పరిచయ ఫలాలు

Eenadu icon
By Editorial Team Published : 24 Dec 2025 03:03 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

‘నమస్కారం.. కులాసానా?’
‘ఆ.. ఏం కులాసాలెండి’
ఓ సంస్కారవంతమైన పలకరింపునకు విసురుగా వచ్చిన జవాబుతో సంభాషణకు ఫుల్‌స్టాప్‌ పడిపోతుంది. అదే విజ్ఞతతో కూడిన సమాధానమైతే.. ‘నమస్తే.. కులాసాండీ...’ అనే ఒద్దికైన మాటతో ఆ సంభాషణ అలాఅలా పరిచయమనే పలకమీద ఓనమాలు దిద్దుకుంటుంది. అదీ పలుకుల బడిలో పలుకుబడి తరగతులకు పెద్ద బాలశిక్ష. కలుపుగోలుతనం అనే లక్షణం పెంపొందించుకోవడం సామాజిక జీవనానికి సంజీవని మూలిక లాంటిది. అలా అని ముఖపరిచయ మాత్రాన ముఖ్యమైన వ్యక్తిగత వివరాలన్నీ మూటగట్టి అప్పజెప్పేయమని కాదు. అక్కరకు రాని అమాయకత్వంతో అసలుకే ఎసరు పెట్టుకోమని కాదు. ఆచితూచి మాట్లాడటం, ఆమూలాగ్ర పరిశీలన, అవతలి వ్యక్తి చూపు, పలుకు, శరీరభాషల గమనింపు తప్పనిసరి. అపరిచితులనగానే అనుమానించి అవమానించక్కరలేదు. అలాగని అట్టుపుట్టు ఆనవాళ్లను... అంటే మన పుట్టుపూర్వోత్తరాలన్నీ పళ్లెంలో పెట్టి ఇచ్చేయనక్కరలేదు కూడా.

ఏ పుట్టలో ఏ పాముందో అనే యోచనతో పాటు ఏ ఎరుకతో ఎంత మెరుగుపడబోతున్నామో అనే చింతన కూడా అవసరం. లేచిన వేళావిశేషం, చూసిన ముహూర్త బలం అని పెద్దలంటూంటారు. అవి అలా ఫలించాలంటే మనం చేస్తున్న కృషి వల్ల కలిగే తృప్తి, సంతుష్టి కను కొనలలో కళలీనాలి. ముఖ ప్రమిదలో తళుక్కుమనాలి. అలా కాకుంటే అలనాడు గుడివాడ స్టేషన్‌లో ఆగిన రైలు కిటికీలోంచి క్షణకాలం ప్రసరించిన చూపును ఓ బాల కళాకారుడు ఆకర్షించగలిగేవాడా?! అనంతర కాలంలో దశాబ్దాల పాటు వెండితెరను ఏలగలిగేవాడా? ఆ చూపు దర్శకులు ఘంటసాల బలరామయ్యదైతే ఆ బాల నటరాజసం అనంతర కాలాన ఏఎన్నార్‌గా ఎదిగిన అక్కినేని నాగేశ్వరరావుది.
యువ నరేంద్రుడి అన్వేషణ ఆదిలోనే ఆగిపోయుంటే రామకృష్ణ పరమహంసతో పరిచయం జరిగేదా, స్వామి వివేకానందుడిగా ఖండాంతరాలలో భారతీయ తత్త్వజ్యోతి వెలుగులీనేదా?! శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ‘వడ్లగింజలు’ కథలో తంగిరాల శంకరప్ప సాధించిన చదరంగ క్రీడా విజయ నేపథ్యం అంచెలంచెల పరిచయాల నిచ్చెనల హెచ్చవేతలతోనే కదా!

రైలు పరిచయాలు, హోటళ్లలో టిఫిన్‌ బల్ల పలకరింపులు, బస్టాపుల భాషణలు, పుస్తక ప్రదర్శనలు, ఎగ్జిబిషన్ల వంటి నలుగురు కలిసి నవ్వే చోటుల్లో కాసింత పెదవి బిగింపులు సడలనివ్వండి. అవతలి ముఖంలో నిజాయతీ కనిపిస్తే ఫోన్‌ నెంబర్‌ ఇవ్వొచ్చు. దగాకోరుదనం కోరచూపులు చూస్తే వేగం తగ్గించి వెనకడుగు వేయొచ్చు. కలివిడితనంలో తెలివిడి ఉపయోగంతో అన్నీ కలిసొచ్చినట్లయితే నిలకడ పునాదుల మీద నిజమైన స్నేహసౌధం నిటారుగా నిలబడుతుంది. పెళ్లిళ్లూ కావచ్చు, ఉద్యోగాలూ రావచ్చు. ఊళ్లేలనూవచ్చు. కాకపోతే మరీ బొత్తిగా ముక్కూ మొహం తెలిసిపోయాయోచ్‌ అనుకుంటూ సోషల్‌ మీడియా పరిచయాలతో చిన్నప్పటి ఉగ్గుగిన్నె మొదలు పిల్లో పిల్లాడికో పెట్టాల్సిన పెట్టుపోతల నగల వరకూ వివరాల తాళంచేతులిచ్చేయడం లాంటివి మాత్రం అతి. అది, సర్వత్ర వర్జయేత్‌. కానీ, సవ్యంగా ఉంటే పరిచయాలిచ్చే ఫలమాధుర్యమే వేరు.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.