constable kanakam season 2 Review: వెబ్‌సిరీస్ రివ్యూ: కానిస్టేబుల్ కనకం: సీజన్-2.. చంద్రిక బతికే ఉందా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Constable Kanakam2 Review || వెబ్‌సిరీస్: కానిస్టేబుల్ కనకం: సీజన్-2; నటీనటులు: వర్ష బొల్లమ్మ, మేఘ లేఖ, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, రమణ భార్గవ్ తదితరులు; సంగీతం: సురేశ్ బొబ్బిలి; దర్శకత్వం: ప్రశాంత్ కుమార్ దిమ్మల; నిర్మాత: సాయిబాబా కొవెలమూడి, వేమూరి హేమంత్ కుమార్; స్ట్రీమింగ్ వేదిక: ఈటీవీ విన్

కొన్ని రోజుల కిందట ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో వచ్చి ప్రేక్షకులకు థ్రిల్ పంచిన వెబ్‌సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్‌కు కొనసాగింపు ఉంటుందని చివరిలో చూపించారు. మరి ఇప్పుడు వచ్చిన సీజన్2 ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్‌ని పంచింది.
కథేంటంటే..
శ్రీకాకుళం జిల్లా రేపల్లె గ్రామ సమీపంలోని అడవిగుట్ట వైపు వెళ్లిన మహిళలు కనిపించకుండా పోతారు. ఆ మిస్టరీని మహిళా కానిస్టేబుల్ కనక మహాలక్ష్మీ అలియాస్ కనకం (వర్ష బొల్లమ్మ) ఛేదిస్తుంది. అయితే, తన ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాలు చంద్రిక (మేఘ లేఖ) ఆచూకీని మాత్రం కనుగొనలేకపోతుంది. అందరూ చంద్రిక చనిపోయిందని అనుకుంటారు. పోలీసులు కూడా ఆ కేసును సీపీ ఆఫీస్‌కు పంపేస్తారు. అయితే, చంద్రిక బతికే ఉందని కనకం బలంగా నమ్ముతుంది. మరి కనకం భావిస్తున్నట్లు చంద్రిక బతికే ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ఆ మిస్టరీని కనకం ఎలా ఛేదించింది? అన్నదే సీజన్-2 కథ.
ఎలా ఉందంటే..?
తొలి సీజన్‌లో ‘కానిస్టేబుల్ కనకం’ ప్రపంచం, అందులోని పాత్రలను పరిచయం చేయడానికి కాస్త సమయం పట్టినా, ఇందులో నేరుగా అసలు కథలోకి వచ్చేశాడు దర్శకుడు. సిరీస్ మొదలవడమే.. చంద్రిక ఏమైందన్న కోణం నుంచి సాగుతుంది. ఈ క్రమంలో కనకానికి ఎదురయ్యే పరిస్థితులు వాటిని తన తెలివి తేటలతో విశ్లేషించుకుంటూ సాగించే ఇన్వెస్టిగేషన్ ఆద్యంతం అలరిస్తుంది. ముఖ్యంగా చంద్రిక అదృశ్యం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఉత్కంఠ కలిగిస్తాయి. ఈ క్రమంలో కొత్త పాత్రలను పరిచయం చేసుకుంటూ వెళ్లారు. చంద్రిక తల్లిదండ్రులు, స్నేహితులు, ఆమె నేపథ్యం.. ఇలా కథను మరింత లోతుగా, భిన్న పార్శ్వాల్లో చూపించారు. కనకం ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ వచ్చే మలుపులు అలరిస్తాయి. చంద్రిక తల్లిదండ్రులు, ఆమె ఆయా పాత్రకున్న నేపథ్యం కథపై మరింత ఆసక్తిని పెంచుతాయి. ఉన్నవి నాలుగు ఎపిసోడ్‌లే అయినా, ముగింపు వచ్చే సరికి అప్పుడే అయిపోయిందా? అనే ఫీల్ కలుగుతుంది. సాధారణ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ విషయంలో ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోబెట్టడానికి కథ, కథనాలు సాగదీస్తారు. సీజన్2 విషయంలో అలా జరగలేదు. ఈ సీజన్ ముగింపు దిశగా వెళుతున్న కొద్దీ కథలో వచ్చే మార్పులు, బయటకు వచ్చే ట్విస్ట్‌లు అలరిస్తాయి. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ సీజన్2కే హైలైట్ అని చెప్పవచ్చు. కానిస్టేబుల్ కనకం సీజన్:3 ఉందని టీమ్ ప్రకటించింది.
ఎవరెలా చేశారంటే..
సీజన్1లో అడవిగుట్ట మర్మం ఛేదించే మహిళా కానిస్టేబుల్‌గా కనకం పాత్రలో వర్షబొల్లమ్మ సహజంగా నటించింది. ఇందులోనూ అదే జోరు కొనసాగించింది. సిరీస్ మొత్తం తన భుజాలపైనే మోసింది. ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే, ఇందులో కొత్త పాత్రలు, వారి నటన అలరిస్తాయి. ముఖ్యంగా చంద్రికగా మేఘలేఖ నటన ఆకట్టుకుంది. ఆమె పాత్రకు సంబంధించిన ట్విస్ట్ స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుంది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. చంద్రిక ఆయాగా చేసిన పాత్ర ట్విస్ట్ కూడా మెప్పిస్తుంది. సాంకేతికంగా సిరీస్ బాగుంది. సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాల్లో గాఢతను పెంచింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. దర్శకుడు కథ, కథనాలు, క్లైమాక్స్‌ని బాగా డిజైన్ చేసుకున్నారు. చివరి వరకూ ఆ ఉత్కంఠను కొనసాగించడంలో విజయం సాధించారు.
- కుటుంబంతో చూడొచ్చా?: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఎలాంటి అసభ్య, అభ్యంతరకర సన్నివేశాలు లేవు. సీజన్1 చూడకపోతే, సీజన్2 కాస్త అర్థం కాదు.
- చివరిగా: ట్విస్ట్‌లతో థ్రిల్ పంచే ‘కానిస్టేబుల్ కనకం: సీజన్2..
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 15:40 IST