మామా... స్కోర్ చేశావా!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, హైదరాబాద్ : ఒకవైపు మాదకద్రవ్యాల కట్టడిలో కఠినంగా వ్యవహరిస్తుంటే...మరో వైపు మత్తు ముఠాలు కొత్త మార్గాలు వెతుకుతున్నాయి. ప్రధాన స్మగ్లర్లు విదేశాల్లో ఉంటూనే దేశంలోని ప్రధాన నగరాలకు సింథటిక్ డ్రగ్స్ చేరవేసేందుకు నయా ఎత్తులు వేస్తున్నారు. సరకు లావాదేవీలకు కోడ్‌భాష ప్రయోగించి పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్స్ దందాలో పరిచయమై.. ప్రేమికులుగా మారిన.. సహజీవనం సాగిస్తున్న జంటలను మాదకద్రవ్యాలు తరలించేందుకు ఏజెంట్లుగా మలచుకుంటున్నట్లు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(హెచ్‌న్యూ) దర్యాప్తులో గుర్తించింది.
యువతులకు ఉచితంగా ఇస్తూ..
యెమెన్ నుంచి స్టూడెంట్ వీసాపై భారత్ వచ్చిన యువకుడు.. మూడునెలలకో నగరం మారుతూ డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ఆరితేరాడు. హైదరాబాద్, బెంగళూరు, గోవాల్లో ఐదు ఇళ్లను అద్దెకు తీసుకున్నాడు. ఏడుగురితో సహజీవనం సాగిస్తున్నాడు. తాజాగా నగర పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినపుడు ఈ విషయాలు బయటపడ్డాయి. వీసా గడువు ముగిసి నాలుగేళ్లయినా ప్రాంతం మారుతూ దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తేల్చారు. మత్తుపదార్థాల సరఫరాకు తనతో సన్నిహితంగా ఉండే నలుగురు యువతులు.. వారి బాయ్‌ఫ్రెండ్స్‌ను పావులుగా వాడుకున్నట్టు నిర్ధారించారు. నైజీరియన్లు, డ్రగ్‌కింగ్‌పిన్‌లు పబ్‌లు, పార్టీల్లో మత్తు పదార్థాలకు అలవాటుపడిన యువతులను గుర్తించి.. వారికి సింథటిక్ డ్రగ్స్ ఉచితంగా ఇస్తూ దగ్గరవుతున్నారు. ప్రేమ.. సహజీవనం ముసుగులో దగ్గరై అమ్మాయిలతో డ్రగ్స్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో అధికశాతం ఉద్యోగం, ఉపాధి కోసం ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలే ఉంటున్నారు. కొంపల్లి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతికి ఒక నైజీరియన్ ప్రేమ వల విసిరాడు. ఆమె ఉంటున్న ఇంటినే మత్తుపదార్థాల అడ్డాగా మార్చుకున్నాడు.
బకరా వచ్చిందా.. సీ నచ్చిందా
డ్రగ్స్ లావాదేవీల్లో నిందితులు సామాజిక మాధ్యమాల యాప్‌లతో మంతనాలు జరుపుతున్నారు. ఏయే సరకు ఎంత పరిమాణంలో కావాలనే వాటి కోసం కోడ్‌భాష ప్రయోగిస్తున్నారు. మూడు ప్రశ్నార్థకాలు(???)... మాల్ కావాలంటూ ఆర్డర్.. అట్నుంచి మూడు చుక్కలు(...) వచ్చాయంటే సరకు రెడీగా ఉన్నట్టు అర్థం. ఓషన్ గంజా కోసం గ్రీన్. ఎండీఎంఏ కొనుగోలుదారులు... ఐస్ కావాలని ఆర్డరిస్తారు. కొకైన్ కోసం సీ(సముద్రం) సింబాలిక్ గుర్తు.. వాడుతున్నారని పోలీసు అధికారి తెలిపారు. ముంబయిలో స్మగ్లర్లు ఎండీఎంఏకు ఇచ్చిన కోడ్ బకరా. ఎన్ని బకరాలు కావాలంటే.. అన్ని అంకెలు వేయాలి. డ్రగ్స్ సరఫరాలో అన్నిరకాల డ్రగ్స్‌కు కామన్ కోడ్ లాంగ్వేజ్ ‘స్కోర్’ సరకు కావాలంటే మామా.. స్కోర్ చేశావా! అంటూ ఆర్డర్ వస్తుంది. అక్కడ సరకు సిద్ధంగా ఉంటే.. స్కోర్ చేశానంటూ బదులిస్తారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.