట్ సినిమాల్లో బాహుబలి, బాహుబలి 2 ముందుంటాయి. నిజానికి ఇలాంటి సినిమాల్లో నటించాలంటే రాసి పెట్టి ఉండాలి. భవిష్యత్తులో వీటికి సీక్వెల్‌గా ‘బాహుబలి 3’ ఉంటే.. అందులో అవకాశమొస్తే కళ్లకద్దుకొని స్వీకరిస్తా. ఇక హారర్, రొమాంటిక్, కామెడీ, ఫ్యాంటసీ, యాక్షన్ చిత్రాల్లో నటించాలన్నది నా కోరిక. ‘రాజాసాబ్’ అలాంటి హారర్ కామెడీ సినిమానే! ఇక గతేడాది వచ్చిన ‘హరిహర వీరమల్లు’తో పిరియాడిక్ చిత్రాల్లో చేయాలన్న నా ఆశ నెరవేరింది..’ అని చెబుతోందీ ఇస్మార్ట్ బ్యూటీ.
పుస్తకాలు చదువుతా..!

ఇక కేవలం సినిమాలే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లో తనకు నచ్చిన ఎన్నో విషయాలపై దృష్టి పెడతానంటోందీ భామ.
‘షూటింగ్స్ నుంచి విరామం దొరికితే చాలు.. నా అభిరుచుల పైనే దృష్టి పెడుతుంటా. సాహిత్యం, ప్రాచీన అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతా. అక్కడితో ఆగిపోకుండా వాటిలో నాకు నచ్చిన అంశాల్ని అందరితో పంచుకుంటుంటా. చిన్నతనం నుంచి నాకు ఇదో అలవాటుగా మారిపోయింది. ఇక ఖాళీ సమయాల్లో డ్యాన్స్ చేయడం, స్నేహితులతో గడపడం, పచ్చటి ప్రకృతిలో సేదదీరడం నాకిష్టం. సంగీతమన్నా ప్రాణం పెడతా. ఎక్కువగా హిందీ పాటలు వింటా. అందులోనూ షారుఖ్ పాటలంటే చెవి కోసుకుంటా..’ అంటోంది నిధి.
అందం వెనుక.. ఆ జ్యూస్!

సినీ తారలు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వివిధ సౌందర్య చికిత్సలు తీసుకుంటుంటారు. కానీ తాను మాత్రం సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులకే ఓటేస్తానంటోంది నిధి.
‘రోజూ ఉదయాన్నే నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లు తాగడం నాకు అలవాటు. అప్పుడప్పుడూ ఈ నీళ్లలో ఉసిరి, అల్లం, సబ్జా గింజలు వేసుకొని తీసుకుంటా. ఈ జ్యూస్ నా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని రెట్టింపు చేసేందుకూ దోహదం చేస్తుంది. నేను నాన్ వెజ్ తినను. అయితే అప్పుడప్పుడూ ఉడికించిన గుడ్లు మాత్రం తీసుకుంటా. ఇక ఇడ్లీ అంటే ప్రాణం. రోజూ మూడు పూటలా ఇడ్లీ పెట్టినా హ్యాపీగా లాగించేస్తా. ఎంత బిజీగా ఉన్నా వ్యాయామం మాత్రం మానను. యోగా, మానసిక ప్రశాంతత కోసం విపాసన ధ్యానం సాధన చేస్తా. ఈ రెండూ నేను మా అమ్మ నుంచి నేర్చుకున్నా..’ అంటూ తన హెల్దీ రొటీన్ గురించి ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ చక్కనమ్మ.
► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Jan 2026 19:11 IST