How to Protect Your Fridge from Hackers Explainer

ఫ్రిజ్‌ల నుంచి సెక్యూరిటీ కెమెరాల వరకు ఇంటర్నెట్‌కు అనుసంధానమయ్యే పరికరాలన్నీ సైబర్‌ నేరగాళ్లకు లక్ష్యాలుగా మారుతున్నాయి. ఇటీవల ఫ్రాన్స్‌లో దాదాపు 700 సూపర్‌ మార్కెట్లలో కూలింగ్‌ వ్యవస్థలపై సైబర్‌ నేరస్తులు దాడి చేసి రిఫ్రిజిరేషన్‌ వ్యవస్థల సెట్టింగ్‌లను మార్చేయడంతో కూలింగ్‌ ఆగిపోయి రిఫ్రిజిరేటర్లలోని కూరగా­యలు, పాలు, పండ్లు, మాంసం తదితర నిత్యావసరాలన్నీ పాడైపోయాయి. ఈ నేపథ్యంలో ఏయే పరికరాలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయి? సైబర్‌ దాడుల నుంచి పరికరాలను కాపాడుకోవడానికి భద్రతా నిపుణులు చెబుతున్న చిట్కాలేంటి?

ఏయే పరికరాలను హ్యాక్‌ చేయవచ్చు?
స్మార్ట్‌ టీవీలు, సెక్యూరిటీ కెమెరాలు, వీడియో డోర్‌బెల్స్, అలారం వ్యవస్థలు, స్మార్ట్‌ లాక్‌లు, థర్మోస్టాట్లు, ఇంటర్నెట్‌కు అనుసంధానమైన గృహోపకరణాలు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని టూత్‌బ్రష్‌లు కూడా ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అవుతున్నాయి. ముఖ్యంగా రూటర్లు హ్యాకర్లకు ప్రధాన లక్ష్యాలుగా మారుతు­న్నాయి. సైబర్‌ సెక్యూరిటీ పరిశ్రమ గణాంకాల ప్రకారం కనెక్ట్‌ అయిన పరికరాలపై జరిగే దాడుల్లో మూడొంతు­లకుపైగా రూటర్లపైనే జరుగుతున్నాయి.

హ్యాకర్లు  ఏం చేయగలరు?
స్మార్ట్‌ పరికరాల్లోని సమాచారాన్ని హ్యాకర్లు యాక్సెస్‌ చేయవచ్చు, సెట్టింగ్‌లను మార్చవచ్చు లేదా వాటి పనితీరుకు అంతరాయం కలిగించవచ్చు. హ్యాక్‌కు గురైన కెమెరా ద్వారా ఇంట్లో జరిగే కార్యకలాపాలను గమనించవచ్చు. ఫ్రిజ్‌ను హ్యాక్‌ చేస్తే దాని నియంత్రణ సెట్టింగ్‌లను మార్చవచ్చు. అంతేకాదు.. ఒక పరికరంలోకి చొరబడిన హ్యాకర్లు అదే నెట్‌వర్క్‌లో అనుసంధానమైన ఇతర వ్యవస్థలను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చు.

కార్లు, కీలక మౌలిక సదుపాయాలనూ హ్యాక్‌ చేయగలరా?
2015లో జీప్‌ కంపెనీ కార్లలోని వినోద వ్యవస్థపై జరిగిన రిమోట్‌ సైబర్‌ దాడి కారణంగా సుమారు 14 లక్షల వాహనాలను వెనక్కి పిలిపించాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో కియా కార్లలోని కొన్ని లోపాల వల్ల లైసెన్స్‌ ప్లేట్‌ నంబర్‌ ఆధారంగా వాహనాలను ట్రాక్‌ చేయడం, అన్‌లాక్‌ చేయడం, స్టార్ట్‌ చేయడం సాధ్యమవుతోందని పరిశోధకులు గుర్తించారు. ఈ లోపాలను కియా సంస్థకు తెలియజేయగా వాటిని సరిచేసినట్లు సమాచారం. విద్యుత్, నీటి సరఫరా నెట్‌వర్క్‌లకూ సైబర్‌ ముప్పులు ఉన్నాయి. అయితే గృహోపకరణాలతో పోలిస్తే వాటికి సాధారణంగా మరిన్ని భద్రతా చర్యలు ఉంటాయి.

ఇదీ చ‌ద‌వండి:ఆఫర్‌ ఓకే..! అవసరమెంత?

నా ఫ్రిజ్‌ను కూడా హ్యాక్‌ చేయగలరా?
సిద్ధాంతపరంగా సాధ్యమే. ఇంటర్నెట్‌కు అనుసంధానమైన ఏ పరికరమైనా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. 2015లో శాంసంగ్‌ స్మార్ట్‌ ఫ్రిజ్‌ను హ్యాక్‌ చేసి దాని ద్వారా కొంత ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ను మధ్యలో అడ్డుకోవచ్చని పరిశోధకులు ప్రదర్శించారు.

మీ పరికరాలను ఎలా రక్షించుకోవాలి?

సైబర్‌ భద్రతా నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు ఇవీ..

డిఫాల్ట్‌ పాస్‌వర్డ్‌లను మార్చండి 
ప్రతి పరికరానికి బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి.

టూ–ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను ప్రారంభించండి
అదనపు భద్రతా పొరను ఏర్పాటు చేసుకోండి.

ఇదీ చ‌ద‌వండి:గాల్లో ఎగిరిన Tesla కారు.. మస్క్ మరో ప్రయోగం!

సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయండి
పరికరాలకు అందుబాటులో ఉన్న భద్రతా అప్‌డేట్‌లను క్రమం తప్పకుండా ఇన్‌స్టాల్‌ చేయండి.

పాత పరికరాలను మార్చండి
భద్రతా అప్‌డేట్‌లు అందని పరికరాలను కొత్త వాటితో భర్తీ చేయండి.

ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఉపయోగించండి
సాధ్యమైనంత వరకు స్మార్ట్‌ గృహోపకరణాలను ఇతర ముఖ్యమైన పరికరాల నుంచి వేరు చేసిన స్థానిక నెట్‌వర్క్‌లో ఉంచండి.

అవసరమైనప్పుడే ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ చేయండి
ఇంటర్నెట్‌ అవసరం లేని పరికరాలకు కనెక్షన్‌ను నిలిపివేయండి.

గుర్తుంచుకోండి
ఇంటర్నెట్‌కు అనుసంధానించే పరికరాల సంఖ్య ఎంత తక్కువగా ఉంటే హ్యాకర్లకు అందుబాటులో ఉండే ప్రవేశ మార్గాల సంఖ్య కూడా అంత తక్కువగా ఉంటుంది.