The Rajasaab Review: రివ్యూ: ‘ది రాజాసాబ్’.. ప్రభాస్ ఫాంటసీ హారర్ కామెడీ ఎలా ఉంది?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
The Raja Saab Review Telugu || చిత్రం: ది రాజాసాబ్; నటీనటులు: ప్రభాస్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్, జరీనా వాహబ్, సముద్రఖని, వీటీవీ గణేశ్, సత్య, సప్తగిరి తదితరులు; సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: కార్తిక్ పళణి; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు; నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, ఇషాన్ సక్సేనా; రచన, దర్శకత్వం: మారుతి; విడుదల: 09-01-2026

ఇటీవల కాలంలో అగ్ర కథానాయకుడు ప్రభాస్ ( Prabhas) నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా సీరియస్ సబ్జెక్ట్‌లే. అభిమానులు వింటేజ్ ప్రభాస్‌ను చూసి చాలా కాలమైంది. ఆ లోటును తీర్చడానికే వస్తున్నామంటూ ప్రచార చిత్రాలతోనే ఆసక్తిని పెంచారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ హారర్ కామెడీ ‘ది రాజాసాబ్’. ట్రైలర్‌తోనే అంచనాలను పెంచిన ఈ మూవీ ఎలా ఉంది? (Rajasaab Review) ఎలాంటి థ్రిల్ పంచింది?
కథేంటంటే...
Rajasaab Story || దేవనగర సంస్థానానికి ఒకప్పుడు జమిందారు గంగాదేవి (జరీనా వహాబ్). అంత గొప్ప నేపథ్యమున్నా తన మనవడు రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్)తో కలిసి గంగమ్మగా సాధారణ జీవితం గడుపుతుంటుంది. తన నానమ్మ అంటే రాజుకు ప్రాణం. వయసు ప్రభావం కారణంగా మతిమరుపు సమస్యలతో బాధపడుతూ ఉంటుంది గంగమ్మ. తనకు సంబంధించిన చాలా విషయాల్ని మరిచిపోయినా తన భర్త కనకరాజు (సంజయ్‌దత్)ని మాత్రం మరిచిపోదు. తనకు కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని రాజాసాబ్‌ని కోరుతుంది. కానీ, కనకరాజే తనకున్న రకరకాల విద్యలతో నాన్నమ్మ, మనవడిని నర్సాపూర్ అడవిలోని రాజమహల్‌కి వచ్చేలా చేస్తాడు. ఒక దశలో ఇద్దరినీ చంపేయాలని కూడా అనుకుంటాడు. మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు కనకరాజు గతమేమిటి?అతని లక్ష్యమేమిటి?రాజాసాబ్ జీవితంలోకి వచ్చిన ముగ్గురమ్మాయిలు భైరవి (మాళవిక మోహనన్), బ్లెస్సీ (నిధి అగర్వాల్) అనిత (రిద్ది కుమార్) ఎవరు? తదితర విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
The raja saab review || కొంతకాలంగా లార్జర్ దేన్ లైఫ్ తరహా సినిమాలతోనే ప్రయాణం చేస్తున్న ప్రభాస్ ఓ కొత్త జోనర్‌లో సినిమా చేయాలనుకోవడం... అలాంటి స్టార్ కథానాయకుడితో దర్శకుడు మారుతిఓ హారర్ ఫాంటసీ సినిమా చేయాలనుకోవడం మంచి పరిణామాలే. ఇలాంటి ప్రయత్నాలతోనే కొత్త కథలు వెలుగులోకి వస్తుంటాయి. సినిమా ఆరంభమయ్యాక ఒకప్పటి ప్రభాస్ మళ్లీ తెరపై కనిపించిన అనుభూతి నిస్సందేహంగా కలుగుతుంది. చాలా ఏళ్లుగా మిస్ అయిన డార్లింగ్‌లోని కామెడీ కోణాన్ని ఇందులో చూపించేందుకు దర్శకుడు మారుతి చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన రాసుకున్న కాన్సెప్ట్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ, దాన్ని తెరపైకి తీసుకు రావడంలో మాత్రం కాస్త తడబాటు కనిపించింది. ముఖ్యంగా ప్రథమార్ధంలోని సన్నివేశాలు అనుకున్నంత ప్రభావం చూపించకుండానే సాగిపోతుంటాయి. రాజ్ మహల్‌లోకి అడుగుపెట్టే సన్నివేశం కాస్త ఉత్కంఠ రేకెత్తిస్తుందంతే. హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ, కథలో టెన్షన్ బిల్డప్ కాకపోవడంతో అవి అంతగా ప్రభావం చూపించవు. కామెడీ సన్నివేశాలూ ఉంటాయి. చాలా సినిమాల్లో చూసిందే కదా అనిపిస్తుంది తప్ప, ఏదీ కొత్తగా అనిపించదు. పాటలూ అంతగా మెప్పించవు.

ప్రభాస్ వర్సెస్ సంజయ్ దత్ అన్నట్టుగా కథ మారిపోయాక ద్వితీయార్ధంపై కాస్త ఆసక్తి కలుగుతుంది. సుదీర్ఘంగా సాగే పతాక సన్నివేశాలే ఈ సినిమాకి హైలైట్. కనకరాజు, గంగాదేవిల కథ, కనకరాజు పాత్రలో సంజయ్ దత్ ఆడే మైండ్ గేమ్, మార్మిక విద్యలతో ఆ పాత్ర హీరోకి సవాల్ విసిరే తీరు, బలమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తీర్చిదిద్దిన ఆయా సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయి. వాటిలో ప్రభాస్ కనిపించిన విధానం, ఆయన చేసిన యాక్షన్, కామెడీ కూడా మెప్పిస్తుంది. ట్రైలర్‌లో చూపించిన చాలా సన్నివేశాలు సినిమాలో కనిపించలేదు. ‘రాజాసాబ్ సర్కస్’అంటూ కొనసాగింపునకు లీడ్ ఇచ్చారు. మరి రెండో భాగంలో చూపిస్తారేమో ఆ సన్నివేశాలన్నీ. మొత్తంగా ప్రభాస్‌ని చాలా రోజుల తర్వాత ఓ కొత్త జోనర్‌లో, కామెడీ పాత్రలో చూశామన్న అనుభూతి కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే..
the raja saab cast || ప్రభాస్( Prabhas) ఆద్యంతం ఉత్సాహంగా కనిపిస్తూ నవ్వులు పండించే ప్రయత్నం చేశారు. ఇందులో ఆయన లుక్ కూడా స్టైలిష్‌గా, అభిమానులకు నచ్చేలా ఉంటుంది. పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది. కథానాయికల్లో మాళవిక మోహనన్తెరపై ఎక్కువసేపు కనిపిస్తుంది. ఆమె అందంగా కనిపించడంతోపాటు, ఓ యాక్షన్ ఘట్టంలోనూ మెరిసింది. నిధి అగర్వాల్పాటల్లో మాత్రమే ప్రధాన ఆకర్షణ. రిద్దికుమార్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. కథలో కీలకమైన కనకరాజు పాత్రలో సంజయ్‌దత్కనిపించిన తీరు బాగుంది. అయితే హిప్నాటిస్ట్, సైకియాట్రిస్ట్ అంటూ ఆ పాత్రని పరిచయం చేసిన స్థాయిలో మాత్రం తెరపై కనిపించదు. జరీనా వాహబ్పాత్ర ఈ సినిమాకి కీలకం. ఇది మనవడు, నానమ్మ కథ కావడంతోనే జరీనా వాహబ్ పాత్రకి ప్రాధాన్యం దక్కింది. బొమన్ ఇరానీ, సముద్రఖని తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. ప్రభాస్‌శ్రీను, సప్తగిరి, సత్య, వీటీవీ గణేశ్ అక్కడక్కడా నవ్వించారంతే. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. కార్తీక్ పళని కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, రచనలో లోటుపాట్లు కనిపిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ మెప్పిస్తాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
- బలాలు
- + ప్రభాస్ నటన... లుక్
- + పతాక సన్నివేశాలు
- + హారర్ ఫాంటసీ కాన్సెప్ట్
- బలహీనతలు
- - కొత్తదనం లేని కథనం
- - తేలిపోయిన హాస్యం
- చివరిగా: ది రాజాసాబ్... ప్రభాస్ కోసం! (raja saab movie review)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 06:23 IST