
సాక్షి, తాడేపల్లి:క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఓ సందేశం విడుదల చేయడంతో పాటు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
‘‘దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు.. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు..
..దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయి అని వైఎస్ వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షల్లో తెలియజేశారు.
ఈ ఉదయం ఎక్స్ ఖాతాలో.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు!. ఈ పండుగ రోజు మనం కొత్త ఆశతో, మంచి భవిష్యత్తు కోసం కలిసి ముందుకు సాగుదాం. సాటి మనుషులకు సహాయం చేస్తూ, ఆనందం పంచుకుందాం. మెర్రీ క్రిస్మస్! అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
‘ఈరోజు ఎంతో సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. ఒక నూతన విశ్వాసం ఆవిర్భవించిన ఈవేళ, మానవత్వాన్ని మరింత పరిమళింపచేసేలా, మన అంకితభావాన్ని పునరుద్ధరిస్తూ.. తద్వారా ప్రజలందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా ముందుకు సాగుదాం’. మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అని తెలియజేశారాయన.