IIT Hyderabad Launches India First Credit Course on Goodness

గుడ్‌నెస్‌ క్రెడిట్‌ కోర్సులో చేరిన ఐఐటీహెచ్‌ విద్యార్థులు

దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి:సమాజం పట్ల, సాటి మనుషుల పట్ల ఎలాంటి బాధ్యతతో ఉండాలి.. మంచి జీవన విధానం అంటే ఏమిటి.. ఆదాయ, హోదాకు అతీతంగా విజయాన్ని ఎలా అందుకోవాలి.. వంటి అంశాలను బోధించే గుడ్‌నెస్‌పై క్రెడిట్‌ కోర్స్‌ను ఐఐటీ హైదరాబాద్‌ ప్రవేశపెట్టింది. దేశంలోనే మొట్టమొదటి ఈ క్రెడిట్‌ కోర్సులో అండర్‌ గ్రాడ్యుయేట్‌ చదువుతున్న 140 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు ఐఐటీహెచ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రోజువారీ దినచర్యలో మంచితనాన్ని ఎలా ఆచరించవచ్చు.. తదితర అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు.

విద్యా, వృత్తిపరమైన నైపుణ్యాలకు అతీతంగా విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదల, బాధ్యత తదితర అంశాలు ఉంటాయి. మంచితనాన్ని అర్థం చేసుకోవడం నుంచి దానిని ఆచరించేలా.. మరింత బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారేలా విద్యార్థులను నడిపించడం ఈ కోర్సు లక్ష్యమని.. తాము ఎలాంటి భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడాలనుకుంటున్నారో అనే దానిపై ఓ ఆలోచనతో ఈ కోర్సు ముగుస్తుందని పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గుడ్‌నెస్‌ వ్యవస్థాపకుడు, ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థి రవి శర్మ ఈ కోర్సును బోధిస్తారు.

హెచ్‌సీయూ, మిబయోమ్‌ థెరప్యూటిక్స్‌ ఆవిష్కరణకు పేటెంట్‌
రాయదుర్గం: రోగ నిర్ధారణలో మరో ప్రధాన మైలురాయి చోటుచేసుకుంది. హెచ్‌సీయూ, మిబయోమ్‌ థెరప్యూటిక్స్‌ ఎల్‌ఎల్‌పి సంయుక్తంగా ‘అల్ట్రా–హై–త్రూపుట్‌ మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్స్‌ అండ్‌ స్క్రీనింగ్‌’ వ్యూహానికి భారతీయ పేటెంట్‌ను పొందాయి.

అత్యంత సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్‌ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో ప్రారంభించిన ఒక ఉమ్మడి సహకార పరిశోధన కార్యక్రమం నుంచి ఈ పేటెంట్‌ పొందిన ఆవిష్కరణ ఆవిర్భవించింది. హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ శ్రీనివాసులు కురుకుంటి, మిబయోమ్‌ థెరప్యూటిక్స్‌ ఎల్‌ఎల్‌పికి చెందిన డాక్టర్‌ గౌతమ్‌ దాస్‌ సంయుక్తంగా ఈ ఆవిష్కరణ కోసం కృషి చేశారు. 

ఇదీ చ‌ద‌వండి:హైదరాబాద్‌ నడిబొడ్డున 35 అంతస్తుల భవనమా?   

26 నుంచి ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు
సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఫీజు చెల్లించే గడువును ఇంటర్‌ బోర్డ్‌ గురువారం ప్రకటించింది. ఈ పరీక్షలు మార్చి 2027లో జరుగుతాయి. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు ఈ నెల 26 నుంచి నవంబర్‌ 9 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ. 100 ఆలస్య రుసుముతో నవంబర్‌ 11 నుంచి 20 వరకూ, రూ. 500 లేట్‌ ఫీజుతో వచ్చే నెల 22 నుంచి 29 వరకూ, రూ. వెయ్యి ఫీజుతో డిసెంబర్‌ 1 నుంచి 7 వరకూ, రూ. 2 వేల లేట్‌ ఫీజుతో డిసెంబర్‌ 14 వరకూ చెల్లించవచ్చు. ఫీజు వివరాలు సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్ల దగ్గర లభిస్తాయని బోర్డ్‌ తెలిపింది.